వైద్య, ఆరోగ్యానికి పెద్దపీట | priority for health and hospatality in budget | Sakshi
Sakshi News home page

వైద్య, ఆరోగ్యానికి పెద్దపీట

Published Wed, Mar 2 2016 1:42 AM | Last Updated on Wed, Aug 15 2018 8:59 PM

priority for health and hospatality in budget

బడ్జెట్‌లో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తర్వాత ఆ రంగానికే ప్రాధాన్యం

*  రూ. 5 వేల కోట్ల వరకు కేటాయించాలని నిర్ణయం!
* నెదర్లాండ్స్ సంస్థ సహకారంతో రాష్ట్రంలోని ఆస్పత్రుల బలోపేతానికి యోచన
* శాఖలవారీగా ప్రతిపాదనలపై సీఎం ఆధ్వర్యంలో ముగిసిన కసరత్తు
* 10న గవర్నర్ ప్రసంగం..14న అసెంబ్లీలో బడ్జెట్

 సాక్షి, హైదరాబాద్

 ఈసారి బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల తర్వాత వైద్య రంగానికి పెద్దపీట వేయాలని, అందుకు అనుగుణంగా నిధుల కేటాయింపులు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్దేశించినట్లు తెలిసింది. శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై వరుసగా పది రోజుల పాటు అధికారులతో సీఎం సమీక్షించారు. అయితే వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలపై మాత్రం రెండుసార్లు సమావేశం నిర్వహించడం గమనార్హం. పేదలు వైద్యానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారని... ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, వైద్య సేవలను మెరుగుపర్చే దిశగా చర్యలు చేపడితే ఈ పరిస్థితిని నివారించే వీలుందని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం.

గత బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య శాఖకు రూ.2,460.24 కోట్లు కేటాయించగా... ఈసారి రూ. 5,000 కోట్లు కేటాయించాలని సూచించినట్లు తెలిసింది. ఇటీవల నెదర్లాండ్స్‌కు చెందిన ఎన్‌రాఫ్-నోనియస్ సంస్థ రూ.5,000 కోట్లతో రాష్ట్రంలో అత్యాధునిక ఆసుపత్రుల నిర్మాణానికి ముందుకొచ్చింది. ఆ దేశానికి చెందిన రాబో బ్యాంక్ నుంచి ఆర్థిక సాయం తీసుకుంటామని సీఎంతో జరిగిన చర్చల్లో వెల్లడించింది. అయితే కొత్త ఆసుపత్రుల నిర్మాణాలు చేపడితే ఆశించిన ప్రయోజనం నెరవేరదని... ఉన్న ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు, మౌలిక సదుపాయాలు, చికిత్సలు, పరీక్షల పరికరాల కోసం నెదర్లాండ్స్ సంస్థ సాయం తీసుకుంటే బాగుంటుందని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది. ఆ మరుసటి రోజునే ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, కొత్త ఆసుపత్రుల నిర్మాణాల అధ్యయనానికి మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అధికారుల బృందాన్ని చెన్నై, శ్రీలంక పర్యటనలకు పంపించడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు మెరుగ్గా ఉంటాయనే సంకేతాలు వస్తున్నాయి.

 ముగిసిన కసరత్తు
అన్ని శాఖలతో సీఎం సమీక్షలు ముగియడంతో బడ్జెట్ తయారీకి సంబంధించిన కీలక ఘట్టం పూర్తయింది. నీటి పారుదల రంగానికి వచ్చే బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం ముందుగానే వెల్లడించారు. దీంతో మిగతా శాఖల ప్రతిపాదనలు ఆసక్తి రేపుతున్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ.14 వేల కోట్లు కావాలని గృహనిర్మాణ శాఖ ప్రతిపాదించింది. మిషన్ భగీరథకు రూ.12,000 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.3,500 కోట్లు, హోంశాఖకు రూ.1,200 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు అందాయి. రూ.5,700 కోట్లు కావాలని ఆర్‌అండ్‌బీ కోరగా.. రూ.4,000 కోట్లలోపునకు కుదించినట్లు తెలిసింది.

తేలని ఒకేసారి రుణమాఫీ!
వ్యవసాయ శాఖ రూ.2,144 కోట్లు కావాలని ప్రతిపాదనలు సమర్పించింది. ప్రణాళికేతర పద్దులోకి వచ్చే రైతుల రుణమాఫీ పథకానికి సంబంధించిన రెండు విడతల బకాయిలు ఒకేసారి చెల్లించేందుకు రూ. 8,847 కోట్లు కేటాయించాలని కోరింది. కానీ ఒక విడత చెల్లిస్తారా, రెండు విడతల సొమ్ము ఒకేసారి ఇస్తారా అనేది ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉందని అధికారులు వెల్లడించారు.

10న గవర్నర్ ప్రసంగం
ఈనెల 10వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బడ్జెట్ తయారీని వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజునే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఈలోగా ప్రసంగం పాఠం తయారీ బాధ్యతలను ప్రణాళిక విభాగానికి అప్పగించారు. 14వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈనెల 6న జరిగే రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ తేదీలను ఖరారు చేసి ప్రకటించే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement