కేంద్ర బడ్జెట్‌పై కేసీఆర్ మౌనం!
ఎలాంటి ప్రకటనను విడుదల చేయని సీఎంవో
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వాన్ని నిరాశపరిచింది. ఆశించిన కేటాయింపులు లేకపోవటం.. బడ్జెట్‌లో కనీస ప్రస్తావన లేకపోవటం.. విభజన హామీలు, ప్రత్యేక ప్యాకేజీలు, ఆర్థిక సాయం కోరుతూ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులకు కనీస స్పందన కనిపించకపోవటంతో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సైతం బడ్జెట్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. క్యాంపు కార్యాలయంలో బడ్జెట్‌ను కాసేపు టీవీలో చూసిన ముఖ్యమంత్రి.. గొప్పగా ఏమీ లేదని పెదవి విరిచినట్లు తెలిసింది. సీఎం కార్యాలయం బడ్జెట్‌పై ఎలాంటి ప్రకటనను విడుదల చేయకపోవటం గమనార్హం.
రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులేమీ లేవనే అసంతృప్తితో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి తన స్పందనను బాహాటంగా వెల్లడించకపోవటం అధికార పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జీఎస్టీ బిల్లుతోపాటు నోట్ల రద్దు పరిణామాల్లో కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించినప్పటికీ తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేకపోవటం నిరాశపరిచిందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు కేంద్ర బడ్జెట్ అంచనాలతో రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు విడుదలయ్యే అవకాశముంది, వచ్చే ఏడాది పన్నుల వాటా ఎంత మేరకు పెరుగుతుంది, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల కేటాయింపు ఎలా జరిగింది అని కేసీఆర్ బుధవారం మధ్యాహ్నమే ఆర్థిక శాఖ అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ సలహాదారు జీఆర్ రెడ్డితోపాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులతో బడ్జెట్, రాష్ట్రానికి వచ్చే నిధుల కోటాపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం.
నో కామెంట్ ప్లీజ్..: కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడేందుకు, తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నిరాకరించారు. తాను బడ్జెట్‌ను గమనించలేదని, పూర్తి పాఠం చదివాక మాట్లాడతానంటూ బుధవారం సాయంత్రం తనను కలసిన మీడియా ప్రతినిధులతో అన్నారు.