గనిగుంత మింగేసింది..!
గనిగుంత మింగేసింది..!
Published Wed, Apr 19 2017 10:03 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM
- బర్రెలు తోలేందుకు వెళ్లి ఒకరు
- ప్రమాదం నుంచి కాపాండేందుకు వెళ్లి మరొకరు
- ఇద్దరు మహిళలు మృత్యువాత
- సుంకేసుల గ్రామంలో విషాదం
అవుకు: వేసవిలో పశువుల తాపం తీర్చే గనిగుంత ఇద్దరు మహిళలను మింగేసింది. ఈ విషాదకర ఘటన బుధవారం అవుకు మండలం సుంకేసుల గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంజామల మండలం రామిరెడ్డికి పల్లెకు చెందిన మూరబోయిన లక్ష్మీదేవి (26), మూరబోయిన రాజశ్వేరి (35) అనే మహిళలు తమ బర్రెలను మేపుకోవడానికి సుంకేసుల గ్రామ సమీపానికి వచ్చారు. మధ్యాహ్నం సమయంలో బర్రెలకు వేసవి తాపం తీరుతందని గనిగుంతలోకి పంపారు. వాటిని బయటకు తోలేందుకు వెళ్లన లక్ష్మీదేవి గని గుంతలో చిక్కుకుపోయి ఆర్తనాదాలు చేసింది. గమనించిన రాజేశ్వరి.. తాను కూడా గనిగుంతలోకి దిగి ప్రమాదం కొని తెచ్చుకుంది. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలిసి సుంకేసుల గ్రామంతో పాటు రామిరెడ్డి పల్లె గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సంజామల మండల మంగంపల్లె చెందిన లక్ష్మీదేవికి, రామిరెడ్డి పల్లెకు చెందిన లక్ష్మీనారాయణతో ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఎల్‌కేజి చదువుతున్న కూతురు, ఒకటో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. అలాగే మహానంది మండలం బొల్లవరానికి చెందిన రాజేశ్వరికి రామిరెడ్డి పల్లెకు చెందిన తిమ్మయ్యతో ఇరవై సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇంటర్ చదువుతున్న హేమంత్, 8 వతరగత చదువుతున్న మధుసూదన్ ఉన్నారు. ఒకే గ్రామంలో ఇద్దరు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Advertisement