సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక మాంద్యం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడులు, కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదల నేపథ్యంలో ఈసారి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా ఉంటాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఈ నెలలో ప్రవేశపెడతారని భావిస్తున్న 2020–21 వార్షిక బడ్జెట్ కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేయడంతో కచ్చితమైన ఖర్చులు, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు అవసరమైన నిధులను ప్రతిపాదించాలంటే భూములపైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి తీసుకొనే అప్పులకుతోడు బడ్జెట్‌లో భూముల అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందన్న దానిపైనే వార్షిక బడ్జెట్ అంచనాలు ఆధారపడతాయనే చర్చ ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములతోపాటు అన్ని రకాల భూములపై వివరాల సేకరణను రెవెన్యూ శాఖ ముమ్మరం చేయడంతో భూముల అమ్మకాల విషయంలో ప్రభుత్వం అనుసరించబోయే విధానం చర్చనీయాంశమవుతోంది.
రాబడులు ఈసారీ అంతంత మాత్రమే...
గత మూడేళ్ల వార్షిక రాబడులను పరిశీలిస్తే ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా ఆదాయం లేదని బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి. రాబడులకుతోడు అప్పులు కలిపినా బడ్జెట్ అంచనాల్లో 90 శాతం మేర నిధుల సమీకరణ జరగడం లేదు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1.13 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా కేవలం రూ. 88,711 కోట్లు మాత్రమే వచ్చింది. దీనికి అదనంగా రూ. 26,738 కోట్లను ప్రభుత్వం అప్పుల రూపంలో సమకూర్చుకుంది. 2018–19 సంవత్సరానికిగాను రూ. 1.30 లక్షల కోట్ల ఆదాయ అంచనాకు రూ. 1.01 లక్షల కోట్లు మాత్రమే సమకూరింది. ఆ ఏడాది రూ. 26,949 కోట్లను అప్పుల రూపంలో తీసుకురాగా మొత్తం ప్రతిపాదిత వార్షిక బడ్జెట్‌లో 92 శాతం నిధులే వచ్చాయి. ఇక ఈ ఏడాది గణాంకాలను పరిశీలిస్తే రూ. 1.13 లక్షల కోట్ల అంచనాకుగాను మూడో త్రైమాసికం ముగిసిన డిసెంబర్ నాటికి రూ. 71,187 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. దీనికి అప్పులు రూ. 21,715 కోట్లను కలిపితే డిసెంబర్ వరకు రావాల్సిన నిధుల్లో 90.74 శాతం నిధులు మాత్రమే సమకూరాయి. ఇక చివరి త్రైమాసికం విషయానికి వస్తే 2017–18లో చివరి మూడు నెలల ఆదాయం రూ. 29 వేల కోట్లు రాగా 2018–19లో రూ. 33,500 కోట్ల వరకు వచ్చింది.
ఇక ఈ ఏడాది ఇప్పటికే అంచనాలో 63 శాతం మేరకు ఆదాయం వచ్చింది. చివరి మూడు నెలల్లో పన్నుల రూపంలో రూ. 20 వేల కోట్లు, అప్పుల రూపంలో మరో రూ. 10 వేల కోట్లు... వెరసి రూ. 30 వేల కోట్ల వరకు నిధులు సమకూరుతాయని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూడేళ్ల రాబడులు, అప్పులను అంచనా వేస్తే వచ్చే ఏడాది కూడా రాబడులు (అప్పలు కాకుండా) రూ. లక్ష కోట్లు దాటే పరిస్థితులు కనిపించడం లేదు. ఆర్థిక మాంద్యం ప్రభావం మరో ఆరునెలలపాటు కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదలతో 2020–21 సంవత్సరానికి కూడా రాబడులు అంతంత మాత్రమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో తయారీ, ఫార్మా రంగాల్లో వినియోగించే చైనా ఉత్పత్తులు తగ్గిపోతే వచ్చే ఏడాది పన్నులకు నష్టం వాటిల్లుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో స్థిరత్వం కనిపిస్తుండగా లిక్కర్ ధరలు పెంచడంతో కొంత మేరకు నిధులు సమకూరుతాయనే అంచనాలున్నాయి. ఇక జీఎస్టీ విషయంలో కేంద్రం అనుసరించే వైఖరి, ఇచ్చే పరిహారం ఏ మేరకు ఉంటాయన్నది కూడా సందేహమే కావడంతో ఆ పన్నులపైనా ఆశలు పెట్టుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో వచ్చే ఏడాది నెట్టుకురావడానికి భూముల అమ్మకాలపై ప్రభుత్వం ఆధారపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
2020–21 బడ్జెట్ రూ. 1.55 లక్షల కోట్లు?
2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1.46 లక్షల కోట్లతో ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించింది. ఈసారి 8 శాతం వృద్ధి అంచనాతో 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1.55 లక్షల కోట్ల వరకు బడ్జెట్‌ను ప్రతిపాదించవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఇరిగేషన్‌కు రూ. 20 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గత బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ. 6 వేల కోట్లకుపైగా కేటాయింపులు చూపినా అప్పులతో కలిపి ఈ ఏడాది డిసెంబర్ వరకు రూ. 18 వేల కోట్ల వరకు ఖర్చయింది. ఈ అంచనాల నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా రూ. 20 వేల కోట్ల వరకు వ్యయం అవసరమవుతుందని సాగునీటి శాఖ వర్గాలంటున్నాయి.
రుణమాఫీకి రూ. 18 వేల కోట్లు కేటాయించే చాన్స్
ఈసారి 2018 ఎన్నికల హామీ అయిన రైతు రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందనే చర్చ జరుగుతోంది. రుణమాఫీకి రూ. 24 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారం మేరకు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో పెట్టిన రూ. 6 వేల కోట్లకు తోడు వచ్చే ఏడాది బడ్జెట్‌లో రూ. 18 వేల కోట్లు రుణమాఫీకి కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. వయోపరిమితిని 57 ఏళ్లకు కుదించడంతో అదనంగా చేరిన 12 లక్షల మందికి కూడా పింఛన్లు ఇవ్వాల్సి ఉన్నందున గతేడాది కంటే రూ. 2,500 కోట్లు అదనంగా.. అంటే రూ. 12 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. దీంతోపాటు రైతుబంధు పథకం కోసం రూ. 12 వేల కోట్లు, జీతభత్యాలకు రూ. 23–25 వేల కోట్లు, సబ్సిడీలకు రూ. 9 వేల కోట్లు, అప్పులకు వడ్డీల కోసం రూ. 15 వేల కోట్లు అవసరం అవుతాయి. వాటితోపాటు రైతు బీమా, ఉపకార వేతనాలు, ఆరోగ్యశ్రీ, కల్యాణ లక్ష్మికి కలిపి రూ. 8 వేల కోట్ల వరకు కేటాయించాల్సి ఉంటుంది. విద్యుత్ రాయితీల రూపంలో మరో రూ. 9 వేల కోట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమాలకు రూ. 12 వేల కోట్లు, విద్యకు రూ. 10 వేల కోట్లు, హోంశాఖకు రూ. 5 వేల కోట్ల అనివార్య కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది అదనంగా పట్టణ ప్రగతి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అవి కూడా రూ. 1,500 కోట్ల వరకు అవసరమవుతాయి. ఇవన్నీ కలిపి రూ. 1.55 లక్షల కోట్ల వరకు ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలకు అవకాశం ఉందనేది ఆర్థిక శాఖ వర్గాల అంచనాగా కనిపిస్తోంది. ఇందులో కొన్ని ఖర్చులు తగ్గించుకున్నా ఇతర అవసరాలకు నిధులు కావాల్సి వస్తుందని, మొత్తం మీద ఆ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలు ఉండే అవకాశముందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
అంతరం పూడ్చేదెలా?
బడ్జెట్ ప్రతిపాదనలు, వాస్తవిక ఆదాయం మధ్య అంతరాన్ని ఎలా పూడ్చుకోవాలన్నదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్‌గా మారనుంది. ఇందుకు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అనుమతించిన మేరకు అప్పులు తేవడంతోపాటు భూముల అమ్మకాలే ప్రధాన వనరుగా మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా భూమి లెక్క తేల్చే పనిలో బిజీగా ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, అటవీ, ఇతర భూముల వివరాలు ఇప్పటికే ఉన్నప్పటికీ అమ్మకానికి అనువుగా ఉన్న భూముల లెక్కను రెవెన్యూ శాఖ ప్రత్యేకంగా తయారుచేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని విలువైన భూములను వేలం వేసేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధంగా ఉంది. ఇజ్జత్‌నగర్‌లో 36 ఎకరాలు, తెల్లాపూర్‌లో 46 ఎకరాలు, హైటెక్స్ సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్‌లో 8 ఎకరాలు వేలానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి అమ్మకం ద్వారా రూ. 3 వేల కోట్లకు పైగా ఆదాయం రానుంది. వాటికితోడు సుప్రీంకోర్టులో కేసులు క్లియర్ అయిన కోకాపేటలో 146 ఎకరాలు అమ్మితే రూ. 4,380 కోట్లు, పుప్పాలగూడలోని 198 ఎకరాలకు రూ. 7 వేల కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి.
అలాగే మేడ్చల్, శంషాబాద్, రాజేంద్రనగర్‌ల పరిధిలోని ఎవాక్యూ భూములు అమ్మకానికి పెడితే రూ. వేల కోట్ల ఆదాయం రానుంది. వాటన్నింటితోపాటు అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించి పేదలను నుంచి తీసుకొని వాటిని అమ్మితే ఎలా ఉంటుందన్న దానిపై బ్లూప్రింట్ తయారవుతోంది. అందులో భాగంగానే శంషాబాద్ మండలంలోని ఆరు గ్రామాల్లో లెక్కకడితే రూ. 5,745 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తేలింది. దీనికితోడు ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయడం ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఓ ప్రణాళిక ప్రకారం వెళితే రూ. 25–50 వేల కోట్ల వరకు భూముల అమ్మకాల ద్వారా సమీకరించుకునే అవకాశాలున్నా ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. అయితే పెద్ద ఎత్తున భూముల అమ్మకానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని, వచ్చే ఏడాదికి అవసరమయ్యే వరకు ప్రతిపాదనలు చేసి ఆ తర్వాతి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకొనే యోచనలో ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment