పశువుల లెక్క పక్కాగా | Special number number for every cattle in state | Sakshi
Sakshi News home page

పశువుల లెక్క పక్కాగా

Published Tue, Feb 20 2018 11:01 AM | Last Updated on Tue, Feb 20 2018 11:01 AM

Special number number for every cattle in state - Sakshi

కరీంనగర్‌అగ్రికల్చర్‌: పశువుల లెక్కను పక్కాగా తేల్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సర్వే చేయనున్నారు. ప్రతి పశువుకూ ఓ విశిష్ట నంబర్‌ కేటాయించనున్నారు. పశుగణనకు 105 మంది ఎన్యుమరేటర్లతోపాటు పర్యవేక్షణకు సూపర్‌వైజర్లు, సిబ్బందికి శిక్షణ పూర్తిచేశారు.. కేంద్ర ప్రభుత్వం నుంచి అతి త్వరలో షెడ్యూల్‌ వచ్చే అవకాశముండగా.. అందుకు యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఈనెల చివరి వారంనుంచి రెండునెలల్లో సర్వే పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

ఐదేళ్లకోసారి సర్వే
దేశవ్యాప్తంగా ప్రతి ఐదేళ్లకోసారి పశుగణను చేపడతారు. రాష్ట్రంలో కూడా పశుగణన జరగాల్సి ఉండగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీతో జాప్యం జరిగింది. సర్వేలో పశువులు, గొర్రెలు, మేకలు, కుక్కలు, గాడిదలు, గుర్రాలు, పందులు, కోళ్లు, బాతులు, ఒంటెలతో సహా ప్రతి పెంపుడు జీవి కూడా లెక్కలోకి రానుంది.  2011లో నిర్వహించిన పశుగణన లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా 83,732 తెల్లజాతి పశువులు, 1000801 నల్లజాతి పశువులు, 4.10 లక్షల గొర్రెలు, 83,104 మేకలు, 8,696 పందులు, 4,48,484 నాటు కోళ్లు, 15,20,215 పౌల్ట్రీ కోళ్లు లెక్కలో ఉన్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ కారణంగా ఆవులు, ఎద్దులు, జెర్సీ ఆవుల సంఖ్య తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కుర్మలకు అందిస్తున్న సబ్సిడీ గొర్రెల పథకంతో జిల్లాలో గొర్రెల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.. జిల్లాలో ఇప్పటికే 4606 యూనిట్లు (96,726 గొర్రెలు) పంపిణీ చేశారు. మరో 31 వేల గొర్రెలు పునరుత్పత్తి జరిగినట్లు అధికారులు ఒక అంచనాకు వచ్చారు. పందులు, మేకలు, పౌల్ట్రీ పరంగా కోళ్ల సంఖ్య కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

ఆన్‌లైన్‌లో గణన..
2017లో జరగాల్సిన పశుగణన ఈ యేడాది ఆలస్యంగా చేపట్టబోతున్నారు. జిల్లాలోని గోపాల మిత్ర, పశుమిత్రతో పాటు నిరుద్యోగులను కలుపుకుని 105 మంది ఎన్యుమరేటర్లను ఎంపిక చేశారు. వీరికి ట్యాబ్‌లెట్లు అందిస్తున్నారు.. పర్యవేక్షణకు మరో 30 మంది శాఖ అధికారులు, సిబ్బందిని సూపర్‌వైజర్లుగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. సర్వే సమయంలో వివిధ సమస్యల పరిష్కారానికి ’ ఈ కేంద్రం’ ద్వారా పర్యవేక్షణకు ఒక నోడల్‌ అధికారితో పాటు ఇద్దరు పారా సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. 2 నెలల పాటు     ఇంటింటి సర్వే నిర్వహించి లెక్క తేల్చనున్నారు. గతంలో జరిగిన పశుగణన మ్యానువల్‌గా కాగితాలపై రాయగా.. ఈసారి ఒక విశిష్ట గుర్తింపు నంబర్‌ను కేటాయిస్తూ వివరాలు నమోదు చేస్తారు.

జంతు రక్షణకు చర్యలు.
పశుగణనలో భాగంగా పశువులతోపాటు యజమానులు, వారి ఆదాయం, విద్యార్హతలు, కోళ్ల ఫారాల సంఖ్యనూ ఆరాతీసి లెక్కించనున్నారు. ఇందులో పశువులు, గొర్రెలు, మేకలు, కుక్కలు, గాడిదలు, గుర్రాలు, పందులు, కోళ్లు, బాతులు, ఒంటెలతో పాటు ప్రతి పెంపుడు జీవుల లెక్క కంప్యూటర్‌లో నిక్షిప్తం కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో పశువుల అభివృద్ధికి కచ్చితమైన కేటాయింపులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సకల జనుల సర్వే, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, సకల నేరస్తుల సర్వే, మత్య్సకారుల సర్వేలతో దేశంలోనే సాంకేతికతను ఉపయోగించిన ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు పొందింది.. పశుగణనతో ప్రభుత్వం జంతు సంరక్షణకు అవసరమైన నిధుల కేటాయింపు, వైద్య సదుపాయాలకు కావాల్సిన సామగ్రి కొనుగోలు, వాటి సంతాన ఉత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టేందుకు ఈ గణన కీలకం కానుంది.

పశుగణనకు సిద్ధం
పశుగణనకు సర్వం సిద్ధం చేశాం. కేంద్ర ప్రభుత్వం నుంచి షెడ్యూల్‌ రాగానే గణన చేపడుతాం. అందుకు ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల ఎంపికతోపాటు శిక్షణ కూడా పూర్తి చేశాం.  ప్రభుత్వం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విశిష్ట గుర్తింపు సంఖ్యతో పాటు పశువుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేసి గణన చేయాలనే ఆలోచనతో కొంత జాప్యం జరిగింది. గణన ద్వారా పూర్తిస్థాయి సమాచారం సేకరించడంతో నిధుల కేటాయింపు, వాటి పరిరక్షణ సులభతరం కానుంది.-ఎన్‌.విక్రమ్‌కుమార్,జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement