సాక్షి, హైదరాబాద్ : 2018–19 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను అత్యంత కీలకంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావటంతో ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. ఎన్నికల ఏడాదికి ముందు వస్తున్న బడ్జెట్ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి కూడా నెలకొంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికిది నాలుగో బడ్జెట్. వచ్చే ఏడాది ప్రవేశపెట్టే ఐదో బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్‌కే పరిమితమవనుంది. దాంతో ఎన్నికల ప్రయోజనాల దృష్ట్యా ఈ బడ్జెట్‌ను జనాకర్షకంగా రూపుదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా భారీగా అంచనాలు వేసుకుంటోంది. మార్చి 12 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవనున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ తయారీ కసరత్తును ఆర్థిక శాఖ వేగవంతం చేసింది. గురువారానికల్లా చాలా శాఖల బడ్జెట్ ప్రతిపాదనలూ ఆర్థిక శాఖకు చేరాయి. పోలీసు విభాగం, పలు శాఖల ప్రతిపాదనలు తుది దశలో ఉన్నందున రెండు రోజుల్లో అంచనా వ్యయం తేలనుంది. ఇది రూ.రెండు లక్షల కోట్లకు చేరవచ్చన్నదిఆర్థిక శాఖ ప్రాథమిక అంచనా.
సాగునీటికి రూ.28 వేల కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌గత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ రూ.28 వేల కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిసింది. శరవేగంగా పనులు జరుగుతున్న కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేసే లక్ష్యంతో ఈ వ్యయ ప్రణాళికను సిద్ధం చేసింది.
పెట్టుబడి సాయం రూ.12 వేల కోట్లు
సాగునీటితో పాటు వ్యవసాయానికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. రైతు రుణమాఫీ పథకం సంపూర్ణం కావడంతో సాగుకు పెట్టుబడి సాయంపై దృష్టి పెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎకరాకు రూ.8,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం ఇప్పటికే పలుమార్లు ప్రకటించడం తెలిసిందే. పథకాన్ని పక్కాగా అమలు చేసే లక్ష్యంతో రాష్ట్రమంతటా భూ రికార్డుల ప్రక్షాళన జరిపారు. పెట్టుబడి సాయం పథకానికి ఏటా రూ.12 వేల కోట్లు కావాలని తేలింది. దాంతో వ్యవసాయ శాఖ రూ.15 వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
విద్యుత్తుకు రూ.10 వేల కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరా పథకం విజయవంతంగా అమలవుతోంది. మరోవైపు విద్యుత్తు సంస్థలకు సబ్సిడీల భారం వచ్చే ఏడాది నుంచి పెరగనుంది. వచ్చే బడ్జెట్‌లో రూ.5,400 కోట్ల సబ్సిడీ నిధులను విద్యుత్తు శాఖ కోరుతోంది. మొత్తం రూ.10 వేల కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వైద్య ఆరోగ్యానికీ ఈసారి అత్యంత ప్రాధాన్యమిస్తామన్న సీఎం ప్రకటన, కొత్త వైద్య కాలేజీల నిర్మాణానికి నిధుల ఆవశ్యకత నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ రూ.6500 కోట్లతో ప్రతిపాదనలిచ్చింది.
తాగునీటికి రూ.8 వేల కోట్లు
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చేసిన సవాలు మేరకు ఇంటింటికీ తాగునీరందించే మిషన్ భగీరథ పథకాన్ని వచ్చే ఎన్నికల్లోగా పూర్తి చేయనుంది. పనులు ఈ ఏడాదిలోనే చివరి దశకు చేరుతాయి. దీంతో భగీరథకు రూ.8,000 కోట్లు కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ తగినన్ని నిధులు కోరుతోంది. కొత్త మున్సిపాలిటీలు, విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి పనుల దృష్టా మున్సిపల్ శాఖ రూ.12 వేల కోట్లకు పైగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రోడ్లు, భవనాల శాఖా భారీగానే అంచనాలు వేసుకుంది.
సంక్షేమానికే రూ.50 వేల కోట్లు
శాఖలవారీగా అందిన ప్రతిపాదనలతో పాటు ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు వచ్చే ఏడాది కేటాయింపులు భారీగానే పెరగనున్నాయి. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు వచ్చే ఏడాది నుంచి ఆర్థిక సాయం పెంపు పరిశీలనలో ఉంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత, బీడి కార్మికులు, కళాకారులకు రూ.500 చొప్పున సామాజిక భద్రత పెన్షన్లిచ్చే అవకాశాలనూ ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో పెన్షన్లకే దాదాపు రూ.2,500 కోట్లు అదనంగా కావాలని పంచాయతీరాజ్ విభాగం లెక్కలేస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి దాదాపు రూ.50 వేల కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment