
సాక్షి, యాదాద్రి : జిల్లాలో మూగ జీవాల లెక్క తేలింది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మా టిక్స్ సెంటర్ (ఎన్‌ఐఎస్) చేపట్టిన 20వ జంతు గణన జిల్లాలో పూర్తయింది. యాదాద్రిభువనగిరి జిల్లాలోని 17 మండలాల్లో 2018 సెప్టెంబర్ 1 నుంచి ఈ ఏడాది మే మొదటి తేదీ వరకు ఈగణనపూర్తి చేశారు. గతంలో 2011, 2012లో జంతు గణన చేయగా.. మళ్లీ ఇప్పుడు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గృహాల వద్దకు ఎన్యుమరేటర్లు వెళ్లి ఎన్ని జంతువులు ఉన్నాయనే లెక్కలను తేల్చారు. ఈ గణన ప్రకారం జంతువులకు అవసరమైన వైద్యశాలలు, మందులు, ఇతర వసతులను ఏర్పాటు చేయడానికి కేంద్రం సహకరించనుంది. జిల్లాలో గొర్రెల సంఖ్య పెరిగినప్పటికీ కోళ్ల సంఖ్య తగ్గింది. జిల్లా వ్యాప్తంగా గల ఫౌల్ట్రీ పరిశ్రమ ఇటీవల కాలంలో క్రమంగా తగ్గుతూ రావడమే ఇందుకు కారణం. అలాగే కుందేళ్లు, గాడిదలు, గుర్రాల సంఖ్య తగ్గాయి.
పెరిగిన గొర్రెలు, పశువులు..
జిల్లా వ్యాప్తంగా గొర్రెలు, పశువులు, గేదెలు, మేకలు, కోళ్లు, పందులు, కుక్కలు, సీమకోళ్లు సంఖ్య గణనీయంగా పెరిగింది. మాంసహార ప్రియులైన ప్రజలకు అవసరమైన మేకలు, గొర్రెలు, పందులు, సీమకోళ్ల సంఖ్య పెరిగింది. అలాగే పాల దిగుబడి కోసం గేదెలు, ఆవుల సంఖ్య కూడా పెరిగింది. 2012గణనతో పోల్చితే కోళ్లు, కుందేళ్లు, గాడిదలు, గుర్రాలు మినహా మిగతా జంతువుల సంఖ్య పెరగడం విశేషం. ఔత్సాహికవేత్తల ద్వారా సీమకోళ్లు, టర్కీకోళ్లు, పందుల పెంపకం పెరుగుతూ వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగినప్పటికీ పశువుల సంఖ్య పెద్దగా తగ్గలేదు. 2011లో 98వేలు ఉన్న పశువులు ప్రస్తుతం 1,14,003కు పెరిగాయి. అలాగే పాడిగేదెలు 1.60 లక్షల నుంచి 1,73,181కి పెరగడం విశేషం. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో గొర్రెల సంఖ్య ఈ సంవత్సరం భారీగా పెరిగింది. 2011లో 4,50,000 ఉన్న గొర్రెలు ప్రస్తుతం 7,66,685కు పెరిగాయి. జిల్లాలోని నాన్ ఆయకట్టు ప్రాంతమైన ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లోని వర్షాధార మండలాల్లో ప్రస్తుతం తీవ్ర కరువు నెలకొంది. ఈ ప్రాంతాల్లో పాడిపై జనం పెద్ద ఎత్తున ఆధారపడి జీవిస్తున్నారు. గేదెలు, ఆవుల ద్వారా నిత్యం సుమారు లక్షకు పైగా లీటర్ల పాల ఉత్పత్తి చేయడం ద్వారా జీవనోపాధి కల్పించుకుంటున్నారు. అయితే జిల్లాలో గతంలో చౌటుప్పల్, భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో పెద్ద ఎత్తున ఫౌల్ట్రీ పరిశ్రమ ఉండేది. కరువు పరిస్థితులు, తీవ్రమైన ఎండ, నీటి ఎద్దడి పెరిగిన దాణా రేట్లతో ఫౌల్ట్రీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. యాదగిరిగుట్ట, కొలనుపాక, రాయగిరి ప్రాంతాల్లో గతంలో జట్కాలు (టాంగాలు) అధికంగా ఉండేవి. దీంతో గతంలో 512 గుర్రాలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 381కి తగ్గింది. ఆటోలు రావడం, టాంగాలపై ఎక్కే వారి సంఖ్య తగ్గడం, వాటిపై ఆధారపడ్డ వారు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కోవడం, మరికొందరు ఆ వృత్తిని వదిలేయడం వంటి కారణాలతో గుర్రాల సంఖ్య తగ్గుతోంది. గాడిదల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది.
ఇంటింటికి వెళ్లి లెక్కలు..
జిల్లాలో 2011లో 1,60,272 ఇళ్లలో జంతు గణన చేశారు. ప్రస్తుతం 1,80,263 ఇళ్లలో ఈగణన జరిగింది. ఇందుకోసం 25మంది సూపర్‌వైజర్లు 17 మండలాల్లో 68 మంది ఎన్యుమరేటర్లు ఎనిమిది నెలలుగా జంతుగణన చేశారు. పశుసంవర్ధక శాఖ అధికారుల పర్యవేక్షణలో జరిగిన సర్వే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు.
గణనతో ఇవీ లాభాలు..
జంతు గణన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ధిష్టమైన లెక్క తెలుస్తుంది. ఆయా జంతువులకు కావాల్సిన దాణా, ఎండుగడ్డి, పచ్చిగడ్డి సేకరణతోపాటు జంతువులకు కాలానుగుణంగా వచ్చే జబ్బులకు అవసరమయ్యే మందులు సిద్ధం చేయడానికి ఈ లెక్క దోహదపడుతుంది. అలాగే సంచార, పశువైద్యశాలలు, ప్రస్తుతం ఉన్నవి సరిపోతాయా లేక మరిన్ని పెంచాలా అన్న విషయం తెలుస్తుంది. ప్రజలకు నిత్యం అవసరమయ్యే మాంసం, పాల కోసం ఆయా జంతువుల సంఖ్య ప్రస్తుత లెక్కలకు అనుగుణంగా సరిపోతుందా మరింత పెంచాల్సిన అవసరం ఉందా వంటి విషయాలను శాస్త్రీయంగా పరిశోధించి అవసరమైన చర్యలను తీసుకుంటారు. మొత్తంగా బడ్జెట్‌లో జంతువులకు అవసరమైన బడ్జెట్‌ను కేటాయింపులకు ఈసర్వే ఎంతో ఉపయోగపడుతుంది.
పూర్తయిన జంతు గణన
జిల్లాలో జంతుగణన పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల జంతువుల వివరాలను సేకరించి లైవ్‌స్టాక్ సెన్సెస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాం. వీటి ఆధారంగా ప్రభుత్వాలు నిధుల కేటాయిస్తాయి. గతంలో పోల్చితే కోళ్లు, గాడిదలు, గుర్రాల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్నందున గొర్రెలు, పాడి పశువుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. – మదన్‌కుమార్, జిల్లా పశువైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment