ప్రగతికాముక బడ్జెట్
♦ ఆర్థిక మంత్రి ఈటలకు సీఎం కేసీఆర్ అభినందన
♦ అన్ని రంగాలకూ సముచిత ప్రాధాన్యం
♦ సమతుల్యం పాటించారని కితాబు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇది ప్రగతికాముక బడ్జెట్. అన్ని రంగాలకూ సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ నిధులు కేటాయించారు. సమతుల్యం పాటిం చారు...’’ అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాక ఈటల అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ వ్యవసాయానికి ఉపయోగపడే నీటిపారుదల, సంక్షేమ రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించడం సముచిత నిర్ణయమని పేర్కొన్నారు. సమైక్య పాలనలో ప్రణాళిక పద్దుల కింద తెలంగాణకు కేవలం రూ. 9 వేల కోట్లే దక్కేవని, ఈసారి ప్రణాళిక పద్దుల కింద దాదాపు రూ. 90 వేల కోట్లు ఖర్చు చేయనుండటం సంతోషకరమన్నారు.
ప్రణాళికేతర వ్యయంకన్నా, ప్రణాళిక వ్యయాన్ని ఎక్కువగా చూపడం వల్ల ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యమవుతుందన్నారు. బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకున్న ఆర్థిక సలహాదారు జి.ఆర్.రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యద ర్శి రామకృష్ణారావు, కార్యదర్శి నవీన్ మిట్టల్, ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య తదితర అధికారులను కూడా సీఎం అభినందించారు. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు అసెంబ్లీలో కేసీఆర్‌ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఈటల కలసి బడ్జెట్ పత్రాలు అందజేశారు. బడ్జెట్‌లో వరంగల్ కార్పొరేషన్‌కు రూ. 300 కోట్లు కేటాయించడంతోపాటు వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించినందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు.