రైతు కంట కన్నీరు ఆగదా? | Governments Not Focussing On Farmers Problems | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 20 2018 12:34 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

Governments Not Focussing On Farmers Problems - Sakshi

లాంగ్‌మార్చ్‌ జరిగి, రైతులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం రాతపూర్వకహామీ ఇచ్చిన తర్వాత కూడా తగిన కార్యాచరణతో రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు కనబడటం లేదు.  వ్యవసాయ సంక్షోభం ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల పరిస్థితి ఇదే.  2017లో ఢిల్లీలో తమిళనాడు రైతులు అర్ధనగ్నంగా చేసిన ఆందోళన, పంజాబ్, హరియాణాలో రైతుల అలజడి, మహారాష్ట్ర ‘లాంగ్‌మార్చ్‌’ దేశంలోని రైతుల కష్టాలకు, కడగండ్లకు నిదర్శనం.

రైతాంగానికి సంబంధించిన వార్తలు పత్రికల పతాకశీర్షికలలో కనిపించడం అరుదు. ఇటీవల మహారాష్ట్ర రైతాంగం, ఆదివాసీలు సుమారు 30 వేల మంది నాసిక్‌ నుంచి ముంబై వరకు 10 రోజులు ఎర్రజెండాలు పట్టుకొని కదం తొక్కిన చారిత్రక ఘటన దేశంలోని యావత్‌ మీడియాకు ప్రధాన వార్త కావడం గమనార్హం. లాంగ్‌మార్చ్‌గా పిలుచుకున్న మహారాష్ట్ర రైతుల ఉద్యమంలో అనేక ప్రత్యేకతలు కనిపించాయి. అడుగడుగునా ప్రజల మద్దతు లభించింది. మంచినీరు, ఆహారం స్వచ్ఛందంగా అందించి వారు సంఘీభావాన్ని ప్రదర్శించారు. చిన్న అవాంఛనీయ సంఘటనకు పాల్పడకుండా దేశ ప్రజల మన్ననలను, సానుభూతిని రైతులు పొందగలిగారు.

న్యాయమైన డిమాండ్లు

‘లాంగ్‌మార్చ్‌’ వెనుక అనేక కారణాలున్నాయి. ప్రదర్శన ద్వారా అవన్నీ ప్రజల్లో చర్చకు వచ్చాయి. రైతుల డిమాండ్లను నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం వల్ల ‘లాంగ్‌మార్చ్‌’ విజయవంతం అయిందని చెబుతున్నారు. కానీ, ఆ హామీ అమలైనప్పుడే విజయమని చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందు రైతాంగం ఏడు ప్రధాన డిమాండ్లను ఉంచింది. రుణమాఫీ అమలు, ఆదివాసీలకు అటవీభూములపై యాజమాన్య హక్కులు; స్వామినాథన్‌ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరల అమలు; కరవు, వరదలు, చీడపీడలవల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లింపు, సూపర్‌ హైవేలు, బుల్లెట్‌ ట్రైన్‌ వంటి ప్రాజెక్టులకు బలవంతంగా భూముల సేకరణ నిలుపుదల చేయడం, విద్యుత్‌ బిల్లుల బకాయిల రద్దు మొదలైనవి వారి డిమాండ్లలో ప్రధానమైనవి.

రుణమాఫీ హామీని మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలోనే బీజేపీ హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటి వరకు పూర్తిగా జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏవిధంగా రుణభారాన్ని కుదించి విడతల వారీగా నిధులు కేటాయించి బకాయిలు రద్దు చేసిందో, అదేబాటలో మహారాష్ట్ర ప్రభుత్వం నడిచింది. రూ. 34,000 కోట్ల రుణమాఫీ చేస్తే 89 లక్షల మంది రైతులకు లాభం చేకూరుతుంది. ప్రధానంగా తొలివిడత చేసిన రుణమాఫీలో కౌలు రైతులు లేరు. రుణమాఫీ ప్రకటించి 6 నెలలు అయినా 10% రైతులకు మాత్రమే అమలైంది. మహారాష్ట్రలో అధిక శాతం పోడు వ్యవసాయం చేసే రైతులున్నారు. వారికి రుణమాఫీ వర్తింపజేయడం లేదు. 

మహారాష్ట్ర రైతుల ఆందోళనకు మరో కారణం నకిలీ విత్తన సమస్య. హైబ్రీడ్‌ రకాల విత్తనాల బదులుగా దేశీయంగా తయారుచేసే విత్తనాలే ఉపయోగించాలనీ అది దేశభక్తికి సంకేతమనీ ఆరెస్సెస్‌ ప్రచారం చేయడం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం  వంతపాడటంతో రైతులు దేశవాళీ విత్తనాలే కొనుగోలు చేస్తున్నారు. వాటికి చీడపీడల్ని తట్టుకొనే శక్తిలేదు. ఫలితంగానే 84% వ్యవసాయ భూముల్లో రైతులు పత్తిసాగు చేస్తే పింక్‌బోల్‌ వర్మ్‌ వ్యాధి సోకింది. రైతులు నిలువునా మునిగిపోయారు. దీనికితోడు జనవరి చివరివారంలో కురిసిన అకాల వర్షాలు చాలా ప్రాంతాల్లో పంటను దెబ్బతీశాయి. మరఠ్వాడా, నాగ్‌పూర్, అమరావతి, యవత్మల్, నాసిక్‌ ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా కరవు ఏర్పడింది.

వీటన్నింటి కారణంగా 2017–18లో మహారాష్ట్రలో సాధారణ పంటకంటే 37% పంట దిగుబడి తగ్గింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మహారాష్ట్రలో వ్యవసాయాభివృద్ధి రేటు 8.3% తగ్గి నెగటివ్‌ గ్రోత్‌ నమోదయింది. దీనికితోడు ఫడ్నవీస్‌ ప్రభుత్వం బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు, ఎక్స్‌ప్రెస్‌వే, నదుల అనుసంధానం పేరుతో బలవంతపు భూసేకరణ చేపట్టింది. దీనివల్ల అనేక ఆదివాసీ, గిరిజన గ్రామాలు విధ్వంసానికి గురవుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే గత రెండు దశాబ్దాలలో 65,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఈ ఏడాది సగటున రోజుకు 9 మంది రైతులు తనువులు చాలించిన దయనీయస్థితి నెలకొంది.
రైతుల ఆందోళనకు మరో కారణం అటవీ భూమి హక్కుల బదలాయింపు.

పుష్కరం క్రితమే, ఆనాటి కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం చేసింది. అటవీశాఖ పరిధిలో ఉన్న గిరిజన భూములపై యాజమాన్య హక్కును వారికే బదలాయించాలని చట్టంలో ఉంది. కానీ, నేటివరకు దేశంలో అమలు జరగడం లేదు. అందుకే మహారాష్ట్రలోని నాసిక్‌ ప్రాంతంలో 25.61%; థానేలో 13.9% మంది ఉన్న గిరిజనులు లాంగ్‌మార్చ్‌లో ముందువరుసలో నిలిచారు. హైవేల నిర్మాణాలు, నదుల అనుసంధానం ప్రాజెక్టులు మొదలైన ప్రతిపాదిత అభివృద్ధి పనుల్లో అధిక సంఖ్యలో నష్టపోతున్నది గిరిజనులే.  రైతులు, గిరిజనుల్లో చైతన్యాన్ని రగలించి లాంగ్‌మార్చ్‌కు సమాయత్తం చేసింది అఖిల భారత కిసాన్‌ సభ.    

ఆర్నెల్ల గడువు కోరిన ప్రభుత్వం

30 వేల మందితో సాగిన లాంగ్‌మార్చ్‌కు ఫడ్నవిస్‌ ప్రభుత్వం దిగొచ్చింది. రైతుల డిమాండ్లను పరిష్కరించడానికి ఆర్నెల్లు గడువుకోరింది. ఆరుగురు మంత్రుల కమిటీ రైతు ప్రతినిధులతో చర్చలు జరిపింది. ప్రభుత్వం రాత పూర్వక హామీ ఇచ్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించారు. ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణపైకి మళ్లింది. ప్రభుత్వం ఇటీవల ఏడో వేతన కమిషన్‌ నివేదిక అమలుకు ఒప్పుకొంది. అర్బన్‌ మెట్రో ప్రాజెక్టు, శివాజీ విగ్రహ ఏర్పాటు మొదలైన భారీ వ్యయంతో కూడుకొన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రైతుల డిమాండ్లను తీర్చడానికి నిధుల సర్దుబాటును ఏవిధంగా చేయగలదన్న అనుమానం అందరిలో కనిపిస్తోంది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరలు ప్రకటించడం కేంద్రం పరిధిలో ఉంది. అధికారంలోకి రాగానే మోదీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అందించిన అఫిడవిట్‌లో ఉత్పత్తి వ్యయానికి 50% పెంచి కనీస మద్దతు ధరలు ఇస్తామని పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్రాలను ఆదుకోవడానికి కేంద్రం ముందుకొచ్చేది సందేహమే! 

నిజానికి దేశ వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టాల్సింది కేంద్రమే. మోదీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చాటుకోవడం కోసం 2015లో అప్పటివరకూ ఉన్న ‘వ్యవసాయ మంత్రిత్వశాఖ (మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌)’ను ‘వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖ’ అని మార్చింది. అలాగే ఈ శాఖకు గతంలో ఉన్న ‘ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రైతు శ్రేయస్సు’ అనే లక్ష్యాలను మార్చుకొని 2022– 23 నాటికల్లా రైతు ఆదాయం రెట్టింపు చేయడాన్ని లక్ష్యంగా ఏర్పరచుకుని ప్రచారం చేస్తుంది. నీతి ఆయోగ్‌ అధ్యయనం ప్రకారం రైతుల ఆదాయం 2022–23 నాటికి రెట్టింపు కావాలంటే, ఏడేళ్ల పాటు రైతుల ఆదాయం ఏటా 10.4% మేర పెరగాలి. గత దశాబ్దన్నర కాలం అనుభవాలను విశ్లేషించి చూస్తే 1993–94 నుంచి 2004–05 వరకు అంటే దశాబ్దాల కాలంలో రైతుల ఆదాయంలో కనిపించిన వృద్ధి 3.3% మాత్రమే. 2004– 05 నుంచి 2011–12 మధ్యకాలంలో రైతుల ఆదాయాభివృద్ధి 5.52% మేర పెరిగింది. మద్దతు ధరల్లో గణనీయమైన పెరుగుదల లేకుండా రైతుల ఆదాయం రెట్టింపు కాజాలదని స్వామినాథన్‌ నిరూపించినప్పటికీ కేంద్రం కనీస మద్దతు ధరలను శాస్త్రీ యంగా పెంచడానికి సిద్ధంగా లేదు.

కారుణ్య మరణాలకు అనుమతి కోరిన రైతులు
జీవించడం సాధ్యం కాని పరిస్థితులలో రోగులు కారుణ్య మరణాలు కోరుకోవడంలో తప్పులేదంటూ ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాకు చెందిన 91 మంది రైతులు చనిపోయేందుకు అనుమతినివ్వాలని గవర్నర్, సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌లకు లేఖలు రాయడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. పండించిన పంటకు సరైన ధర లభించక.. అప్పుల బారిన పడ్డామని, జాతీయ రహదారి కోసం ప్రభుత్వం సేకరించిన తమ భూములకు తగిన పరిహారం చెల్లించలేదని రైతులు పేర్కొంటూ తమ కుటుంబాలను పోషించుకొనే పరిస్థితి లేనందున తమకు కారుణ్య మరణం ప్రసాదించాలని వారు వేడుకొన్నారు.

లాంగ్‌మార్చ్‌ జరిగి, రైతులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం రాతపూర్వకహామీ ఇచ్చిన తర్వాత కూడా తగిన కార్యాచరణతో రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు కనబడటం లేదు.  వ్యవసాయ సంక్షోభం ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల పరిస్థితి ఇదే.  2017లో ఢిల్లీలో తమిళనాడు రైతులు అర్ధనగ్నంగా చేసిన ఆందోళన, మధ్యప్రదేశ్‌లోని మందసర్‌లో పోలీసు కాల్పుల్లో రైతులు హతం అయిన దారుణ ఉదంతం; పంజాబ్, హరియాణాలో  రైతుల ఆందోళన, తాజాగా మహారాష్ట్ర ‘లాంగ్‌మార్చ్‌’ దేశంలోని రైతుల కష్టాలకు, కడగండ్లకు నిదర్శనం. 

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయవృత్తి లాభసాటిగా లేకపోవడంతో రైతులు పట్టణ ప్రాంతాలకు వలసలు పోతున్నారు. వలసలను నివారించాలంటే వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా రూపొందించడం మినహా మరోమార్గం లేదు. కేంద్రం, రాష్ట్రాలు అభివృద్ధి మంత్రం జపిస్తూ పట్టణాలు, నగరాల్లో ఫ్లైఓవర్లు, 4 లైన్ల రహదారులు, బుల్లెట్‌ ట్రైన్లు మొదలైన ఆకర్షణీయమైన ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందే. కానీ వ్యవసాయరంగంపై అధికశాతం ఆధారపడిన వారి సౌకర్యాలు, సంక్షేమాన్ని విస్మరించడం వల్లనే నేడు రైతులు రోడ్లెక్కుతున్నారు. ప్రభుత్వాలు చెబుతున్నట్టు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు లాంటి ప్రకటనలు కాగితాలకే పరిమితం కాకూడదు.

డా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు
మొబైల్‌ : 99890 24579

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement