సాక్షి, కడప : 2014 జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో సరైన వర్షం లేదంటే నమ్మశక్యంగా లేకపోయినా నమ్మి తీరాల్సిందే. ఒక్క భారీ వర్షం కూడా కురవకపోవడంతో జిల్లాలోని భారీ ప్రాజెక్టులతోపాటు చెరువులు బోసిపోయాయి. ఎక్కడ చూసినా పంట పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అరకొర పదునుతో సాగుచేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. రైతులకు సంబంధించి పెట్టుబడి నష్టం కాగా.. మరో పక్క పండ్ల తోటల రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. నీళ్లు వచ్చే బోర్లు సైతం నిలువునా ఎండిపోతుండగా పండ్ల తోటలను ఏవిధంగా సంరక్షించుకోవాలో అన్నదాతకు దిక్కు తో చడం లేదు.
మూగజీవాలను అమ్ముకుంటున్న అన్నదాతలు :
జిల్లాలో ఎక్కడ చూసినా ట్రాక్టర్లతో వ్యవసాయ పనులు చేస్తున్నా అక్కడక్కడ రైతులు ఎద్దులను నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని మేపలేక సంతకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. పులివెందుల, మైదుకూరులోనే కాకుండా రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట, కడప, కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పశుగ్రాసం కొరతతో గొర్రెలను కూడా అమ్మేందుకు సిద్ధపడుతున్నారు.
కొనేవారేరీ.. !
జిల్లాలో 8 నెలలుగా వర్షాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక పాడి రైతులు పశువులను విక్రయించేందుకు సిద్ఢపడుతున్నా కొనేవారు కనిపించడం లేదు. గ్రామాల్లోకి వచ్చి కొనుగోలు చేసేవారు లేకపోవడంతో.. చివరకు సంతకు తీసుకొచ్చినా అక్కడ కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దళారులు కొనుగోలు చేసి కబేళాలకు తరలిస్తున్నారు. కొన్నేళ్లుగా వ్యవసాయంలో తోడు నీడగా నిలిచిన మూగజీవాలను కటిక వ్యాపారస్తులకు అమ్మాలంటే అన్నదాతకు మనసొప్పడం లేదు.. కన్నీళ్లు పెట్టుకుంటూ వాటిని విక్రయిస్తున్నారు. పదుల సంఖ్యలో పశువులను లారీలలో ఎక్కించి నిలబడటానికి కూడా చోటులేని విధంగా వాటిని చిత్రహింసలకు గురిచేస్తూ తీసుకెళుతుంటారు.
కన్నీళ్లతో..
Published Sun, Aug 24 2014 4:22 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement