Minister Etela Rajinder
-
వారివి దిగజారుడు రాజకీయాలు
కాంగ్రెస్, టీడీపీలపై మంత్రి ఈటల ధ్వజం సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలు ఆదరణ కోల్పోయి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. వ్యవసాయమే దండుగ అని, ఏడు గంటల విద్యుత్ అడిగితే రైతుల రక్తం కళ్ల చూసిన పార్టీ టీడీపీ అని విమర్శించారు. రైతుల పేర సాగునీటి ప్రాజెక్టుల్లో కోట్లు దోచుకున్న పార్టీ కాంగ్రెస్ అని, పదేళ్ల పాలనలో కనీసం 5 లక్షల ఎకరాలకు నీరివ్వని మూర్ఖపు పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. 2005 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో మిడ్‌మానేరు కోసం రూ. 836 కోట్లు ఖర్చు పెడితే రెండేళ్లలో తమ ప్రభుత్వం రూ. 675 కోట్లు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులన్నీ పూర్తయితే కాళ్ల కింద భూమి కదులుతుందనే భయంతో కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కాకతీయ కాల్వకు 3,500 క్యూసెక్కుల కంటే ఎక్కువ నీటిని అందించినట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రూ. 139 కోట్లతో కాకతీయ కాల్వలను ఆధునీకరించామని తెలిపారు. ఈ గడ్డ మీద ఉండి చంద్రబాబు జపం చేస్తున్న దుర్మార్గులకు శిక్ష తప్పదని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఈటల హెచ్చరించారు. సిరిసిల్లలో భూములు కొనుగోలు చేసిన వారే కృత్రిమ ఉద్యమం చేయిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. -
ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి
మంత్రి ఈటలకు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోరింది. శనివారం సచివాల యంలో సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, తెలంగాణ శాఖ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మంత్రిని కలసి పలు అంశాలపై చర్చించారు. 2015-16 సంవత్సరం వరకు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 3,100 కోట్లకు గానూ, రూ.900 కోట్లనే విడుదల చేశారని కృష్ణయ్య తెలిపారు. బీసీ కార్పొరేషన్, 11 బీసీ కులాల ఫెడరేషన్ల ద్వారా రుణాల కోసం 39వేల మంది ఎంపికైనప్పటికీ, ప్రభుత్వం పైసా విడుదల చేయలేదన్నారు. రాష్ట్రంలో 500 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు గానూ, 50 మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని, కానీ ఒక్కటీ మంజూరు కాలేదని అన్నారు. దీనిపై మంత్రి ఈటల స్పందిస్తూ బీసీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, రుణాలకు నిధుల విడుదలకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. రైతుల రుణమాఫీ కింద ఈ విడత 2 వేల కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పా రు. కార్యక్రమంలో బీసీ నాయకులు బోర సుభాష్, శ్రీనివాస్, గూడూరు భాస్కర్ పాల్గొన్నారు. -
ప్రగతికాముక బడ్జెట్
♦ ఆర్థిక మంత్రి ఈటలకు సీఎం కేసీఆర్ అభినందన ♦ అన్ని రంగాలకూ సముచిత ప్రాధాన్యం ♦ సమతుల్యం పాటించారని కితాబు సాక్షి, హైదరాబాద్: ‘‘ఇది ప్రగతికాముక బడ్జెట్. అన్ని రంగాలకూ సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ నిధులు కేటాయించారు. సమతుల్యం పాటిం చారు...’’ అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాక ఈటల అసెంబ్లీలోని సీఎం చాంబర్లో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ వ్యవసాయానికి ఉపయోగపడే నీటిపారుదల, సంక్షేమ రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించడం సముచిత నిర్ణయమని పేర్కొన్నారు. సమైక్య పాలనలో ప్రణాళిక పద్దుల కింద తెలంగాణకు కేవలం రూ. 9 వేల కోట్లే దక్కేవని, ఈసారి ప్రణాళిక పద్దుల కింద దాదాపు రూ. 90 వేల కోట్లు ఖర్చు చేయనుండటం సంతోషకరమన్నారు. ప్రణాళికేతర వ్యయంకన్నా, ప్రణాళిక వ్యయాన్ని ఎక్కువగా చూపడం వల్ల ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యమవుతుందన్నారు. బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకున్న ఆర్థిక సలహాదారు జి.ఆర్.రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యద ర్శి రామకృష్ణారావు, కార్యదర్శి నవీన్ మిట్టల్, ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య తదితర అధికారులను కూడా సీఎం అభినందించారు. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు అసెంబ్లీలో కేసీఆర్‌ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఈటల కలసి బడ్జెట్ పత్రాలు అందజేశారు. బడ్జెట్లో వరంగల్ కార్పొరేషన్‌కు రూ. 300 కోట్లు కేటాయించడంతోపాటు వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించినందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు. -
నిత్యావసరాల పంపిణీలో పారదర్శకత
జాయింట్ కలెక్టర్లకు మంత్రి ఈటల రాజేందర్ దిశానిర్దేశం ధాన్యం సేకరణ, ఆహార భద్రతా కార్డుల జారీపై సమీక్ష హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సరఫరా చేసే నిత్యావసర సరుకుల పంపిణీ పక్కదారి పట్టకుండా అత్యంత పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల నుంచి ఆహార భద్రతా కార్డుల జారీ ప్రక్రియ మొదలు కానున్నందున అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జాయింట్ కలెక్టర్లతో పౌర సరఫరాలశాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణ, కార్డుల జారీ, అక్రమాల నివారణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారులకు సరైన రీతిలో సరుకులు చేరేలా ఈ-పాస్, రవాణా సక్రమంగా జరిగేలా జీపీఎస్ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైతే సన్నబియ్యం కోటాను పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ పథకాన్ని అంగన్వాడీలకు కూడా విస్తరిస్తామని చెప్పారు. అక్రమాలకు పాల్పడితే జైలుకే: ఈటల జాయింట్ కలెక్టర్లతో సమావేశం అనంతరం ఈటల విలేకరులతో మాట్లాడుతూ ‘నిత్యావసరాల పంపిణీ పారదర్శకంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. జీపీఎస్, ఈ-పాస్ వ్యవస్థను తెచ్చి అక్రమాలను అరికట్టే చర్యలు చేపడుతున్నాం. లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం, చక్కెర సహా ఇతర సరుకుల్లో చిన్నపాటి తేడా వచ్చినా ఉపేక్షించేది లేదు. డీలర్లు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి నేరుగా జైలుకే పంపుతాం’ అని హెచ్చరించారు. రేషన్ డీలర్లకు కమీషన్ పెంచే విషయమై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఫ్యాప్సీ భవన్లో తెలంగాణ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశానికి హాజరైన ఈటల మిల్లర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. బ్యాంకు రుణాల చెల్లింపులో మిల్లర్లకు వెసులుబాటు కోసం త్వరలోనే బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో ఏ రంగాన్నీ కన్నీళ్లు పెట్టనివ్వమని చెప్పిన ఈటల...మిల్లర్లు రీసైక్లింగ్ దందాలకు పాల్పడరాదని సూచించారు. ఈ సమావేశంలో మిల్లర్ల సంఘం దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు దేవెందర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గన్ప నాగేంద్ర, ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
మంత్రి ఈటెలకు జన్మదిన శుభాకాంక్షలు
అబిడ్స్: తెలంగాణ రాష్ర్ట ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోషామహాల్ నియోజకవర్గ టీఆర్ఎస్వీ ఇన్చార్జి ముఖేష్ ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు సురేష్‌ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆయనకు పూలబొకే అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి తో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో నాయకులు అభిలాష్ ముదిరాజ్, అశోక్, శిరీష్, కె.సాయికుమార్ పాల్గొన్నారు. -
చెరువు నిండాలి.. పంట పండాలి
కరీంనగర్‌రూరల్/తిమ్మాపూర్ : వ్యవసాయూభివృద్ధికి చెరువులే ఆధారమని, చెరువులు జలకళతో నిండినిప్పుడే బంగారు పంటలు పండుతాయని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలో 900 చెరువులను రూ.2వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఆదివారం ఆయన కరీంనగర్ మండలం బొమ్మకల్, తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామాల్లో చెరువుల్లో పూడికతీత పనులను జెడ్పీ చైర్‌పర్సర్ తుల ఉమ, కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమరుు బాలకిషన్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చెరువుల్లో పూడిక పేరుకపోయిందన్నారు. మిషన్ కాకతీయ కింద పూడిక తొలగింపుతో చెరువులన్నీ జలకళను సంతరించుకుంటాయని చెప్పారు. రైతులు స్వచ్చందంగా మట్టిని తీసుకెళ్లి పొలాల్లో పోసుకుంటే భూసారం పెరిగి పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. గతంలో ప్రాజెక్టులు, బోర్లు, బావులు లేవని, చెరువుల కిందనే వ్యవసాయం సాగేదన్నారు. మూడేళ్లలో చెరువులన్నింటిని పునరుద్ధరించడం జరుగుతుందన్నారు. వచ్చే ఏడాది వేసవి నుంచి కరెంటు కోతలు ఉండవని, వ్యవసాయూనికి పగటిపూటనే తొమ్మిది గంటల కరెంటు ఇస్తామని తెలిపారు. ఆసరా పింఛన్లు, ఆహారభద్రత కార్డులు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పింఛన్లు, కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని, అర్హతలుంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ... గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాజకీయ విభేదాలు విడిచిపెట్టి గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మట్టిని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మిషన్ కాకతీయ ఎస్ఈ సురేష్‌కుమార్, కరీంనగర్, తిమ్మాపూర్ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.