ఎడారి బతుకులకు బాసట | 700 prisons in the Gulf of telanganava | Sakshi
Sakshi News home page

ఎడారి బతుకులకు బాసట

Published Sat, Dec 13 2014 2:25 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

ఎడారి బతుకులకు బాసట - Sakshi

ఎడారి బతుకులకు బాసట

  • గల్ఫ్ జైళ్లలో 700 మంది తెలంగాణవాసులు
  • ఆ జైళ్లను సందర్శించనున్న మంత్రి కేటీఆర్ బృందం
  • కార్మికుల విముక్తికి కాన్సులేట్‌తో మంతనాలు
  • సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ వలస జీవుల భద్రత.. రక్షణ.. పునరావాసానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. తొలి ప్రయత్నం ప్రారంభించింది. గల్ఫ్ పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులు  ఆహ్వానించేందుకు దుబాయ్ పర్యటనకు బయల్దేరిన పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు, ఉన్నతాధికారుల  బృందం గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న కార్మికుల విముక్తికి చర్యలు చేపట్టనుంది.

    తొలి రోజు శనివారం దుబాయ్‌లో లేబర్ క్యాంపుల సందర్శనతో పాటు.. ఇమిగ్రేషన్, వీసాల సమస్యలు, గడువు మీరటంతో నివాస అర్హత కోల్పోయిన వలస బందీలతో సమావేశమవుతారు. 14న ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగే పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అబుదాబీలో లులూ గ్రూపునకు చెందిన చైర్మన్‌తో విందు సమావేశంలో పాల్గొంటారు. 15న దుబాయ్‌లోని అల్ అవీర్ సెంట్రల్ జైలును సందర్శిస్తారు. అనంతరం కాన్సులేట్ జనరల్ అధికారులతో భేటీ కానున్నారు.

    దీంతో పారిశ్రామికాభివృద్ధితోపాటు గల్ఫ్‌లో ఇబ్బంది పడుతున్న వలస కార్మికులకు భరోసానిచ్చేందుకు ప్రభుత్వం ఈ పర్యటన తలపెట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.     ప్రస్తుతం యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలోని అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, రాసల్ ఖైమా, ఫుజీరా, ఉమ్మల్ కోయిన్‌లోని వివిధ జైళ్లలో దాదాపు 700 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన ఖైదీలున్నారు. ప్రధానంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన దాదాపు పది లక్షల మంది కార్మికులు బతుకు దెరువుకు గల్ఫ్ బాట పట్టారు. వ్యవసాయంలో చితికిపోయిన రైతులు, ఉన్న ఊళ్లో కూలీలుగా బతకటం ఇష్టం లేని యువకులే ఎక్కువ సంఖ్యలో వలస వెళ్లారు.  

    వీరిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావటంతో.. పాస్‌పోర్టు మొదలు వీసాలు, టికెట్లు అన్నింటా బ్రోకర్ల మాయాజాలంలో చిక్కుకొని అప్పుల పాలవుతున్నారు. ఎలాగైనా గల్ఫ్ వెళ్లాలన్నలక్ష్యంతో కొందరు లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి..  విజిటింగ్ వీసాలపై గల్ఫ్‌కు వెళ్ళి చాటు మాటుగా బిక్కు బిక్కుమని బతుకుతున్నారు.  కాలం చెల్లిన వీసాలతో పట్టుబడి.. నెలల తరబడి అక్కడి జైళ్లల్లో మగ్గుతున్నారు. అక్కడి చట్టాలపై అవగాహన లేకపోవటంతో చిన్న చిన్న సంఘటనలకు జైలు శిక్ష పడ్డవారి సంఖ్య ఏటేటా ఆందోళన రేకెత్తిస్తోంది.

    కాగా, 2011 నవంబర్ 11న భారత్-యూఏఈల మధ్య ఖైదీల బదిలీ ఒప్పందం జరిగింది. అప్పటి హోం మంత్రి పి.చిదంబరం, యూఏఈ దేశ ఉప ప్రధాని, లెఫ్ట్‌నెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయేద్ అల్ సహయాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం అక్కడి జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు తమ సమ్మతి మేరకు భారత్‌కు బదిలీ కావచ్చు. మిగిలిన శిక్షాకాలాన్ని భారత్ జైళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. కేంద్రం చొరవ చూపకపోవటంతో.. ఈ ఒప్పందం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో గల్ఫ్‌లో బందీలుగా ఉన్న ఖైదీల కుటుంబాలు సైతం ఇక్కడ దయనీయ దుస్థితిని అనుభవిస్తున్నాయి. గల్ఫ్‌లో ఒక హత్య కేసులో కరీంనగర్‌కు చెందిన ఆరుగురు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

    ఇటీవలే దుబాయ్ జైళ్లో సిరిసిల్ల మండలం పాపయ్యపల్లికి చెందిన బుర్ర లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న గొడవకు జైలు శిక్ష విధించి ఆరునెలలైనా తనను వదిలిపెట్టడం లేదనే మనోవేదనతో ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఈ వరుస సంఘటనలన్నీ కరీంనగర్ జిల్లాకు చెందినవి కావటం.. తన సొంత నియోజకవర్గం నుంచి గల్ఫ్ వలసలు ఎక్కువగా ఉండటంతో మంత్రి కేటీఆర్ దుబాయ్ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
     
    గల్ఫ్ జైలులో ఎనిమిదిన్నరేళ్లుగా...

    సిరిసిల్ల: కరీంనగర్ జిల్లాకు చెందిన వారు గల్ఫ్ దేశంలో ఓ హత్య కేసులో ఇరుక్కొని 25 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యారు. ఎనిమిదిన్నర ఏళ్లుగా దుబాయ్ జైలులో దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు.  
     
    సిరిసిల్ల మండలం పెద్దూరు వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి మల్లేశం(36), శివరాత్రి రవి(34), కోనరావుపేటకు చెందిన దండుగ లక్ష్మణ్, చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి, గంగాధర మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ కరీం, నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతులు దుబాయ్ వెళ్లారు. నేపాల్‌కు  దిల్ బహద్దూర్‌సింగ్ అనే సెక్యూరిటీ గార్డు దుబాయ్‌లో హత్యకు గురయ్యాడు.

    ఇందుకు ఈ ఆరుగురుతో పాటు పాకిస్తాన్‌కు చెందిన మరో నలుగురు కారకులని పోలీసులు అరెస్టు చేశారు. నేరం రుజువు అయిందని 25 ఏళ్ల జైలుశిక్ష విధించారు. హత్యకు గురైన బహద్దూర్ కుటుంబ సభ్యులు రూ.15 లక్షలు బ్లడ్‌మనీ (నష్టపరిహారం) ఇస్తే క్షమాభిక్ష పెడతామని తేల్చిచెప్పారు. అయితే, ఆ కుటుంబాలకు చెందిన వారు అంత డబ్బు చెల్లించలేక ప్రభుత్వ సాయాన్ని అర్థించారు. చివరకు తమ కిడ్నీలు అమ్ముకొని డబ్బులు చెల్లిస్తామని అందుకు అనుమతినివ్వాలని కోరుతూ మానవహక్కుల సంఘాన్ని 2012 నవంబర్‌లో కలిశారు.

    ఈ సంఘటనపై స్పందించిన అప్పటి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రూ.15 లక్షల బ్లడ్‌మనీని నేపాల్‌లోని బహద్దూర్ కుటుంబసభ్యులకు చెల్లించారు. రెండేళ్ల కిందటే డబ్బులు చెల్లించినా విడుదలలో జాప్యం జరుగుతోంది. ఇటీవల సయ్యద్‌కరీం విడుదలయ్యారు. మిగతా ఐదుగురు దుబాయ్ జైలులోనే ఉన్నారు. వీరి విడుదల కోసం దుబాయ్ న్యాయవాది అనురాధ నేపాల్ వెళ్లి సంబంధిత పత్రాలపై అటెస్టేషన్ సంతకాలు చేయించుకొచ్చారు. ప్రస్తుతం దుబాయ్‌లో బందీల విడుదల కోసం న్యాయవాది ప్రయత్నిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement