ఇది ‘పాడి’యేనా..! | It 'dairy' bono ..! | Sakshi
Sakshi News home page

ఇది ‘పాడి’యేనా..!

Published Thu, Jun 26 2014 12:03 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఇది ‘పాడి’యేనా..! - Sakshi

ఇది ‘పాడి’యేనా..!

  • పెరిగిన ఎండలతో కరువైన పశుగ్రాసం  
  •  విలవిల్లాడుతున్న పశువులు
  •  జిల్లాలో 20 శాతం తగ్గిన పాల దిగుబడి
  •  వేసవికి లేని ప్రత్యేక ప్రణాళిక
  •  నివేదికలతో సరిపెడుతున్న ప్రభుత్వాలు
  • పాడి పంట అన్నారు పెద్దలు..పంటపోతే పాడి ఆదుకుంటుంది. ఆరుగాలం ఇంటిల్లిపాదీ కష్టించినా, వ్యవసాయం కలిసిరావడం లేదు. ఎంత ఎక్కువ సేద్యం చేపడితే అంత ఎక్కువ అప్పుల్లో రైతు కూరుకుపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు పాడివైపు ఆసక్తి చూపుతున్నారు. పశుపోషణ చేపడుతున్నారు. క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే ఏకైక మార్గమైన పాడికి నేడు గడ్డు పరిస్థితులు దాపురించాయి. ప్రభుత్వ ఉదాశీనత కారణంగా ఈ రంగం కూడా రైతుకు ఆదరవు కాకుండా పోతోంది. మరో పక్క ఎండలు పెరగడంతో పశుగ్రాసం కొరత ఏర్పడి పరోక్షంగా పాల దిగుబడిపై ప్రభావం చూపుతోంది.
     
    నర్సీపట్నం/యలమంచిలి: పాడిపరిశ్రమపై ఎండల ప్రభావం కనబడుతోంది. పశుగ్రాసం కొరతతో మూగజీవాలు అల్లాడుతున్నాయి. వాటిపోషణకు అన్నదాతలు అష్టక ష్టాలు పడుతున్నారు. వేలాది కుటుంబాలను ఆదుకుంటున్న పాడిపరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. జిల్లా వ్యాప్తంగా ఆవులు నాలుగు లక్షలు, గేదెలు రెండు లక్షల వరకు ఉంటాయి. వీటిలో 50 శాతం పశువులు పాల దిగుబడిని ఇస్తుంటాయి. వీటి నుంచి రోజుకు లక్షల లీటర్ల వరకు పాల దిగుబడి వస్తుంది.

    విశాఖ డెయిరీ, సుప్రజ, హెరిటేజ్, తిరుమల డెయిరీలు రైతుల నుంచి పాలు సేకరించి, వివిధ రకాలైన ఉత్పత్తుల ద్వారా అమ్మకాలు చేస్తుంటారు. ఎండల తీవ్రత, వర్షాభావం కారణంగా విశాఖ డెయిరీ పాలసేకరణ  జూన్ 5 నాటికి 7.02లక్షల లీటర్లు ఉండగా, ప్రస్తుతం 6.66లక్షల లీటర్లకు దిగజారింది. జిల్లాలోని పలు ప్రైవేట్ డెయిరీలలోనూ ఇదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా పశువులకు రోజుకు 1.25 లక్షల క్వింటాళ్ల పశుగ్రాసం అవసరమవుతుంది.

    రైతులు మెట్టభూముల్లోనే పశుగ్రాసం పెంపకం చేపడతారు. వర్షాభావంతో పంటపొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. అంతటా పశుగ్రాసం కొరత ఏర్పడింది. మార్కెట్‌లోదాణా ధరలు అందుబాటులో లేకుండాపోయాయి. కనీసం పశువులకు తాగునీరు కూడా అందించలేకపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

    జిల్లాలో అత్యధికంగా పాలసేకరణ చేస్తున్న యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పాల దిగుబడి తగ్గిపోయింది. విశాఖ డెయిరీకి రోజుకు రెండువేల లీటర్ల వరకు సరఫరా చేస్తున్న పలు పాల సేకరణ కేంద్రాలకు ప్రస్తుతం వెయ్యి లీటర్లకు మించి రావడం లేదు. వ్యవసాయం కలిసిరాకపోవడంతో ఎక్కువమం ది రైతులు పాడిపరిశ్రమపైనే ఆధారపడుతున్నారు. ఒక్కొక్క కుటుంబానికి రెండు నుంచి మూడు పశువులు ఉంటున్నాయి. ఇక పల్లెల్లో పలువురు యువకులు పాడిపడిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు.

    గత కొద్ది రోజులుగా పలువురు రైతులు ఎండలకు భయపడి ఇళ్లవద్దనే అందుబాటులో ఉన్న ఎండుగడ్డితో కాలం నెట్టుకొస్తున్నారు. ఇప్పటికే  బహిరంగ మార్కెట్‌లో కిలో తౌడు రూ.10ల నుంచి రూ.15లు, నూకలు రూ.20నుంచి రూ.25ల వరకు ఉండడంతో దాణా కొనుగోలు రైతులకు ఆర్థిక భారంగా మారింది.  విశాఖ డెయిరీ ద్వారా సరఫరా చేసే దాణా ధరలు కూ డా నెలన్నర క్రితం పెంచేశారు. ప్రస్తుతం 50 కిలోల దాణా రు.550లకు రైతులకు పంపిణీచేస్తున్నారు.

    జిల్లాలో పలు పాల సేకరణ కేంద్రాల్లో గత 20రోజులుగా దాణా అందుబాటులో లేకపోవడంతో రైతు లు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా పాలదిగుబడిపై ప్రభావం కనబడుతోంది.  పూటకు రెండు లీటర్ల వరకు పాలిచ్చే పశువు లీటరుకంటే తక్కువ ఇస్తోందని చెబుతున్నారు. దీంతో రోజువారీ ఆదా యం తగ్గి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు.  
     
    వేసవి ప్రణాళిక ఏదీ?
     
    జిల్లాలో అధికశాతం వర్షాధార భూములు కావడంతో ఏటా వేసవిలో పశుగ్రాసానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో పాడి రైతులకు రాయితీపై ఎండుగడ్డిని సరఫరా చేసేవారు. ఈ ఏడాది అటువంటి ప్రణాళికకు ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కాస్తున్న ఎండలపై స్పందించిన ప్రభుత్వం నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించింది.

    ప్రస్తుతం ఉన్న పశువులకు ఎంత గ్రాసం అవసరముంది? అందుబాటులో ఎంత ఉంది? ఎంత మేర అవసరం? అనే దానిపై పూర్తి వివరాలివ్వాలంటూ ఆదేశించింది. దీనిపై వెటర్నరీ జేడీ వి.వెంకటేశ్వరావు మాట్లాడుతూ వేసవిలో గ్రాసం కొరతపై నిల్వ విధానాన్ని అలవాటు చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతమున్న పశుగ్రాసం కొరతపై ప్రభుత్వానికి నివేదించి, వారి ఆదేశం మేరకు తదుపరి చర్యలు చేపడతామని వివరించారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement