సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగుల్లో నీతి, నిజాయితీ, నిబద్ధతతో పని చేసే వారు చాలా తక్కువగా ఉంటారు. కొంతమంది మాత్రమే తమ వృత్తి పట్ల అపారమైన గౌరవంతో అంకిత భావంతో పనిచేస్తుంటారు. ఆ కోవలోకి చెందినవారే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుల్‌దీప్ శర్మ. తండ్రి చనిపోయారని తెలిసినా... ఇంటికి వెళ్లకుండా వృత్తి పట్ల అంకితభావంతో పనిలో నిమగ్నమయ్యారు. గుండెల్లో కొండంత బాధ ఉన్నా వృత్తి ధర్మాన్ని పాటించారు. వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న 2020-21 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి న పత్రాల ముద్రణను ఆర్థికశాఖ ప్రారంభించింది. ఇక్కడ పని చేసే మొత్తం సిబ్బంది బడ్జెట్ తయారీ నుంచి లోక్‌సభలో ప్రవేశపెట్టేవరకూ బయటికి వెళ్లడానికి వీలు ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఫోన్‌లో, ఈ-మెయిల్ లాంటి వాటిల్లోనూ సంప్రదింపులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వరు. బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ వారికి బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు ఉండవు.
ఇక్కడ పని చేసే సిబ్బందిలో కుల్‌దీప్ శర్మ ఒకరు. డిప్యూటీ మేనేజర్ హోదాలో పని చేస్తున్న కుల్‌దీప్ శర్మ తండ్రి జనవరి 26న మృతి చెందారు. ఈ విషయాన్ని ఆర్థికశాఖ కార్యాలయం కుల్‌దీప్‌కు తెలియజేసింది. ఇంటికి వెళ్లేందుకు అనుమతి కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఆయన ఇంటికి వెళ్లలేదు. తాను చేయాల్సిన పని పూర్తి అయ్యాకనే ఇంటికి వెళ్తానని అధికారులకు తెలిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభ సమయంలో దగ్గరపడుతుండడంతో తన పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని ఆర్థికశాఖ కార్యాలయం ట్వీట్ చేసింది. వృత్తి పట్ల కుల్‌దీప్‌కు ఉన్న నిబద్దతకు ఇది నిదర్శనమని ప్రశంసించింది.
సాంప్రదాయక హల్వా రుచుల ఆస్వాదనతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2020–2021) బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియ ఈనెల 20న ప్రారంభమైంది. హల్వా కార్యక్రమం అనంతరం బడ్జెట్ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులు అందరికీ... ‘ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించేంతవరకూ’ బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఈ హల్వా రుచిచూసే కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారికి కనీసం వారి ఆప్తులతో సైతం ఫోనులోగానీ, ఈ–మెయిల్‌తోగానీ మరే రకంగానూ మాట్లాడటానికి వీలుండదు. పార్లమెంట్ నార్త్ బ్లాక్ హౌసెస్‌లోని ప్రత్యేక బడ్జెట్ ప్రెస్‌లో ఈ కీలక పత్రాల ముద్రణ జరుగుతుంది.
అంత గోప్యత ఎందుకు?
ఎంతో పకడ్బందీగా తయారయ్యే ఈ బడ్జెట్ గనక ముందే బయటకు తెలిసిపోతే... బడ్జెట్‌ను కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... బడ్జెట్ తయారీని అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో... బడ్జెట్ తయారీ అయ్యే ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి నిఘా ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతూనే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment