జనవరి–డిసెంబర్ బడ్జెట్
- కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా మార్పు
- ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి జనవరి–డిసెంబర్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కేంద్రం ఆలోచనా విధానానికి అనుగుణంగా కొత్త బడ్జెట్ పద్ధతిని అనుసరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. జనవరి 1– డిసెంబర్ 31 వరకు క్యాలెండర్ సంవత్సరం ప్రాతిపదికన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆలోచనపై సీఎం మంగళవారం ఆర్థిక శాఖ, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ఈ పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఆ విధానాన్ని అధ్యయనం చేయడానికి ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరుల బృందాన్ని ఎంపీకి వెళ్లి రమ్మని సీఎం ఆదేశించారు.
గతేడాది నుంచే మార్పులకు శ్రీకారం
గత ఏడాది నుంచే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విధానంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్లాన్, నాన్ ప్లాన్ పద్దులను ఎత్తివేసి కొత్త తరహాలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఏటా రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టే సంప్రదాయానికి తెర దించి సాధారణ బడ్జెట్‌లోనే రైల్వేకు చోటు కల్పించింది. గతానికి భిన్నంగా ఫిబ్రవరి ఒకటినే బడ్జెట్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఏప్రిల్ 1– మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంప్రదాయం అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మార్పు, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని గత ఏడాది కేంద్రం ఆర్థిక వేత్త శంకర్‌ఆచార్య ఆధ్వర్యంలో కమిటీని నియమించింది.
నీతి ఆయోగ్ సైతం బడ్జెట్ విధానాల్లో మార్పులు సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక, క్యాలెండర్ సంవత్సరం ఒకేలా ఉండాలనేదానిపై చర్చించారు. ఇటీవల అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరైన నీతిఆయోగ్ సమావేశంలోనూ ప్రధాని మోదీ జనవరి–డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని పాటించా లన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికగా బడ్జెట్‌కు కసరత్తు చేయాలని యోచిస్తోంది.