నిత్యావసరాల పంపిణీలో పారదర్శకత
జాయింట్ కలెక్టర్లకు మంత్రి ఈటల రాజేందర్ దిశానిర్దేశం
ధాన్యం సేకరణ, ఆహార భద్రతా కార్డుల జారీపై సమీక్ష
హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సరఫరా చేసే నిత్యావసర సరుకుల పంపిణీ పక్కదారి పట్టకుండా అత్యంత పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల నుంచి ఆహార భద్రతా కార్డుల జారీ ప్రక్రియ మొదలు కానున్నందున అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జాయింట్ కలెక్టర్లతో పౌర సరఫరాలశాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణ, కార్డుల జారీ, అక్రమాల నివారణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
లబ్ధిదారులకు సరైన రీతిలో సరుకులు చేరేలా ఈ-పాస్, రవాణా సక్రమంగా జరిగేలా జీపీఎస్ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైతే సన్నబియ్యం కోటాను పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ పథకాన్ని అంగన్‌వాడీలకు కూడా విస్తరిస్తామని చెప్పారు.
అక్రమాలకు పాల్పడితే జైలుకే: ఈటల
జాయింట్ కలెక్టర్లతో సమావేశం అనంతరం ఈటల విలేకరులతో మాట్లాడుతూ ‘నిత్యావసరాల పంపిణీ పారదర్శకంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. జీపీఎస్, ఈ-పాస్ వ్యవస్థను తెచ్చి అక్రమాలను అరికట్టే చర్యలు చేపడుతున్నాం. లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం, చక్కెర సహా ఇతర సరుకుల్లో చిన్నపాటి తేడా వచ్చినా ఉపేక్షించేది లేదు. డీలర్లు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి నేరుగా జైలుకే పంపుతాం’ అని హెచ్చరించారు. రేషన్ డీలర్లకు కమీషన్ పెంచే విషయమై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం ఫ్యాప్సీ భవన్‌లో తెలంగాణ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశానికి హాజరైన ఈటల మిల్లర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. బ్యాంకు రుణాల చెల్లింపులో మిల్లర్లకు వెసులుబాటు కోసం త్వరలోనే బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో ఏ రంగాన్నీ కన్నీళ్లు పెట్టనివ్వమని చెప్పిన ఈటల...మిల్లర్లు రీసైక్లింగ్ దందాలకు పాల్పడరాదని సూచించారు. ఈ సమావేశంలో మిల్లర్ల సంఘం దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు దేవెందర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గన్ప నాగేంద్ర, ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.