special planning
-
మలేరియా నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక
వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ చింతూరు: ఏజన్సీలో మలేరియా నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ జాయింట్ కమిషనర్ డాక్టర్ జయచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన చింతూరు మండలంలోని తులసిపాక, ఏడుగురాళ్లపల్లి పీహెచ్సీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చింతూరులో విలేకర్లతో మాట్లాడుతూ ఈ సీజన్లో రెండు పీహెచ్‌సీల పరిధిలో మలేరియా కేసుల పెరుగుదల అధికంగా ఉందని, దానిని నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీని కోసం చింతూరుకు 50 పడకల ఆసుపత్రి మంజూరైందని దీనికి సిబ్బంది నియామకంతో పాటు సామగ్రి సమకూర్చాల్సి వుందన్నారు. ప్రతిరోజు మలేరియా సిబ్బంది క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాలను పరిశీలించేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ ఏడాది తులసిపాక పీహెచ్సీ పరిధిలో 400, ఏడుగురాళ్లపల్లి పీహెచ్సీ పరిధిలో 300 మలేరియా కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు. కాళ్లవాపు వ్యాధిపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారని, త్వరలోనే ఏజన్సీలో పైలట్ ప్రాజెక్టు కింద మలేరియా రహిత గ్రామాలను తయారు చేస్తామని తెలిపారు. అనంతరం ఆయన కాళ్లవాపు బాధితుడిని పరామర్శించి వివరాలు సేకరించారు. ఈ సమావేశంలో డీసీహెచ్ఎస్ రమేష్‌కిషోర్, డీఎంవో ప్రసాద్, వైద్యాధికారి శివరామకృష్ణ పాల్గొన్నారు. -
ఎడారి బతుకులకు బాసట
గల్ఫ్ జైళ్లలో 700 మంది తెలంగాణవాసులు ఆ జైళ్లను సందర్శించనున్న మంత్రి కేటీఆర్ బృందం కార్మికుల విముక్తికి కాన్సులేట్‌తో మంతనాలు సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ వలస జీవుల భద్రత.. రక్షణ.. పునరావాసానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. తొలి ప్రయత్నం ప్రారంభించింది. గల్ఫ్ పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులు ఆహ్వానించేందుకు దుబాయ్ పర్యటనకు బయల్దేరిన పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు, ఉన్నతాధికారుల బృందం గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న కార్మికుల విముక్తికి చర్యలు చేపట్టనుంది. తొలి రోజు శనివారం దుబాయ్‌లో లేబర్ క్యాంపుల సందర్శనతో పాటు.. ఇమిగ్రేషన్, వీసాల సమస్యలు, గడువు మీరటంతో నివాస అర్హత కోల్పోయిన వలస బందీలతో సమావేశమవుతారు. 14న ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగే పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అబుదాబీలో లులూ గ్రూపునకు చెందిన చైర్మన్‌తో విందు సమావేశంలో పాల్గొంటారు. 15న దుబాయ్‌లోని అల్ అవీర్ సెంట్రల్ జైలును సందర్శిస్తారు. అనంతరం కాన్సులేట్ జనరల్ అధికారులతో భేటీ కానున్నారు. దీంతో పారిశ్రామికాభివృద్ధితోపాటు గల్ఫ్‌లో ఇబ్బంది పడుతున్న వలస కార్మికులకు భరోసానిచ్చేందుకు ప్రభుత్వం ఈ పర్యటన తలపెట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలోని అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, రాసల్ ఖైమా, ఫుజీరా, ఉమ్మల్ కోయిన్లోని వివిధ జైళ్లలో దాదాపు 700 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన ఖైదీలున్నారు. ప్రధానంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన దాదాపు పది లక్షల మంది కార్మికులు బతుకు దెరువుకు గల్ఫ్ బాట పట్టారు. వ్యవసాయంలో చితికిపోయిన రైతులు, ఉన్న ఊళ్లో కూలీలుగా బతకటం ఇష్టం లేని యువకులే ఎక్కువ సంఖ్యలో వలస వెళ్లారు. వీరిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావటంతో.. పాస్‌పోర్టు మొదలు వీసాలు, టికెట్లు అన్నింటా బ్రోకర్ల మాయాజాలంలో చిక్కుకొని అప్పుల పాలవుతున్నారు. ఎలాగైనా గల్ఫ్ వెళ్లాలన్నలక్ష్యంతో కొందరు లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి.. విజిటింగ్ వీసాలపై గల్ఫ్‌కు వెళ్ళి చాటు మాటుగా బిక్కు బిక్కుమని బతుకుతున్నారు. కాలం చెల్లిన వీసాలతో పట్టుబడి.. నెలల తరబడి అక్కడి జైళ్లల్లో మగ్గుతున్నారు. అక్కడి చట్టాలపై అవగాహన లేకపోవటంతో చిన్న చిన్న సంఘటనలకు జైలు శిక్ష పడ్డవారి సంఖ్య ఏటేటా ఆందోళన రేకెత్తిస్తోంది. కాగా, 2011 నవంబర్ 11న భారత్-యూఏఈల మధ్య ఖైదీల బదిలీ ఒప్పందం జరిగింది. అప్పటి హోం మంత్రి పి.చిదంబరం, యూఏఈ దేశ ఉప ప్రధాని, లెఫ్ట్‌నెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయేద్ అల్ సహయాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం అక్కడి జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు తమ సమ్మతి మేరకు భారత్‌కు బదిలీ కావచ్చు. మిగిలిన శిక్షాకాలాన్ని భారత్ జైళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. కేంద్రం చొరవ చూపకపోవటంతో.. ఈ ఒప్పందం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో గల్ఫ్‌లో బందీలుగా ఉన్న ఖైదీల కుటుంబాలు సైతం ఇక్కడ దయనీయ దుస్థితిని అనుభవిస్తున్నాయి. గల్ఫ్‌లో ఒక హత్య కేసులో కరీంనగర్‌కు చెందిన ఆరుగురు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవలే దుబాయ్ జైళ్లో సిరిసిల్ల మండలం పాపయ్యపల్లికి చెందిన బుర్ర లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న గొడవకు జైలు శిక్ష విధించి ఆరునెలలైనా తనను వదిలిపెట్టడం లేదనే మనోవేదనతో ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఈ వరుస సంఘటనలన్నీ కరీంనగర్ జిల్లాకు చెందినవి కావటం.. తన సొంత నియోజకవర్గం నుంచి గల్ఫ్ వలసలు ఎక్కువగా ఉండటంతో మంత్రి కేటీఆర్ దుబాయ్ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గల్ఫ్ జైలులో ఎనిమిదిన్నరేళ్లుగా... సిరిసిల్ల: కరీంనగర్ జిల్లాకు చెందిన వారు గల్ఫ్ దేశంలో ఓ హత్య కేసులో ఇరుక్కొని 25 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యారు. ఎనిమిదిన్నర ఏళ్లుగా దుబాయ్ జైలులో దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు. సిరిసిల్ల మండలం పెద్దూరు వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి మల్లేశం(36), శివరాత్రి రవి(34), కోనరావుపేటకు చెందిన దండుగ లక్ష్మణ్, చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి, గంగాధర మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ కరీం, నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతులు దుబాయ్ వెళ్లారు. నేపాల్‌కు దిల్ బహద్దూర్‌సింగ్ అనే సెక్యూరిటీ గార్డు దుబాయ్‌లో హత్యకు గురయ్యాడు. ఇందుకు ఈ ఆరుగురుతో పాటు పాకిస్తాన్‌కు చెందిన మరో నలుగురు కారకులని పోలీసులు అరెస్టు చేశారు. నేరం రుజువు అయిందని 25 ఏళ్ల జైలుశిక్ష విధించారు. హత్యకు గురైన బహద్దూర్ కుటుంబ సభ్యులు రూ.15 లక్షలు బ్లడ్‌మనీ (నష్టపరిహారం) ఇస్తే క్షమాభిక్ష పెడతామని తేల్చిచెప్పారు. అయితే, ఆ కుటుంబాలకు చెందిన వారు అంత డబ్బు చెల్లించలేక ప్రభుత్వ సాయాన్ని అర్థించారు. చివరకు తమ కిడ్నీలు అమ్ముకొని డబ్బులు చెల్లిస్తామని అందుకు అనుమతినివ్వాలని కోరుతూ మానవహక్కుల సంఘాన్ని 2012 నవంబర్‌లో కలిశారు. ఈ సంఘటనపై స్పందించిన అప్పటి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రూ.15 లక్షల బ్లడ్‌మనీని నేపాల్‌లోని బహద్దూర్ కుటుంబసభ్యులకు చెల్లించారు. రెండేళ్ల కిందటే డబ్బులు చెల్లించినా విడుదలలో జాప్యం జరుగుతోంది. ఇటీవల సయ్యద్కరీం విడుదలయ్యారు. మిగతా ఐదుగురు దుబాయ్ జైలులోనే ఉన్నారు. వీరి విడుదల కోసం దుబాయ్ న్యాయవాది అనురాధ నేపాల్ వెళ్లి సంబంధిత పత్రాలపై అటెస్టేషన్ సంతకాలు చేయించుకొచ్చారు. ప్రస్తుతం దుబాయ్‌లో బందీల విడుదల కోసం న్యాయవాది ప్రయత్నిస్తున్నారు. -
‘హంద్రీ నీవాను పూర్తి చేస్తాం’
గుంతకల్లు : హంద్రీనీవాను పూర్తి చేసి నీటి సమస్యను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. అనంతపురం, కర్నూలు జిల్లాలకు వరప్రసాదిని అయిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల హడావుడిగా పూర్తి చేయడంతో అనేక చోట్ల గండ్లు పడుతున్నాయన్నారు. అనంతపురం జిల్లాపై చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం ఉందని, అందులో భాగంగానే సోలార్‌హబ్, ఫుడ్‌పార్కు, టెక్స్‌టైల్స్‌పార్కు తదితర పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్ కుదింపునకు గురికాకుండా శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అంతకుముందు ఆలయ ఈఓ ఎంవీ సురేష్‌బాబు, అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఈఓతో పాటు ప్రధాన అర్చకులు వసుధ రాజాచార్యులు డిప్యూటీ సీఎంను సన్మానించారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ కోడెల అపర్ణ, వైస్ చైర్మన్ శ్రీనాథ్ గౌడ్, ఆర్డీఓ హుస్సేన్‌సాబ్, మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఇది ‘పాడి’యేనా..!
పెరిగిన ఎండలతో కరువైన పశుగ్రాసం విలవిల్లాడుతున్న పశువులు జిల్లాలో 20 శాతం తగ్గిన పాల దిగుబడి వేసవికి లేని ప్రత్యేక ప్రణాళిక నివేదికలతో సరిపెడుతున్న ప్రభుత్వాలు పాడి పంట అన్నారు పెద్దలు..పంటపోతే పాడి ఆదుకుంటుంది. ఆరుగాలం ఇంటిల్లిపాదీ కష్టించినా, వ్యవసాయం కలిసిరావడం లేదు. ఎంత ఎక్కువ సేద్యం చేపడితే అంత ఎక్కువ అప్పుల్లో రైతు కూరుకుపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు పాడివైపు ఆసక్తి చూపుతున్నారు. పశుపోషణ చేపడుతున్నారు. క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే ఏకైక మార్గమైన పాడికి నేడు గడ్డు పరిస్థితులు దాపురించాయి. ప్రభుత్వ ఉదాశీనత కారణంగా ఈ రంగం కూడా రైతుకు ఆదరవు కాకుండా పోతోంది. మరో పక్క ఎండలు పెరగడంతో పశుగ్రాసం కొరత ఏర్పడి పరోక్షంగా పాల దిగుబడిపై ప్రభావం చూపుతోంది. నర్సీపట్నం/యలమంచిలి: పాడిపరిశ్రమపై ఎండల ప్రభావం కనబడుతోంది. పశుగ్రాసం కొరతతో మూగజీవాలు అల్లాడుతున్నాయి. వాటిపోషణకు అన్నదాతలు అష్టక ష్టాలు పడుతున్నారు. వేలాది కుటుంబాలను ఆదుకుంటున్న పాడిపరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. జిల్లా వ్యాప్తంగా ఆవులు నాలుగు లక్షలు, గేదెలు రెండు లక్షల వరకు ఉంటాయి. వీటిలో 50 శాతం పశువులు పాల దిగుబడిని ఇస్తుంటాయి. వీటి నుంచి రోజుకు లక్షల లీటర్ల వరకు పాల దిగుబడి వస్తుంది. విశాఖ డెయిరీ, సుప్రజ, హెరిటేజ్, తిరుమల డెయిరీలు రైతుల నుంచి పాలు సేకరించి, వివిధ రకాలైన ఉత్పత్తుల ద్వారా అమ్మకాలు చేస్తుంటారు. ఎండల తీవ్రత, వర్షాభావం కారణంగా విశాఖ డెయిరీ పాలసేకరణ జూన్ 5 నాటికి 7.02లక్షల లీటర్లు ఉండగా, ప్రస్తుతం 6.66లక్షల లీటర్లకు దిగజారింది. జిల్లాలోని పలు ప్రైవేట్ డెయిరీలలోనూ ఇదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా పశువులకు రోజుకు 1.25 లక్షల క్వింటాళ్ల పశుగ్రాసం అవసరమవుతుంది. రైతులు మెట్టభూముల్లోనే పశుగ్రాసం పెంపకం చేపడతారు. వర్షాభావంతో పంటపొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. అంతటా పశుగ్రాసం కొరత ఏర్పడింది. మార్కెట్లోదాణా ధరలు అందుబాటులో లేకుండాపోయాయి. కనీసం పశువులకు తాగునీరు కూడా అందించలేకపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా పాలసేకరణ చేస్తున్న యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పాల దిగుబడి తగ్గిపోయింది. విశాఖ డెయిరీకి రోజుకు రెండువేల లీటర్ల వరకు సరఫరా చేస్తున్న పలు పాల సేకరణ కేంద్రాలకు ప్రస్తుతం వెయ్యి లీటర్లకు మించి రావడం లేదు. వ్యవసాయం కలిసిరాకపోవడంతో ఎక్కువమం ది రైతులు పాడిపరిశ్రమపైనే ఆధారపడుతున్నారు. ఒక్కొక్క కుటుంబానికి రెండు నుంచి మూడు పశువులు ఉంటున్నాయి. ఇక పల్లెల్లో పలువురు యువకులు పాడిపడిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా పలువురు రైతులు ఎండలకు భయపడి ఇళ్లవద్దనే అందుబాటులో ఉన్న ఎండుగడ్డితో కాలం నెట్టుకొస్తున్నారు. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో కిలో తౌడు రూ.10ల నుంచి రూ.15లు, నూకలు రూ.20నుంచి రూ.25ల వరకు ఉండడంతో దాణా కొనుగోలు రైతులకు ఆర్థిక భారంగా మారింది. విశాఖ డెయిరీ ద్వారా సరఫరా చేసే దాణా ధరలు కూ డా నెలన్నర క్రితం పెంచేశారు. ప్రస్తుతం 50 కిలోల దాణా రు.550లకు రైతులకు పంపిణీచేస్తున్నారు. జిల్లాలో పలు పాల సేకరణ కేంద్రాల్లో గత 20రోజులుగా దాణా అందుబాటులో లేకపోవడంతో రైతు లు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా పాలదిగుబడిపై ప్రభావం కనబడుతోంది. పూటకు రెండు లీటర్ల వరకు పాలిచ్చే పశువు లీటరుకంటే తక్కువ ఇస్తోందని చెబుతున్నారు. దీంతో రోజువారీ ఆదా యం తగ్గి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వేసవి ప్రణాళిక ఏదీ? జిల్లాలో అధికశాతం వర్షాధార భూములు కావడంతో ఏటా వేసవిలో పశుగ్రాసానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో పాడి రైతులకు రాయితీపై ఎండుగడ్డిని సరఫరా చేసేవారు. ఈ ఏడాది అటువంటి ప్రణాళికకు ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కాస్తున్న ఎండలపై స్పందించిన ప్రభుత్వం నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న పశువులకు ఎంత గ్రాసం అవసరముంది? అందుబాటులో ఎంత ఉంది? ఎంత మేర అవసరం? అనే దానిపై పూర్తి వివరాలివ్వాలంటూ ఆదేశించింది. దీనిపై వెటర్నరీ జేడీ వి.వెంకటేశ్వరావు మాట్లాడుతూ వేసవిలో గ్రాసం కొరతపై నిల్వ విధానాన్ని అలవాటు చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతమున్న పశుగ్రాసం కొరతపై ప్రభుత్వానికి నివేదించి, వారి ఆదేశం మేరకు తదుపరి చర్యలు చేపడతామని వివరించారు.