‘పుంగనూరు’ మురి‘పాలు’!
- ప్రాణానికి ప్రాణంగా పుంగనూరు ఆవులను సాకుతున్న గో సంరక్షకుడు
- 8 ఏళ్లుగా పుంగనూరు గోవులతో పెనవేసుకున్న జీవనశైలి
- హైదరాబాద్ నగరంలో ఇంటివద్దనే సంరక్షిస్తున్న విజయ డెయిరీ ఉన్నతాధికారి
- పుంగనూరు బ్రీడ్ సేవియర్ అవార్డుకు ఎంపికైన కుడాల రామదాసు
పరిరక్షించుకోకపోతే ఎంతటి అపురూపమైన పశు జాతైనా కాలగర్భంలో కలిసిపోతుంది. అత్యంత పొట్టిగా ఉండి, తక్కువ మేత – నీటితో, ప్రతికూల వాతావరణంలోనూ మనుగడ సాగించడం, ఔషధ విలువలున్న చిక్కటి పాలను అందించే అరుదైన గోజాతి ‘పుంగనూరు’. చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతాల్లో తరతరాలుగా విరాజిల్లుతున్న ఈ పశుజాతి సంతతి కొన్ని వందలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పూర్వరంగంలో హైదరాబాద్ వంటి మహానగరంలో పుంగనూరు ఆవుల సంరక్షణే ప్రాణప్రదంగా భావిస్తున్నమనసున్న మనిషి రామదాసు. తాను రైతు కాకున్నా.. ప్రభుత్వాలు మిన్నకున్నా పుంగనూరు గో జాతి ఉద్ధరణకు నడుం బిగించారు. ఆయన ఇంటి ప్రాంగణంలో మువ్వలు తొడిగిన కాⶠ్లతో పరుగెత్తే ఆవు దూడలు.. ఘల్లు ఘల్లుమని సవ్వడులు చేస్తూ.. మంగళవాద్యాలు మోగించిన అనుభూతినిస్తాయి. పుంగనూరు గోజాతికి పునర్జన్మనిస్తున్న రామదాసుకు జాతీయ స్థాయి బ్రీడ్ సేవియర్ అవార్డు దక్కడం విశేషం. మే 21–22 తేదీల్లో హర్యానాలోని కర్నాల్‌లో ఈ జాతీయ అవార్డును ఆయన అందుకోనున్నారు.. ఈ సందర్భంగా ‘సాగుబడి’ పాఠకుల కోసం ప్రత్యేక కథనం.
ఆనాడు భద్రాద్రి రాముడికి గుడికట్టి గుండెల్లో దాచుకున్న గోపన్న రామదాసుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఆయన పేరు పెట్టుకున్న ఈ రామదాసు అంతరించిపోయే దశలో ఉన్న పుంగనూరు గోవులకు తన ఇంటిలోనే గుడికట్టి కాచుకుంటూ గోదాసుగా నిలిచిపోతున్నారు కుడాల రామదాసు.
డాక్టర్ వైఎస్సార్ కడప జిల్లా బ్రాహ్మణవీధి ఆయన స్వగ్రామం. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఉప్పల్‌లోని స్వరూప్‌నగర్ పద్మావతి కాలనీలో నివసిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఆం. ప్ర. డైరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఒకవైపు ఉద్యోగ, కుటుంబ విధులను చక్కబెట్టుకుంటూనే గోవుల సంరక్షణకు సమయం కేటాయిస్తున్నారు.
2009లో చిత్తూరు జిల్లా పలమనేరులోని పశు పరిశోధనా స్థానం నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం పుంగనూరు ఆవుల సంఖ్య 8కి, గిత్తల సంఖ్య 7కు పెరిగింది. ఆవులకు శాంభవి, హరిప్రియ, జ్ఞాన ప్రసూనాంబ, బృంద, మహాలక్ష్మి అని.. గిత్తలకు దీపక్, మహాకాళ్, శ్రీపాద్, నారాయణ, సుబ్రహ్మణ్యం అని పేర్లు పెట్టుకున్నారాయన. రామదాసు పేరుతో పిలిస్తే చాలు.. ఆ పేరు గల ఆవు లేదా ఎద్దుlమేతను సైతం వదలి పిలుపు వచ్చిన దిశగా తలెత్తి, చెవులు రిక్కిస్తుంది. ఆయన కనిపించగానే చుట్టూ చేరి ఆపాద మస్తకం నాలుకతో స్పర్శిస్తూ గారాలు పోతాయి. ఆయన వెన్ను నిమురుతుంటే చిన్నపిల్లల్లా మారాం చేస్తాయి. చిన్న దూడలు ఆయన కౌగిట్లో దూరి కేరింతలు కొడతాయి. ఇంక ఆయన సెలవు రోజైన ఆదివారం అయితే వాటికి పండగ రోజు. ఆరోజు రామదాసు వాటì కి శుభ్రంగా స్నానం చేపిస్తారు. వాటిని కాన్వెంటుకు వెళ్లే పిల్లల్లా ముస్తాబు చేసి మురిసిపోతారు.
గోస్నానానికి వేసవిలో చన్నీళ్లను చలికాలంలో వేన్నీళ్లను వాడతారు. దీనికోసం ఇంటిపైన నీటిని వేడిచేసే సౌరశక్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇంటికి ఆనుకునే ఉన్న ఖాళీస్థలంలో పగలు ఆవులను ఉంచుతారు. రక్షణ కోసం ఇనుప మెష్‌ను ఏర్పాటు చేశారు. అందులోనే మేతను అందిస్తారు. రాత్రిళ్లు మాత్రం వారి ఇంటి వర ండానే ఆవులకు శయనాగారం. అవి విశ్రమించేటప్పుడు మెత్తగా ఉండేందుకు రబ్బరు షీట్లు ఏర్పాటు చేశారు. రాత్రిళ్లు నిద్రాభంగం కలగకుండా నివారించేందుకు దోమతెరలు ఏర్పాటు చేశారు. వేసవి తాపం నుంచి కాపాడేందుకు ఫ్యాన్‌లు, కూలర్లు, వట్టివేళ్ల చాపలు ఏర్పాటు చేశారు. స్థానిక పశువైద్యులు వారం వారం వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
పుంగనూరు ఆవుల మధ్య ఇన్ బ్రీడింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే.. తమకు జన్మనిచ్చిన ఆవుతో కోడె గిత్తల సంపర్కాన్ని నిరోధించడానికి చర్యలు తీసుకుంటారు. దూడలు పుట్టిన తేదీలు, బరువు, సమయం, తల్లి ఆవు, ఆబోతుకు సంబంధించిన అన్ని వివరాలూ (పిడిగ్రీ) నమోదు చేస్తారు.
జీవితం గో సేవకే అంకితం
ఉదయం ఆరు గంటలకు మేత అందిస్తారు. రోజూ 20 కిలోల దాణా పెడతారు. ఉలవలు, కందులు, పెసర, మినుములు, మొక్కజొన్న, కొబ్బరి పిండిని దాణాగా పెడతారు. జొన్న చొప్ప, వరిగడ్డిని మేతగా ఇస్తారు. ప్రతి రోజూ సాయంత్రం ఆవులను షికారుకు తోలుకెళతారు. పశువుల సంఖ్య పెరగటంతో ఒక్కడి వల్ల కాక ఇటీవలె ఒక పనివాడిని నియమించుకున్నారు. అతను రాకుంటే రామదాసే స్వయంగా రంగంలోకి దిగుతారు. సూర్యోదయానికి ముందే పాకను శుభ్రం చేసి కసువు ఎత్తిపోస్తారు. పాలు పితుకుతారు. మేతవేస్తారు. తాను సంతృప్తి చెందాక ఉద్యోగానికి బయలుదేరతారు. మళ్లీ సాయంత్రం యథాప్రకారం సేవ చేసుకుంటారు. ఆవున్న చోటే అన్నముంది..అందుకే మొదటి ముద్ద ఆవుకే చెందాలంటారాయన. వీటిని వదలి వెళ్లినా మనసంతా వీటిపైనే ఉంటున్నందున ప్రయాణాలను తగ్గించుకున్నారు.
వీటిని సాకేందుకు అయ్యే ఖర్చు నెలకు రూ. 60 వేలను రామదాసు తన జీతం డబ్బులోంచే ఖర్చు చేస్తున్నారు. వ్యవసాయానికి ఉపయోగపడే దేశవాళీ గో జాతిని పరిరక్షించాలనే నా ప్రయత్నంలో నాకు ఆత్మసంతృప్తి లభిస్తోంది. ఒక మంచి పనిని చేస్తున్నాననే భావన నాకు కొత్త శక్తిని ఇస్తోంది అంటారాయన. పుంగనూరు ఆవుపాలలో ఔషధీయ గుణాలు ఉండటం వల్ల తల్లిపాలు లేని పిల్లలకు పుంగనూరు ఆవుల పాలను ఉచితంగా ఇస్తున్నారు రామదాసు. ఆవుపేడతో నడిచే బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీనితోనే వంట అవసరాలు పూర్తిగా తీరుతున్నాయి. అంతరించిపోతున్న పుంగనూరు గోజాతి పరిరక్షణకు పాటుపడుతున్న రామదాసుకు జేజేలు!
– దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ ఫొటోలు : వర్థెల్లి రవీంద్ర, సాక్షి ఫొటో జర్నలిస్టు
ప్రతి ఇంట్లోనూ పుంగనూరు ఆవుండాలి!
గ్రామాల్లో రైతులే కాదు, నగరాలు, పట్టణవాసులు కూడా కొంచెం ఖాళీ ఉన్న ప్రతి ఇంటి ఆవరణలోనూ పుంగనూరు ఆవును పెంచుకోవాలి. దీనివల్ల పంటలకు, ఇంటిపంటలకు అవసరమైన ఎరువు లభిస్తుంది. కలుషితం కాని, ఔషధ విలువలున్న పాలు తాగొచ్చు. కారు ఇంటి బయట ఆవు లోపటా అనే సంస్కృతి రావాలి. ఆవున్న చోట ఆరోగ్యం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. గోమాతను చూడాలని చాలామంది మా ఇంటికి వస్తున్నారు. వీళ్లని చూసినప్పుడు వసుదైక కుటుంబమనే భావన నాకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. గోశాలలకు ధన రూపంలో సహాయం చేయవద్దు. మేత కొని వేయండి. గోవులకు సేవ చేయండి. ప్రతి కుటుంబం ఒక ఆవునయినా రక్షిస్తే అది సమాజాన్ని రక్షిస్తుంది.
– కుడాల రామదాసు స్వరూప్‌నగర్, ఉప్పల్, హైదరాబాద్ ramdas.kudala@gmail.com
పుంగనూరు ఆవు పాలకు అధిక ధర
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రం పుంగనూరు. పొట్టి జాతి ఆవులకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఒంగోలు జాతి ఆవులకు మల్లే ‘పుంగనూరు’ కూడా దేశం గర్వించదగ్గ గోజాతి. ఇవి అంతరించి పోయే దశలో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపొట్టి జాతి ఆవులివి. 70–90 సెం.మీ ఎత్తు ఉంటాయి. 115–200 కిలోల బరువుంటాయి. లేత బూడిద, తెలుపు రంగులో ఉంటాయి. విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు ఉంటాయి. వీటి తోకలు నేలను తాకీ తాకనట్టు ఉంటాయి. కరువు పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవటం వల్ల గతంలో పేదవాడి ఆవులుగా పేరుపొందాయి. అచ్చం ఎండు గడ్డితిని మనుగడ సా«గించగలవు.
రోజుకు 3–8 లీటర్ల పాలు ఇస్తాయి. సాధారణంగా ఆవుపాలలో ఔషధ విలువలతో పాటు 3 నుంచి 3.5 వరకు వెన్న శాతం ఉంటుంది. అదే పుంగనూరు ఆవు పాలలో 8 శాతం ఉంటుంది. ఎస్‌ఎన్‌ఎఫ్ (సాలిడ్స్ నాట్ ఫ్యాట్) 9 శాతం ఉంటుంది. దీనివల్ల పాలకు అధిక ధర లభిస్తుంది. ఆధ్యాత్మికంగానూ పుంగనూరు ఆవులకు విశేష ప్రాధాన్యం ఉంది. పుంగనూరు ఆవును అత్యంత పవిత్రంగా భావిస్తారు. మోపురం ఉన్న దేశీ ఆవులేవైనా విశ్వశక్తిని (కాస్మిక్ ఎనర్జీని) గ్రహించి చుట్టూ ఉన్న వాతావరణంలోకి విడుదల చేస్తాయని నమ్ముతారు. దీనివల్ల పుంగనూరు ఆవు ఉన్న పరసరాల్లో దైవిక వాతావరణం నెలకొంటుందని రామదాసు విశ్వసిస్తారు.