మనం అదృష్టవంతులం
అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచాం: కేసీఆర్
- మహారాష్ట్ర, గుజరాత్ కన్నా అధిక వృద్ధి రేటు సాధించాం
- మనకు ఆదాయం బాగుంది.. బ్రహ్మాండంగా ముందుకు పోవచ్చు
- ఉమ్మడి ఏపీ బడ్జెట్ 1,23,000 కోట్లు.. ఇప్పుడు మనది 1,49,600 కోట్లు
- నాయీ బ్రాహ్మణులకు ఉచితంగా 30 వేల సెలూన్లు మంజూరు చేస్తాం
- రెండేళ్లలో యాదవుల వద్ద రూ.20 వేల కోట్ల సంపద ఉంటుంది
- మత్స్య పరిశ్రమ కోసం త్వరలో చట్టం తెస్తాం
- బోయలను ఎస్టీలో చేరుస్తాం.. ఎమ్మెల్సీలుగా చేస్తాం..
- మే నుంచే కొత్త పథకాలను అమలు చేస్తాం
- సీఎంను కలసిన బీసీ కులాల ప్రతినిధులు.. బడ్జెట్‌పై హర్షం
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ఉద్యమంలో ఏదైతే వాదించినమో అది నూటికి నూరుశాతం కరెక్ట్ అని తేలింది. దేశంలోనే మనం అభివృద్ధిలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచాం. మహారాష్ట్ర, గుజరాత్ కన్నా 21 శాతం అధిక వృద్ధిరేటు సాధించాం. ఆదాయం కూడా ఉంది. ఈటల రూ.1,49,600 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది 2013–14లో మొత్తం 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కంటే ఎక్కువ. 23 జిల్లాల ఏపీ బడ్జెట్ రూ.1,23,000 కోట్లే. దీన్నిబట్టి మనం ఎంత అదృష్టవంతులమో అర్థం అవుతోంది..’’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘‘మనకు ఆదాయం బాగుంది.. మునుపటిలా ఉండాల్సిన పనిలేదు.. పైకి రావాలి.. బ్రహ్మాండంగా ముందుకు పోవచ్చు.. ఐదారు నెలల నుంచి మంత్రులతో ఇవే అంశాలపై చర్చించా..’’అని చెప్పారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ వివిధ బీసీ కులాల ప్రతినిధులు మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘‘ఉమ్మడి ఏపీలో కుల వృత్తులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. అన్ని వర్గాలతోనూ చర్చిస్తాం. బోయలను ఎస్టీలలో చేరుస్తాం. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీలుగా చేస్తాం. ఎంబీసీలకు బ్యాంక్ టై అప్ పెట్టకుండా వంద శాతం సబ్సిడీపై రుణాలు ఇస్తాం. మే నెల నుంచి పథకాలు మొదలు కావాలె. 99 శాతం వృత్తులు బీసీ వర్గం వద్దే ఉన్నయి. నాయీ బ్రాహ్మణులకు లక్ష రూపాయలతో సెలూన్ పెట్టిస్తాం. ఇలా తెలంగాణలో 30 వేల సెలూన్లు ఉచితంగా మంజూరు చేస్తాం. ప్రతి గ్రామంలో బ్రహ్మాండమైన మోడ్రన్ సెలూన్ రావాలె. ఎంబీసీల కోసం రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టినం. ఎంబీసీ కార్పొరేషన్‌కు ఎంబీసీనే చైర్మన్‌గా చేస్తాం. ఎంబీసీలో 70, 80దాకా కులాలున్నయి. ప్రగతి భవన్‌కు ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి మిమ్ముల్ని పిలుచుకుంటా..’’అని అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు రూ.1200 కోట్లు, బ్రాహ్మణులను ఆదుకునేందుకు రూ.100 కోట్లు కేటాయించామని చెప్పారు.
కుల వృత్తులు శాశ్వతం కాదు...
‘‘సమాజ వృద్ధి క్రమంలో కొన్ని వృత్తులు అంతరించిపోతాయి. మార్పుకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నæ ప్రజలను తీర్చిదిద్దుకోవాలి. తెలంగాణలో ప్రతి కులం, ప్రతి మనిషి చిరునవ్వుతో సగర్వంగా కాలరెగరేయాలె. ఉన్న వనరులు, వసతులతో మనకు మిగులుబాటు రావాలి. మన దగ్గర భగవంతుడు ఇచ్చిన విద్య ఉంది. చెరువులు ఉన్నయి. 40 లక్షల బెస్త, ముదిరాజ్ కులాల జనాభా ఉంది. ఇప్పుడు మనం ఆలోచించే స్కీంకు గంగపుత్రులు, బెస్తవాళ్లు, ముదిరాజ్‌లు మీరందరూ కలిస్తే కూడా సరిపోరు. మీ అందరికి సరిపోగా ఇంకా పని మిగుల్తది. అంత పెద్ద పరిశ్రమగా దీన్ని చేయబోతున్నాం’’అని సీఎం వివరించారు. ‘‘దాదాపు 3 నుంచి 4 వందల టీఎంసీల నీరు నిలువుండే ప్రాజెక్టులు కట్టుకుంటున్నం. ఈ పది లక్షల కుటుంబాలను మెంబర్లను చేస్తం. మన గోదావరి బెల్ట్‌లో గంగ రొయ్యలు దొరుకుతయి.. చాలా ధర ఉంటుంది.. విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు..అలాంటి ఫిష్, ప్రాన్స్(రొయ్య) కల్చర్ చేస్తం..’’అని తెలిపారు. నదులు, చెరువులు, ప్రాజెక్టులు, కుంటలపై ఏ శాఖ పెత్తనం లేకుండా మత్స్యకారులకు అధికారం కట్టబెట్టుతూ ఇదే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. పది లక్షల కుటుంబాలను సభ్యులుగా చేసి చేప విత్తన కేంద్రాలను వృద్ధి చేసి, చేపల మార్కెటింగ్ చేస్తామన్నారు. మొత్తం మత్స్యకారులకే హక్కు ఉండేలా చట్టం తీసుకువస్తామని చెప్పారు.
యాదవుల వద్ద రూ.20 వేల కోట్లు
‘‘యాదవ సోదరుల జనాభా 30 లక్షలు ఉంది. స్థానికంగా చేపలు, మాంసానికి మార్కెట్ ఉంది. రాంనగర్ చేపల మార్కెట్‌కు ఆంధ్రా నుంచి రోజూ 20, 30 లారీలు, హైదరాబాద్‌కు 350 లారీలు వస్తాయి. ఇక రాష్ట్రంలోకి 600 లారీల గొర్రెలు వస్తున్నాయి. అవి వచ్చుడు బంద్ కావలె.. మనం పంపుడు షురూ కావాలె. మనకున్న శక్తి ఏంటని ఆలోచించి బడ్జెట్‌లో పథకాలు పెట్టినం. ఇంకా ఎంతైనా పెడతం. చిన్న లెక్క చెబుతా... గొల్ల, కురుమ రెండు కులాలు ఉన్నయి. డిపార్ట్‌మెంట్ వాళ్లను లెక్క అడిగితే తెలంగాణలో కోటి 25 లక్షల గొర్రెలు ఉన్నయని చెప్పిన్రు. సమగ్ర సర్వే లెక్క తీస్తే 44 లక్షల గొర్రెలె ఉన్నయి. సర్వేనే నమ్మినం. 88 లక్షలు కొనిస్తున్నాం. దీంతో కోటి 33 లక్షలు అవుతయి. గొర్రెలు మూడు ఈతలు ఈనుతయి. తక్కువ తక్కువ లెక్కపెట్టుకుంటే రెండు సంవత్సరాలలో తెలంగాణలో గొర్రెలు నాలుగున్నర కోట్లు అవుతయి. ఒక యాభై లక్షలు తీసేసినా నాలుగు కోట్ల గొర్రెలు మన యాదవ సోదరుల వద్ద ఉంటయి. 5 వేల కాడికి ఒక గొర్రె అమ్ముకున్నా.. వాళ్లు రూ.20 వేల కోట్ల ఆస్తిమంతులు అవుతరు. రూ.20 వేల కోట్లు మన యాదవ కులం వద్ద ఉంటాయి’’అని సీఎం వివరించారు.