
కబేళాలకు పశువులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు అనంతయ్య. రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం అల్లిపూర్. అప్పులు చేసి ఈ ఏడాది ఐదెకరాల్లో పత్తి, మొక్కజొన్న వేశాడు. వర్షాల్లేక పంట ఎండిపోయింది. దీంతో పశువులను అమ్ముకునేందుకు సిద్ధపడ్డాడు. ‘‘గట్లపై కూడా గడ్డి లేదు. వరిగడ్డి మోపు ఒక్కటి రూ.100 నుంచి రూ.150 దాక ఉంది. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలె. అందుకే అమ్ముకుంటున్నా..’’ అని ఆయన వాపోయాడు. ఈయనే కాదు చాలాచోట్ల రైతులు పశువులను తెగనమ్ముకుంటున్నారు. రైతులు వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి కబేళాలకు తరలిస్తున్నారు.
నల్లగొండ జిల్లా నుంచి సగటున రోజుకు 1,500 పశువులు, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్, జడ్చర్ల ప్రాంతాల నుంచి నిత్యం వందల కొద్ది పశువులు కబేళాలకు తరలుతున్నాయి. పాలమూరు జిల్లాలో అయితే పశువులకు మేత మాత్రమే కాదు తాగేందుకు నీళ్లూ దొరకడం లేదు. నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ పరిస్థితిని అంచనా వేసిన పశుసంవర్థక శాఖ సబ్సిడీపై గడ్డి విత్తనాలను సరఫరా చేసినా.. నీళ్లు లేక రైతులు ఆసక్తి చూపడంలేదు.