ఒంగోలు టూటౌన్ : జిల్లాలో చాలా మంది రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులను పోషిస్తున్నారు. పశువులు ఈనే ముందు, ఈనిన తర్వాత జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యంతో కొన్ని సార్లు పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఈ సమయంలో పశుపోషకుడు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ ఒంగోలు ఏడీఏ మురళీకృష్ణ తెలిపారు. ఇందుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
పశువులు ఈనే ముందు..
చూడిపశువు ఎక్కువ నీరు తాగకుండా చూడాలి. మందతో బయటకు పంపకూడదు. ఎత్తు ప్రదేశాలకు వెళ్లకుండా చూసుకోవాలి. పరుగెత్తనీయకూడదు. బెదరగొట్టడం, దున్నపోతులు, ఆంబోతులు పొడవకుండా, దాటకుండా చూడాలి. చూడి పశువులను విడిగా ఉంచాలి. కొన్ని పశువుల్లో ఈనడానికి పది రోజుల ముందు పొదుగు భాగంలో నీరు దిగి వాపు వస్తుంది. ఇది సహజంగా వస్తుంది. దీనిని వ్యాధిగా భావించనవసరం లేదు.
పశువు ఈనే సమయంలో..
పశువును, కొష్టాన్ని శుభ్రపరచాలి. ఈనడానికి రెండు గంటల ముందు జొన్నలు, రాగులు, సజ్జలు మొదలైన చిరుధాన్యాలను ఉడికించి పెట్టాలి. పచ్చిగడ్డి కూడా కొద్దిగా వేయాలి. ఈనే ముందు పచ్చిగడ్డి సరిగా తినవు. పారుకుంటూ ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈనే సమయం దగ్గర పడినప్పుడు బొడ్డు కింద నీరు చేరుతుంది. ముర్రుపాలు కనపడతాయి. ఆరోగ్యవంతమైన పశువు ఈనే ముందు ఇబ్బందిపడుతూ అరగంట నుంచి ఆరు గంటల్లోనే ఈనుతాయి. ఆరు గంటలు మించితే వైద్యుడి సహాయం తీసుకోవాలి.
ఈనే ముందు సాధారణంగా లేగదూడ ముందరికాళ్లు, ముట్టె ముందు బయటకు వస్తాయి. సాధ్యమైనంతవరకు పశువు దానంతట అదే ఈనేందుకు ప్రయత్నించాలి.
ఈనిన తర్వాత..
వేడినీళ్లతో శరీరాన్ని శుభ్రం చేయాలి. వరిగడ్డితో బెడ్డింగ్ ఏర్పాటు చేయాలి. నీరసం తగ్గడానికి బెల్లం కలిపిన గోరువెచ్చని తాగునీరు ఇవ్వాలి. పశువులకు కొన్ని రోజుల వరకు కొద్దిగా దాణా అందిస్తూ రెండు వారాల్లో పూర్తిగా దాణా ఇవ్వాలి. ఈనిన రెండు నుంచి ఎనిమిది గంటల్లో మాయ వేస్తాయి. అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే పశువైద్యుడి సహాయం తీసుకోవాలి.
మాయని అశాస్త్రీయ పద్ధతిలో లాగితే గర్భకోశం చిట్లి రక్తస్రావం జరుగుతుంది. కొన్ని సార్లు పశువు మరణించే అవకాశం ఉంది. అధిక పాలిచ్చే పశువులకు ఈనిన తర్వాత పాలజ్వరం రాకుండా కాల్షియం ఇంజక్షన్ వేయించాలి. ఈనే వారం రోజుల ముందు, తర్వాత వారం రోజులు పశువుకు విటమిన్-డి ఇవ్వాలి.
పశువులు ఈనే సమయంలో జాగ్రత్త అవసరం
Published Fri, Oct 3 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
Advertisement
Advertisement