కాకినాడ జిల్లా, కరప మండలం జెడ్. భావారం గ్రామంలో పుంగనూరు జాతి గిత్త దూడ 16 అంగుళాల ఎత్తుతో జన్మించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది మరీ పొట్టిగా ఉండటంతో గ్రామంలోని రైతులు వింతగా చూస్తున్నారు. పుంగనూరు ఆవు బుధవారం ఉదయం ఈ దూడకు జన్మనిచ్చిందని ఆ గ్రామానికి చెందిన రైతు కంచెర్ల నాగేశ్వరరావు తెలిపారు. ఈ దూడ 16 అంగుళాల ఎత్తు, 36 అంగుళాల పొడవు, 4 కిలోల బరువు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
– కరప
రైతులకు ‘జల’గండం
వరుసగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామ రైతులకు కష్టాలు తప్పడం లేదు. వీరి పంట భూములు బాహుదానదికి అవతల ఉండటంతో ఏటా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు బాహుదా గెడ్డలోకి నీరు చేరడంతో కోత కోసిన ధాన్యం ఓవులను ఇంటికి తెచ్చేందుకు రైతులు పీకల్లోతు నీటిలోకి దిగాల్సి వచ్చింది. ప్రభుత్వం మినీ వంతెన నిర్మిస్తేనే ‘జలగండం’ తప్పుతుందని అన్నదాతలు చెబుతున్నారు.
– ఇచ్ఛాపురం రూరల్
‘మా రోడ్డు చూడండి..’
తమ రోడ్డు దుస్థితిని చూడాలంటూ విజయనగరం జిల్లా వంగర మండలం భాగెంపేట యువకులు రోడ్డుకోసం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అరసాడ జంక్షన్ నుంచి భాగెంపేట వరకు అధ్వానంగా ఉన్న రోడ్డును డ్రోన్ కెమెరాలో బుధవారం చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
నీలయ్యవలస, భాగెంపేట, పటువర్ధనం, శ్రీహరిపురం, దేవకివాడ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ గ్రామాలకు ఈ గోతులమయమైన రోడ్డే గతని, అధికారులు సమస్యపై స్పందించి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో బస్సు సర్వీసును నిలిపివేశారని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించకుంటే నిరసన తెలుపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
– వంగర
చదవండి: బంతీ.. చామంతీ.. ముద్దాడుకున్నాయిలే..!
Comments
Please login to add a commentAdd a comment