వారివి దిగజారుడు రాజకీయాలు
కాంగ్రెస్, టీడీపీలపై మంత్రి ఈటల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలు ఆదరణ కోల్పోయి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. వ్యవసాయమే దండుగ అని, ఏడు గంటల విద్యుత్ అడిగితే రైతుల రక్తం కళ్ల చూసిన పార్టీ టీడీపీ అని విమర్శించారు. రైతుల పేర సాగునీటి ప్రాజెక్టుల్లో కోట్లు దోచుకున్న పార్టీ కాంగ్రెస్ అని, పదేళ్ల పాలనలో కనీసం 5 లక్షల ఎకరాలకు నీరివ్వని మూర్ఖపు పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు.
2005 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో మిడ్‌మానేరు కోసం రూ. 836 కోట్లు ఖర్చు పెడితే రెండేళ్లలో తమ ప్రభుత్వం రూ. 675 కోట్లు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులన్నీ పూర్తయితే కాళ్ల కింద భూమి కదులుతుందనే భయంతో కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కాకతీయ కాల్వకు 3,500 క్యూసెక్కుల కంటే ఎక్కువ నీటిని అందించినట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని చెప్పారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రూ. 139 కోట్లతో కాకతీయ కాల్వలను ఆధునీకరించామని తెలిపారు. ఈ గడ్డ మీద ఉండి చంద్రబాబు జపం చేస్తున్న దుర్మార్గులకు శిక్ష తప్పదని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఈటల హెచ్చరించారు. సిరిసిల్లలో భూములు కొనుగోలు చేసిన వారే కృత్రిమ ఉద్యమం చేయిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.