న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మనీష్ సిసోడియా శనివారం ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. అంతేగాదు ఆయన 2022-23 ఏడాదికిగానూ రూ.75,800 కోట్ల బడ్జెట్‌ను సమర్పించారు. 2014-15లో రూ.30,940 కోట్లుగా ఉన్న బడ్జెట్ కంటే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ.
ఈ ఏడాది బడ్జెట్‌ను 'ఉపాధి బడ్జెట్'గా సిసోడియా అభివర్ణించారు. ఈ మేరకు అసెంబ్లీలో మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ‘‘ఇది మేం ప్రవేశపెడుతున్న ఎనిమిదో బడ్జెట్. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏడు బడ్జెట్‌లు... ఢిల్లీ పాఠశాలలను మెరుగుపరిచాయి. అందరికీ విద్యుత్ అందుబాటులోకి వచ్చించి. పైగా మెట్రోను కూడా విస్తరించాం." అని చెప్పారు. గత ఏడేళ్లలో ఆప్ ప్రభుత్వం లక్షా 78 వేల మంది యువతకు పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించిందని మనీష్ సిసోడియా పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఇలా చేయడంలో విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్ సమావేశానికి పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా కూడా హాజరవ్వడం విశేషం.
ఉద్యోగాలు కల్పించనున్న రంగాలు:
- రిటైల్ రంగం
- ఆహారం, పానీయాలు,
- లాజిస్టిక్ అండ్ సప్లై చైన్,
- ప్రయాణం అండ్ పర్యాటకం, వినోదం
- నిర్మాణం
- రియల్ ఎస్టేట్
- పర్యావరణ హితమైన శక్తి
ముఖ్యాంశాలు
- 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూ.69,000 కోట్లు కాగా 2022-23 బడ్జెట్ గతేడాది కంటే 9.86 శాతం ఎక్కువ. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి ఇది వరుసగా ఎనిమిదో బడ్జెట్. 2022-23 బడ్జెట్‌ని "రోజ్గర్ బడ్జెట్" అని సిసోడియా అన్నారు.
- ఢిల్లీ వాసులకు హెల్త్ కార్డులు అందజేయనున్నారు. ఇది ఓటర్ ఐడీతో లింక్ చేయబడుతుంది. ఈ పథకానికి రూ.160 కోట్లు కేటాయించారు. ఇది ఢిల్లీ వాసులకు మెరుగైన ఆరోగ్య కవరేజీని అందిస్తుంది.
- పర్యాటకుల సంఖ్యను పెంచే లక్ష్యంతో సిసోడియా బడ్జెట్‌లో 'ఢిల్లీ షాపింగ్ ఫెస్టివల్'ను సూచించారు. ఢిల్లీలోని ఈ ఐకానిక్ మార్కెట్‌లను తిరిగి అభివృద్ధి చేసి ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీని కోసం బడ్జెట్‌లో 100 కోట్లను కేటాయించారు.
- వచ్చే 5 ఏళ్లలో కేవలం 5 మార్కెట్లలోనే కనీసం 1.5 లక్షల కొత్త ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు
- షాపింగ్ ఫెస్టివల్స్ పర్యాటకుల సంఖ్యను సుమారు 4 లక్షలకు పెంచుతుంది. దీంతో హోటళ్ళు, రెస్టారెంట్లు, టూరిజం ఇతర వ్యాపారాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుడమే కాకుండా ఈ రంగాల్లో పనిచేస్తున్న 12 లక్షల మంది జీవితాలపై అనుకూలమైన ప్రభావం చూపుతుందన్నారు
Comments
Please login to add a commentAdd a comment