లక్సెట్టిపేట : పశు సంపద మానవులకు ఎన్నో విధాలుగా మేలు చేస్తూ లాభాలనిస్తోంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. కాలం, వాతావరణాన్ని బట్టి మానవుల మాదిరిగానే పశువుల్లోనూ వ్యాధులు వస్తుంటాయి. సీజనల్ వ్యాధులపై జాగ్రత్త వహించాలి. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు, ఇతర వ్యాధుల బారి నుంచి వాటిని కాపాడుకోవాలి.
పశువులకు సీజనల్‌గా వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండి తొలిదశలోనే గుర్తిస్తే నివారణ సులభమని లక్సెట్టిపే పశు వైద్యాధికారి వీరయ్య వివరించారు. వర్షాకాలంలో పరిసరాల ప్రభావం, వరద నీళ్లు, మెలిచిన పసక గడ్డిపైన ఉండే కీటకాలు, అటువంటి మేత తినడం వల్ల గేదెలు, మేకలు, గొర్రెలు, రకరకాల పశువులకు పలురకాల వ్యాధులు సోకి అనారోగ్యానికి గురవుతాయి. దీని వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అంటువ్యాధుల బారిన పడి చివరకు చనిపోయే ప్రమాదం ఉంటుంది.
వ్యాధులు.. నివారణ..
గొంతు వాపు వ్యాధి : ఈ వ్యాధిని గురకవ్యాధి అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మ జీవుల వలన సంక్రమిస్తుంది. కలుషితమైన నీరు, మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడుతాయి. ఇది అంటువ్యాధిగా ఇతర పశువులకు సోకుతుంది. గొంతు కిందకు నీరు దిగి గొంతువాపు వస్తుంది. నోటి నుంచి చొంగకారుస్తూ, గురక, శ్వాస పీల్చడం కష్టమవుతుంది. కళ్లు వస్తాయి.
నివారణ : వర్షాకాలం ముందు జూన్, జూలైలో వ్యాధి నిరోధక టీకాలు చేయించాలి. వ్యాధి ఉన్న పశువుల దొడ్డిని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి. ఇతర పశువుల కు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమీప పశువుల వైద్యాధికారిని సంప్రదించాలి.
గాలి కుంటు వ్యాధి : ఇది వైరస్ సోకడం లేదా కలుషితమైన గాలి ద్వారా వస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరం ఉంటుంది. నోరు గిట్టల మధ్య బొబ్బలు, నోటి నుంచి సొంగ కారడం జరుగుతుంది.
నివారణ : నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిజరిన్ కలిపి రాయాలి. గిట్టల మధ్య పుండ్లకు పరమాంగనెట్ ద్రావణంతో శుభ్రం చేసి వేపనూనె రాయాలి. దీనితో గాలికుంటు వ్యాధులను నివారించవచ్చు.
గొర్రెలలో నీలినాలుక వ్యాధి : గ్రామాల్లో చాలామంది గొర్రెలను మేపుతూ వాటిపైనే జీవనోపాధి పొందుతారు. గొర్రెల్లో వచ్చే వ్యాధులలో చాలా ముఖ్యమైన వ్యాధి నీలినాలుక వ్యాధి. దీనినె మూతి వాపు వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి దోమకాటు వలన వస్తుంది. ఈ వ్యాధి సోకిన గొర్రె మేత వేయడం మానేస్తాయి. నెమరు వేయదు. జ్వరం ఉంటుంది. నాలుక వాచి నీలి రంగుగా మారుతుంది. కాళ్ల గిట్టలు వాచి పుండ్లు అవుతాయి. ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించి వారం రోజులలో చనిపోతాయి.
నివారణ : వ్యాధి సోకిన గొర్రెలను సకాలంలో గుర్తించి వైద్యులతో చికిత్స చేయించాలి. నోటిపుండ్లను ఒక శాతం బోరిక్ యాసిడ్ లోషన్‌తో శుభ్రం చేయాలి. రెండు శాతం బొరిగ్లిసరిన్ పూయాలి. గొర్రెలు ఆకలితో చనిపోకుండా ఉండేందుకు జావలాంటిది అందించాలి. వైద్యుల సలహాతో యాంటిబయోటెక్ ఇంజక్షన్ ఇప్పించాలి.