'బడ్జెట్ నుంచి బాజాప్తగా నిధులిస్తం'
వరంగల్: తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వరంగల్ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. వరంగల్ అభివృద్ధి కోసం ప్రతి ఏటా బడ్జెట్ నుంచి నేరుగా రూ. 300 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. వరంగల్ స్పెషల్ డెవలప్‌మెంట్ అథారిటీకి కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారని, జిల్లా మంత్రి నేతృత్వం వహిస్తారని చెప్పారు. వరంగల్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ బుధవారం మీడియాతో మాట్లాడారు.
వరంగల్‌లోని రామప్ప, లక్నవరం, ఘనపురం చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద అభివృద్ధి చేస్తామని, అంతేకాకుండా ఈ చెరువుల అనుసంధానం చేపట్టి ఏడాది పొడుగుతా నీళ్లు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రామప్ప చెరువును పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేస్తామని వివరించారు. వచ్చే జూన్ లోగా ఈ చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక పట్టణమైన వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్‌ను తీసుకొస్తామని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే భూసేకరణకు రూ. 100 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు.
కాటన్ టు గార్మెంట్ వరకు అన్ని రకాల వస్త్రాలను తయారయ్యేవిధంగా దేశంలోనే నెంబర్ వన్ టెక్స్‌టైల్ హబ్‌గా దీనిని తీర్చిదిద్దుతామని చెప్పారు. రాబోయే మూడు నాలుగేళ్లలో అదనంగా మూడు, నాలుగు లక్షల జనాభా వరంగల్‌కు వచ్చి చేరే అవకాశముందని, ఆ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరముందన్నారు. ఇందుకు అవసరమైన నిధులను బడ్జెట్ నుంచి బాజాప్తగా ఇస్తామని చెప్పారు. వరంగల్‌లో వెటర్నరీ కాలేజ్, అగ్రికల్చరల్ కాలేజీతోపాటు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదించిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా ఇక్కడే స్థాపిస్తామని, వరంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా కూడా అభివృద్ధి చేశామని కేసీఆర్ తెలిపారు.