నివృత్తం: పూజామందిరంలో కలశాన్ని ఎందుకు స్థాపిస్తారు?
ఇలా చేయమని శాస్త్రాలే చెబుతున్నాయి. కలశ ముఖంలో విష్ణుమూర్తి, కంఠభాగంలో శివుడు, మూల భాగంలో బ్రహ్మ, మధ్యభాగంలో మాతృగణాలు ఉంటారట. కలశంలోని జలాల్లో సాగరాలు, సప్తద్వీపాలతో కూడిన భూమి, వేద వేదాంగాలు, సమస్త దేవతలూ ఆశ్రయించి ఉంటారట. సమస్త పాపాలనూ తొలగించి దీవించేందుకు వారంతా దిగి రావాలని కోరుతూ కలశాన్ని స్థాపించాలని చెబుతారు. అది మాత్రమే కాక... మానవ జీవితాన్ని నిండు కుండతో పోలుస్తారు. అంటే అది ప్రాణానికి ప్రతీక అన్నమాట. అందువల్ల శుభ సందర్భాల్లో కలశ పూజ చేయడం వల్ల ఆయురారోగ్యాలు చేకూరుతాయని చెబుతారు. (సన్నని మూతి కలిగి, నీటితో నింపిన పాత్రను కలశం అంటారు).
లంక మేత గోదారి ఈతకు సరిపోయినట్టు... నదుల మధ్యలో ఉండే భూమిని లంక అంటారు. గోదావరి జిల్లాల్లో ఇలాంటి లంకలు చాలానే ఉన్నాయి. ఆ జిల్లాల్లోని గ్రామస్తులు చాలామందికి పశువులు ఉంటాయి. వాటిని పాలేళ్లు గోదారి గట్టున మేపుతుంటారు. ఒక్కోసారి మేత సరిపోక... లంకల్లో ఉండే గడ్డి తినడానికి అక్కడికి తోలుకు పోతుంటారు. పశువులు కడుపుల నిండా మేత మేశాక తిరిగి ఒడ్డుకు తీసుకు వస్తారు. అయితే అవి తిన్నదంతా ఒడ్డుకు ఈదుకొచ్చేలోపు అరిగిపోతుంది. దాంతో వాటికి మళ్లీ ఆకలేస్తుంది. ఈ పరిస్థితిలోంచి పుట్టిందే ఈ సామెత. కొందరు చిన్న ప్రతిఫలం కోసం చాలా ఎక్కువ కష్టపడిపోతుంటారు. తీరా అంత చేశాక వీరికి మిగిలేదేమీ ఉండదు. అలాంటప్పుడు ‘లంక మేత గోదారి ఈతకు సరిపోయినట్టు’ అయ్యింది వీడి పని అంటూ పరిహాసమాడుతుంటారు!