kalasam
-
కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు!
ధార్మిక నగరమైన కాశీలో తయారు చేసిన కలశాలలో సరయూ నీటిని నింపి, అయోధ్యలో కొలువయ్యే బాలరాముని అభిషేకించనున్నారు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో వినియోగించేందుకు వారణాసిలో లక్షకు పైగా రాగి, ఇత్తడి, కంచు పాత్రలను సిద్ధం చేస్తున్నారు. కాశీలోని వ్యాపారులకు అయోధ్యలో వినియోగించబోయే ఐదు లక్షల కలశాలకు సంబంధించిన ఆర్డర్ వచ్చింది. జనవరి 15లోగా ఈ కలశాలను సిద్ధం చేసి అయోధ్యకు పంపనున్నారు. జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బనారసీ దుస్తులు, పూజా పాత్రలు ఇతర సరంజామాను ఇప్పటికే కాశీ నుంచి అయోధ్యకు తరలిస్తున్నారు. వీటిలో బనారసీ దుపట్టా, రామనామి, స్టోన్ క్రాఫ్ట్ జాలీ వర్క్, జర్దోసీ, వాల్ హ్యాంగింగ్ మొదలైనవి ఉన్నాయి. కాశీ-అయోధ్య మధ్య జనవరి నుంచి ఫిబ్రవరి వరకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల మేరకు వ్యాపారం జరగవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్-జీఐ)నిపుణులు డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లోని కాశీలో ప్రముఖ జీఐ ఉత్పత్తులున్నాయని, హస్తకళలు, చేనేతలకు సంబంధించిన అత్యుత్తమ ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయన్నారు. ఇత్తడి గంటలు, చేతి గంటలు, పూజా పాత్రలు, లోటాలు, సింహాసనాలు, కలశాలు, గొడుగు, స్టోన్ క్రాఫ్ట్ జాలి వర్క్ మొదలైనవి అయోధ్యకు పంపిస్తున్నారన్నారు. మెటల్ క్రాఫ్ట్లోనే రూ. 50 లక్షలకు పైగా విలువ చేసే ఆర్డర్లు వచ్చాయని చౌక్ నివాసి మెటల్ క్రాఫ్ట్ స్టేట్ అవార్డు గ్రహీత అనిల్ కుమార్ కసెరా తెలిపారు. కాశీ ఉత్పత్తులకు అయోధ్య నుంచి గరిష్టసంఖ్యలో ఆర్డర్లు అందుతున్నాయి. చెక్కతో చేసిన రామ్ దర్బార్ కోసం వచ్చిన 1.25 లక్షల ఆర్డర్లు పూర్తయ్యాయని జాతీయ అవార్డు గ్రహీత రామేశ్వర్ సింగ్ తెలిపారు. ఇప్పుడు మరో లక్ష ఆర్డర్లు వచ్చాయని, వాటి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇది కూడా చదవండి: అసోంలో ఇక శాంతి పవనాలు -
అద్భుత కలశం పేరుతో బురిడీ
నిమ్మనపల్లె (చిత్తూరు జిల్లా) : తమ వద్ద అతీత శక్తులున్న అద్భుత కలశం ఉందంటూ చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె, కలికిరి మండలాలకు చెందిన నలుగురు వ్యక్తులు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన పలువురి నుంచి రూ.9 లక్షల నగదు వసూలు చేసి పరారయ్యారు. బాధితులు ఆదివారం నిమ్మనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ ఫాతిమా కథనం ప్రకారం.. నిమ్మనపల్లె మండలం, వెంకోజిగారిపల్లెకు చెందిన మల్లేశ్వరరావు, తవళం గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి, కలికిరి మండలం, గొల్లపల్లెకి చెందిన చిన్నబ్బ, కలికిరికి చెందిన రమణారెడ్డి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఇటీవల తిరువళ్లూరు జిల్లా, పల్లిపట్టు తాలూకా, కేశవరాజు కుప్పంకు చెందిన పలువురిని కలిశారు. తమ వద్ద అతీత శక్తులు కలిగిన, అద్భుత పురాతన కలశం ఉందని, దానికి చాలా మహిమలున్నాయని, గుప్త నిధులు, బియ్యం ఆకర్షించగలదని నమ్మించారు. కలశం ఉన్నవారికి సిరి సంపదలు, అతీత శక్తులు సిద్ధిస్తాయని చెప్పారు. రూ.కోట్లు విలువ చేసే కలశాన్ని రూ.20 లక్షలకే ఇస్తామనడంతో వారి మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో శనివారం నిమ్మనపల్లె మండలం, ముష్ఠూరు గ్రామం, బహుదా ప్రాజెక్టు వద్దనున్న అమ్మవారి గుడివద్ద కలశాన్ని అందజేస్తామన్నారు. బాధితులు శనివారం నిందితులను కలిసి, కలశం ఇవ్వాలని అడగ్గా.. గుడిలో కలశానికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని, పూజల అనంతరం రాత్రికి కలశాన్ని తీసుకెళ్లవచ్చునని చెప్పారు. వారి మాటలు నమ్మి రూ.9 లక్షల నగదును నిందితులకు అందజేశారు. అంతే.. నిందితులు నగదు తీసుకుని పరారయ్యారు. కలశం కోసం వెళ్లిన బాధితులకు అక్కడ కలశం లేకపోవడం.. నిందితులు స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించారు. బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ ఫాతిమా నిందితులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకరైన మల్లేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
నూతన కలశ పునఃప్రతిష్ఠాపన
మంత్రాలయం : ప్రముఖ శ్రీరాఘవేంద్రస్వామి మఠం గర్భాలయ స్వర్ణగోపురం సప్తదళ బంగారు కలశాన్ని శనివారం పునఃప్రతిష్ఠించారు. ముందుగా పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో యాగశాలలో పుణ్యవచనం, శాంతి, నవగ్రహ, ప్రాయశ్చిత హోమాలు, వాస్తుపూజలు కానిచ్చారు. ప్రాణప్రతిష్ఠతో కలశాన్ని గోపురంపై ప్రతిష్ఠించారు. పూజా విశిష్టతలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈనెల 7వ తేదీ రాత్రి ఈదురు గాలులకు బంగారు కలశం విరిగి పడిన విషయం విదితమే. పునఃప్రతిష్టాపన వేడుకలో మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి, దివాన్ వాదిరాజాచార్ పాల్గొన్నారు. -
ఆలయంపై కలశం చోరీ
నెల్లూరు రూరల్ : నెల్లూరు రూరల్ పరిధిలోని అల్లీపురంలో శ్రీవీరాంజనేయ స్వామి ఆలయం గర్భగుడిపై ఉన్న బంగారు తాపడం కలశాన్ని గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి అపహరించారు. నెల్లూరు రూరల్ పోలీసుల కథనం మేరకు.. అల్లీపురంలోని శ్రీవీరాంజనేయ స్వామి ఆలయంలో పూజారి శుక్రవారం రాత్రి 9.30 గంటలకు పూజలు చేసి తాళం వెళ్లారు. శనివారం ఉదయం పూజారి ఆలయానికి రాగా గర్భగుడిపై ఉన్న కలశం చోరీకి గురైనట్లు గుర్తించి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకుమార్రెడ్డికి సమాచారం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు కలశం అపహరణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు రూరల్ ఎస్ఐ సుబ్బారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆలయ చైర్మన్ మాట్లాడుతూ రెండేళ్ల కిందట ఆలయం పునర్నిర్మాణం, జీర్ణోద్ధరణ జరిగిందన్నారు. గర్భగుడిపై చోరీకి గురైన 12 కేజీల పంచలోహ కలశానికి భక్తులు సమర్చించిన 90 గ్రాముల బంగారుతో తాపడం చేయడం జరిగిందన్నారు. దీని విలువ సుమారు. 3.20 లక్షలు ఉంటుందన్నారు. -
నివృత్తం: పూజామందిరంలో కలశాన్ని ఎందుకు స్థాపిస్తారు?
ఇలా చేయమని శాస్త్రాలే చెబుతున్నాయి. కలశ ముఖంలో విష్ణుమూర్తి, కంఠభాగంలో శివుడు, మూల భాగంలో బ్రహ్మ, మధ్యభాగంలో మాతృగణాలు ఉంటారట. కలశంలోని జలాల్లో సాగరాలు, సప్తద్వీపాలతో కూడిన భూమి, వేద వేదాంగాలు, సమస్త దేవతలూ ఆశ్రయించి ఉంటారట. సమస్త పాపాలనూ తొలగించి దీవించేందుకు వారంతా దిగి రావాలని కోరుతూ కలశాన్ని స్థాపించాలని చెబుతారు. అది మాత్రమే కాక... మానవ జీవితాన్ని నిండు కుండతో పోలుస్తారు. అంటే అది ప్రాణానికి ప్రతీక అన్నమాట. అందువల్ల శుభ సందర్భాల్లో కలశ పూజ చేయడం వల్ల ఆయురారోగ్యాలు చేకూరుతాయని చెబుతారు. (సన్నని మూతి కలిగి, నీటితో నింపిన పాత్రను కలశం అంటారు). లంక మేత గోదారి ఈతకు సరిపోయినట్టు... నదుల మధ్యలో ఉండే భూమిని లంక అంటారు. గోదావరి జిల్లాల్లో ఇలాంటి లంకలు చాలానే ఉన్నాయి. ఆ జిల్లాల్లోని గ్రామస్తులు చాలామందికి పశువులు ఉంటాయి. వాటిని పాలేళ్లు గోదారి గట్టున మేపుతుంటారు. ఒక్కోసారి మేత సరిపోక... లంకల్లో ఉండే గడ్డి తినడానికి అక్కడికి తోలుకు పోతుంటారు. పశువులు కడుపుల నిండా మేత మేశాక తిరిగి ఒడ్డుకు తీసుకు వస్తారు. అయితే అవి తిన్నదంతా ఒడ్డుకు ఈదుకొచ్చేలోపు అరిగిపోతుంది. దాంతో వాటికి మళ్లీ ఆకలేస్తుంది. ఈ పరిస్థితిలోంచి పుట్టిందే ఈ సామెత. కొందరు చిన్న ప్రతిఫలం కోసం చాలా ఎక్కువ కష్టపడిపోతుంటారు. తీరా అంత చేశాక వీరికి మిగిలేదేమీ ఉండదు. అలాంటప్పుడు ‘లంక మేత గోదారి ఈతకు సరిపోయినట్టు’ అయ్యింది వీడి పని అంటూ పరిహాసమాడుతుంటారు!