పశువుల్లో బాక్టీరియా వ్యాధులు | cattle need to be protected from disease In winter | Sakshi
Sakshi News home page

పశువుల్లో బాక్టీరియా వ్యాధులు

Published Tue, Dec 10 2019 6:30 AM | Last Updated on Tue, Dec 10 2019 6:30 AM

cattle need to be protected from disease In winter - Sakshi

శీతాకాలంలో పశువులను వ్యాధుల బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

గొంతువాపు: పాస్టురెల్లా మల్టోసైడా అనే బ్యాక్టీరియా వల్ల గొంతువాపు వస్తుంది. ఒక్కసారిగా జ్వరం రావడం, నోటి చొంగ, ఊపిరి కష్టంగా ఉండటం లాంటివి చూపిస్తుంది. 24 గంటల్లో పశువు చనిపోతుంది. చలికాలంలో పశువులు దగ్గర దగ్గరగా ఉంటుంటాయి. అందువల్ల చొంగ ద్వారా ఈ వ్యాధి త్వరగా వ్యాపించవచ్చు. ఇంతకుముందే టీకాలు వేయించుకొని ఉంటే గొంతువ్యాపు రాదు. ఇప్పుడు కూడా టీకా వేయించుకోవచ్చు. వైద్యము ఖరీదు కాబట్టి నివారణ మేలు.

పింక్‌ ఐ: ఇన్‌ఫెచ్యువస్‌ బొవైన్‌ కెరెటో కంజెక్టువైటిస్‌ అనే వ్యాధికి పింక్‌ ఐ అని కూడా పేరు. దీని తీవ్రత వర్షాకాలంలో ఎక్కువైనప్పటికీ శీతాకాలంలోనూ వ్యాపిస్తుంది. మోరాక్సెల్లా బోవిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల పింక్‌ ఐ సోకుతుంది. వ్యాధి బారిన పడి తేరుకున్న పశువుల ముక్కు రంధ్రాల ద్వారా ఈ బాక్టీరియా బయటకు వ్యాప్తి చెందుతుంది. త్వరగా వైద్యం మొదలు పెట్టడం, పశువైద్యుని సలహా మేరకు టెట్రాసైక్లిన్స్‌ గల ఆంటీబయోటిక్స్‌ని వాడాలి.

ఫుట్‌ రాట్‌: దీనినే గొర్రెల్లో వాడుక భాషలో కుంట్లు అంటారు. గిట్టల మధ్య వాచి, నొప్పిగా ఉండి, పశువులు కుంటుతూ ఉంటాయి. ఫ్యూసోబ్యాక్టీరియమ్‌ నెక్రోఫోగమ్‌ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. చిత్తడి నేలల్లో పశువులను ఉంచినట్లయితే ఈ పరిస్థితి వస్తుంది. కాళ్ల మీద బరువు మోపలేకపోవడం, నొప్పి కనబరచడం, వాసన కలిగి ఉండడం, మేత మేయలేకపోవడం లాంటి లక్షణాలను పశువు చూపిస్తుంది. పశువులను పొడి నేలల్లో ఉండడం, పెన్సిలిన్, సెప్టియోఫర్, టెట్రాసైక్లిన్‌ లాంటి యాంటీ బయోటిక్స్‌ను వాడాలి.

కాఫ్‌ దిప్తీరియా/లారిన్‌జైటిస్‌: ఇది కూడా ఫూసోబ్యాక్టీరియమ్‌ నెక్రోఫోరమ్‌ వల్లనే కలుగుతుంది. 3 నుంచి 18 నెలల వయసున్న దూడల్లో ఎక్కువగా కనబడుతుంది. జ్వరం, దగ్గు, రొప్పడం వంటి లక్షణాలు కనబడతాయి. పక్కపక్కనే ఉన్న పశువులకు సోకుతుంది. పశువైద్యుని సలహా మేరకు యాంటిబయోటిక్స్‌ను వాడాలి.

కంటేజియస్‌ బొవైన్‌ ఫ్లూగో నిమోనియా: చలికాలంలో పశువుల ఊపిరితిత్తులు వాచి, 107 డిగ్రీల ఫారన్‌హీట్‌ వరకు జ్వరం రావడం, కళ్ల వెంబడి పుసులు రావడం, పశువు బాగా చిక్కిపోవడం, కష్టసాధ్యమైన ఊపిరి.. ఇవీ లక్షణాలు. పశువు 1–3 వారాల్లో చనిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితమైన పరిశుభ్రత పాటించాలి. టైలోసిస్‌ లాంటి యాంటిబయోటిక్స్‌ కొంత ఉపయోగకరం.

– డా. ఎం.వి.ఎ.యన్‌. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్‌ – అధిపతి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లైవ్‌స్టాక్‌ ఫామ్‌ కాంప్లెక్స్, కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్, తిరుపతి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement