♦ రూ. 12.50 లక్షలు రికవరీ
♦ ముఠా సభ్యుల్లో ఇద్దరి రిమాండ్
♦ జిల్లా ఎస్పీ సుమతి
కొండపాక : వ్యవసాయ బావుల వద్ద నుంచి పశువులను ఎత్తుకెళ్లే అంతర్ జిల్లా పశువుల దొంగల ముఠాను కుకునూర్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. కొండపాక మండలం వెలికట్ట శివారులో గల జనగామ క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ముఠా గుట్టు రట్టయింది. సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్, తొగుట సీఐ ఏరుకొండ వెంకటయ్యతో కలిసి శనివారం జిల్లా ఎస్పీ సుమతి విలేకరులకు వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడకు చెందిన మహ్మద్ అయూబ్ (64), మహ్మద్ బాబా (40), హైదరాబాద్ బషీరాబాద్‌కు చెందిన మహ్మద్ గౌస్ ఖురేషీ (47), బహుదూర్‌ఫురాకు చెందిన మహ్మద్ ఇషాక్ ఖురేషీ (51) మరో ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు.
వీరిలో ముఖ్యుడైన మహ్మద్ అయూబ్ 2001 నుంచి రోడ్డు పక్కన, వ్యవసాయ బావుల వద్ద ఉన్న పశువుల పాకలను టార్గెట్ చేస్తూ వంద పశువులను దొంగిలించాడు. అతనిపై 39 కేసులు నమోదు కాగా, జైలుకు వెళ్లి వచ్చాడు. అదే క్రమంలో ఈ ముఠా 68 లారీలను సైతం అపహరించింది. పశువులను అపహరించిన అనంతరం వాటిని తరలించేందుకు ఉనపయోగించే వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. అపహరించి తెచ్చిన పశువులను మహ్మద్‌గౌస్ ఖురేషీ పశుమాంస విక్రయ దుకాణాలకు సరఫరా చేసేవాడు. వచ్చే డబ్బులను ఈ ముఠా విలాసాలకు వెచ్చించేది. సొంత ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసింది. ఇలా మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఈ ముఠా పశువులను అపహరించింది. ముఠా వాడిన వాహనాలు రాజీవ్ రహదారిపై, జాతీయ రహదారిలపై ఏర్పాటు చేసి సీసీ కెమేరా పుటేజీల్లో స్పష్టంగా నమోదై ఉన్నాయి.
ఈ క్రమంలో నిఘా ఉంచిన తొగుట సీఐ వెంకటయ్య, కుకునూర్‌పల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి.. శనివారం ఉదయం వెలికట్ట శివారులో గల జనగామ క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. దీంతో ఈ ముఠాలోని మహ్మద్ అయూబ్, మహ్మద్ గౌస్ ఖురేషీ పట్టుబడ్డారు. వాహనాన్ని, రూ. 12.50 లక్షల నగదు, పశువులు అరవకుండా ఇచ్చే మత్తు ఇంజక్షన్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఠా నుంచి సుమారు 70 శాతం సొమ్మును రికవరీ చేశామని మిగతా 30 శాతాన్ని వారు కొన్న ఇళ్ల స్థలాల ద్వారా చేస్తామన్నారు. ముఠాను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ సుమతి అభినందించారు.