గొంతువాపు వ్యాధి
వర్షాకాలంలో పశువులకు ప్రధానంగా వచ్చేది గొంతువాపు వ్యాధి. దీనిని గురకవ్యాధి అంటారు. నీరసంగా ఉండే పశువులకు ఈ వ్యాధి త్వరగా సోకుతుంది. పశువు ఆయాస పడుతూ శ్వాస పీలుస్తుంది. గుర్రు గుర్రుమని శబ్దం వస్తుం ది. జ్వర తీవ్రత 104 నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగ పడుతుంది. గొంతు పై భాగాన మెడ కింద వాపు వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన పశువు 24 గంటల్లో మరణించే అవకాశాలు ఉంటాయి.
చికిత్స..
వ్యాధి లక్షణాలు కనిపించిన పశువును వెంటనే మంద నుంచి వేరు చేయాలి. వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి. వ్యాధి సోకిన పశువుకు వ్యాధి తీవ్రతను బట్టి సల్ఫాడిమిడిన్, ఇంటాసెఫ్‌టాజు, ఎక్సెప్ట్ వంటి ఇంజక్షన్లు ఇవ్వాలి. వ్యాధి ముదిరితే ఏమీ చేయని పరిస్థితి ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా ఉన్న పశువుకు బూస్టర్ డోస్ తప్పక వేయించాలి.
జబ్బవాపు..
ఈ వ్యాధి క్లాస్ట్రిడియం చొవై అనే బ్యాక్టిరియా ద్వారా పశువులకు సోకుతుంది. ఆరు మాసాల నుంచి రెండేళ్ల లోపు వయసున్న పశువులకు ఎక్కువ సోకుతుంది. ఈ వయసులో పశువుకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. భుజం, తొడ ప్రాంతాల్లోని కండరాలను ఆశించి, మాంసం కుళ్లిపోయేలా చేస్తుంది. వాపుతో పశువులు కుంటుతాయి. వెనక కాలు కాని ముందు కాలు గాని పైకి లేపి ఉంచి కుంటడం చేస్తాయి. వాపు దగ్గర కరకరమని శబ్దం వస్తుంది.
చికిత్స..
వ్యాధి ప్రారంభంలోనే పెన్సిలిన్, ఆక్సివంటి యాంటిబయాటిక్స్ వాడాలి. వాటితో పాటు డెక్ట్రోజ్ నార్మల్ సెలైన్ వాడాలి. వ్యాధిగ్రస్థ పశువుల్ని వేరుచేయాలి, చనిపోయిన పశువును ఉన్నట్లయితే గొయ్యిలో పాతిపెట్టాలి. వ్యాధి రాకుండా వర్షాకాలం ముందే జబ్బవాపు వ్యాధి టీకాలు వేయించాలి.
గాలికుంటు వ్యాధి..
గాలికుంటు వ్యాధి సోకిన పశువు చాల బలహీనంగా ఉంటుంది. పాలు ఇచ్చే గేదేలు చాలా నీరసంగా ఉంటాయి. పాల ఉత్పత్తి చాలా తగ్గిపోతుంది. ఎడ్లు వ్యవసాయం పనులు చేయడానికి సాహసించవు. సంకరజాతి పశువులతో పాటు షెడ్‌లలో పెంచుకొనే పశువులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఎక్కువగా మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఈ వ్యాధి పశువులకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన పశువుకు నోటి గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారుతాయి. చర్మం గరుకుగా మారుతుంది. నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం చేత పశువులు మేత, తీసుకోక నీరసించి పోతాయి. నోటి నుంచి సొంగ కారుతుంది.
చికిత్స
వ్యాధి సోకిన పశువును మంద నుంచి వేరు చేయాలి. నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిసరిన్ కలిపి పూయాలి. అంతే కాకుండా ముందు జాగ్రత్తగా స్థానిక పశువైద్యాధికారులు జాతీయ గాలికుంటు వ్యాధి నివా రణ పథకం కింద టీకాలు కూడా ఉచితంగా వేస్తున్నారు.
గొర్రెల్లో కాలి పుండ్లు..
వర్షాకాలంలో గొర్రెలు బురదలో తిరగడం వల్ల కాలి పుండ్ల వ్యాధి సోకుతుంది. బురదలో తిరిగినప్పుడు గిట్టల మధ్య చర్మం మెత్తబడి, వాచి చిట్లిపోతుంది. చీము పట్టి నొప్పితో ముందు కాళ్లపై గెంటుతుంటాయి. వ్యాధి మరింత జటిలం అయితే గిట్టలూడి పోతాయి. ఈ వ్యాధి సోకిన పశువులకు 10 శాతం మైలతుత్తం, పది శాతం జింక్‌సల్ఫేట్, లేదా ఐదు శాతం ఫార్మలిన్‌లో ఏదైనా ఒక ఆయింట్‌మెంట్ పూయాలి. యాంటిబయాటిక్ ఇంజక్షన్లు వరుసగా 3-5 రోజులు వేయించాలి. అంతే కాకుండా గొర్రెలను బురద నేలల్లో ఎక్కువగా తిరగనీయొద్దు. గట్టి నేలల్లో మేపే విధంగా చూడాలి.
వ్యాధుల కాలం.. పశువులు పైలం
Published Mon, Sep 29 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement