![Shri Ram Will be done with the Water of Saryu Filled in the Kalash of Kashi - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/30/ayodhya.jpg.webp?itok=ExcxdEah)
ధార్మిక నగరమైన కాశీలో తయారు చేసిన కలశాలలో సరయూ నీటిని నింపి, అయోధ్యలో కొలువయ్యే బాలరాముని అభిషేకించనున్నారు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో వినియోగించేందుకు వారణాసిలో లక్షకు పైగా రాగి, ఇత్తడి, కంచు పాత్రలను సిద్ధం చేస్తున్నారు.
కాశీలోని వ్యాపారులకు అయోధ్యలో వినియోగించబోయే ఐదు లక్షల కలశాలకు సంబంధించిన ఆర్డర్ వచ్చింది. జనవరి 15లోగా ఈ కలశాలను సిద్ధం చేసి అయోధ్యకు పంపనున్నారు. జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బనారసీ దుస్తులు, పూజా పాత్రలు ఇతర సరంజామాను ఇప్పటికే కాశీ నుంచి అయోధ్యకు తరలిస్తున్నారు. వీటిలో బనారసీ దుపట్టా, రామనామి, స్టోన్ క్రాఫ్ట్ జాలీ వర్క్, జర్దోసీ, వాల్ హ్యాంగింగ్ మొదలైనవి ఉన్నాయి. కాశీ-అయోధ్య మధ్య జనవరి నుంచి ఫిబ్రవరి వరకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల మేరకు వ్యాపారం జరగవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు.
భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్-జీఐ)నిపుణులు డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో ప్రముఖ జీఐ ఉత్పత్తులున్నాయని, హస్తకళలు, చేనేతలకు సంబంధించిన అత్యుత్తమ ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయన్నారు. ఇత్తడి గంటలు, చేతి గంటలు, పూజా పాత్రలు, లోటాలు, సింహాసనాలు, కలశాలు, గొడుగు, స్టోన్ క్రాఫ్ట్ జాలి వర్క్ మొదలైనవి అయోధ్యకు పంపిస్తున్నారన్నారు.
మెటల్ క్రాఫ్ట్‌లోనే రూ. 50 లక్షలకు పైగా విలువ చేసే ఆర్డర్లు వచ్చాయని చౌక్ నివాసి మెటల్ క్రాఫ్ట్ స్టేట్ అవార్డు గ్రహీత అనిల్ కుమార్ కసెరా తెలిపారు. కాశీ ఉత్పత్తులకు అయోధ్య నుంచి గరిష్టసంఖ్యలో ఆర్డర్లు అందుతున్నాయి. చెక్కతో చేసిన రామ్ దర్బార్ కోసం వచ్చిన 1.25 లక్షల ఆర్డర్లు పూర్తయ్యాయని జాతీయ అవార్డు గ్రహీత రామేశ్వర్ సింగ్ తెలిపారు. ఇప్పుడు మరో లక్ష ఆర్డర్లు వచ్చాయని, వాటి పనులు కొనసాగుతున్నాయన్నారు.
ఇది కూడా చదవండి: అసోంలో ఇక శాంతి పవనాలు
Comments
Please login to add a commentAdd a comment