సాక్షి, విశాఖపట్నం: వేసవి వచ్చిందంటే చాలు నీటి చుక్క కోసం అల్లాడిపోతాం. కాలు బయటపెడితే.. కాసిన్ని నీళ్లు ఎక్కడ దొరుకుతాయా అని ఆశగా వెదుకుతుంటాం. ఎప్పటికప్పుడు ఉష్ణతాపాన్ని తీర్చుకునేందుకు ఏదో రూపంలో నీటిని శరీరానికి అందిస్తుంటాం. అందుకే వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చాలాచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మరి మూగజీవాల పరిస్థితి ఏమిటి? చుక్క నీటి కోసం మైళ్ల దూరం ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. పక్షి జాతుల్లో కొన్ని అంతరించిపోవడానికి వేసవీ ఒక కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేమా? అని కెన్ ఫౌండేషన్ సభ్యులకు కలిగిన ఆలోచన.. నేడు నగరంలో వేలాది పశుపక్ష్యాదుల దాహార్తిని తీరుస్తోంది. 10 ఏళ్లుగా ఎన్నో జీవాలకు వేసవిలో ఊపిరిపోస్తోంది.
సాధారణంగా పక్షుల శరీర సాధారణ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్. ఈ ఉష్ణోగ్రత దాటితే ఎక్కువ సేపు జీవించలేవు. అందుకే చాలా పక్షులు ఎక్కడ నీరు కనిపిస్తే అందులో మునకేస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకుంటాయి. ప్రస్తుతం నగరంలో వేసవి నేపథ్యంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు సమీపిస్తోంది. ఈ తరుణంలో పక్షుల సంరక్షణకు నడుం బిగించింది నగరానికి చెందిన కెన్ ఫౌండేషన్. సేవే మార్గంగా.. విద్యార్థులు వలంటీర్లుగా.. సంస్థ అధ్యక్షుడు పుల్లేటికుర్తి సంతోష్ ఈ సంస్థ తరఫున వాటర్ బౌల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
100 తొట్టెలతో ప్రారంభమై..
పక్షులను వేసవి తాపం నుంచి రక్షించి వాటి దాహార్తి తీర్చే ఉద్దేశంతో 2012లో కెన్ ఫౌండేషన్ నగరంలో వాటర్ బౌల్ పేరుతో సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలి ఏడాది ఫౌండేషన్ వలంటీర్లే నగరంలోని పలుచోట్ల 100 నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. ఆ వాటర్ బౌల్స్ వద్దకు పక్షులు, మూగజీవాలు వచ్చి నీటిని తాగుతుండటం చూసి నగర ప్రజలు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తామూ ఈ వాటర్ బౌల్ ప్రాజెక్ట్‌లో భాగస్వాములమవుతామని ముందుకువచ్చారు. దీంతో వాటర్ బౌల్ ప్రాజెక్ట్‌ను విస్తరించారు. పిచ్చుకలు, రామచిలుకలు, పావురాలు, కోయిలలు, కాకులతో పాటు ఉడుతలు, ఆవులు, కుక్కలు కూడా ఈ వాటర్ బౌల్స్ వద్దకు చేరుకుని తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. సంస్థ చైర్‌పర్సన్ గీతానారాయణ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నీటి తొట్టెల ఖర్చును భరిస్తూ.. అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. 2017 వరకు 750 నీటి తొట్టెలు పంపిణీ చేయగా.. 2021 నాటికి ఆ సంఖ్య 1800 కు చేరింది. ఈ ఏడాది 150 నుంచి 200 వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
నగరమంతా విస్తరణ
నగరంలోని అనేక చోట్ల నుంచి జంతు ప్రేమికులు ఈ వాటర్ బౌల్స్‌ను తీసుకుని వెళ్తున్నారు. ఇంకా ఎవరైనా పక్షి ప్రేమికులుంటే మరికొన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెందుర్తి, విశాలాక్షినగర్, కొత్తవలస, స్టీల్‌ప్లాంట్, అనకాపల్లి, డాల్ఫిన్ నోస్... ఇలా శివారు ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు వచ్చి నీటితొట్టెలను తీసుకెళ్తున్నారు. ఈ నీటితొట్టెల్లో నీటిని నింపి మేడ చివర్లో కానీ, పెరడులో గానీ పెడితే పక్షులు అక్కడికి చేరి దాహాన్ని తీర్చుకుని ఉపశమనం పొందుతున్నాయి. ఐదేళ్లుగా సరఫరా చేసిన నీటి తొట్టెల వద్దకు ఎన్నో పక్షులు కాలంతో పనిలేకుండా వస్తుండటం విశేషం.
ఉచితంగా అందిస్తాం..
వేసవి వస్తే మనుషుల కోసం అడుగడుగునా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ మూగజీవాల గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందుకే మా ఫౌండేషన్ తరఫున వాటర్ బౌల్ ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఇవి జంతువులకు, పక్షులకు చలివేంద్రాలు. నగరంలోని అనేక కళాశాలలు, ప్రైవేట్ సంస్థల్లో కూడా వీటిని ఏర్పాటుచేశాం. మూగ జీవాలను ప్రేమించేవారు ఎవ్వరు వచ్చినా.. ఉచితంగా నీటితొట్టెలు అందిస్తాం. ఆసక్తి ఉన్న వారు 98856 74949ను సంప్రదించవచ్చు.
– పుల్లేటికుర్తి సంతోష్, కెన్ ఫౌండేషన్ అధ్యక్షుడు
ప్రజల స్పందన అనూహ్యం
కెన్ ఫౌండేషన్ తరఫున ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. 100 చోట్ల పెట్టి వాటినే ప్రతి ఏటా కొనసాగించాలని భావించాం. అయితే.. నీటి తొట్టెలు చూసిన వారు ఇళ్ల వద్ద కూడా పెడతామని సంప్రదించారు. దీంతో ఆరేళ్లుగా దీన్ని కొనసాగిస్తున్నాం.
– గీతానారాయణ్, చైర్‌పర్సన్, కెన్ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment