నిన్నటి నిజాలు, రేపటి దృశ్యాలు | why pawan kalyan also entering to direct politics | Sakshi
Sakshi News home page

నిన్నటి నిజాలు, రేపటి దృశ్యాలు

Published Wed, Apr 13 2016 1:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

నిన్నటి నిజాలు, రేపటి దృశ్యాలు - Sakshi

నిన్నటి నిజాలు, రేపటి దృశ్యాలు

డేట్‌లైన్ హైదరాబాద్
 
నాయకుడి ప్రకటనతో జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం రావచ్చు కానీ, ఆయన ఇచ్చిన ఈ తాజా ఇంటర్వ్యూలు మాత్రం చాలా గందరగోళపరిచే రీతిలో ఉన్నాయి. 2019లో ఎన్నికల్లో పోటీ చేస్తానన్న మాట తప్ప, ఇంక ఏ విషయంలోనూ ఆయనకు స్పష్టత ఉన్నట్టు కనిపించలేదు. రాజకీయాల్లో నిలబడగలననే నమ్మకం ఉందని ఒక పక్క చెబుతూనే కార్పొరేటర్‌గా కూడా గెలవగలనో లేదో అని అనుమానం వ్యక్తం చేశారాయన. తాను పోటీ చేసేదీ అధికారం కోసం కాదంటారు.
 
ఎన్నికల రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టు లోక్‌సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ఈ మధ్యనే ప్రకటించారు. అవే ఎన్నికల రాజకీయాల్లోకి వస్తున్నానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రెండు రోజుల క్రితమే ప్రకటించారు. వీరిలో ఒకరు మేధావి, విద్యావంతుడు. ఉన్నతాధికారిగా రాజకీయాలనూ, ప్రభుత్వాల పనితీరునూ సన్నిహితంగా అధ్యయనం చేసినవారు. మరొకరు తెలుగునాట లెక్కకు మించిన అభిమా నులను సంపాదించుకున్న చలనచిత్ర నటుడు. తన సొంత అన్న, మరో సినీ హీరో రాజకీయ పార్టీ పెట్టి, ఎన్నికల్లో పోటీ చేసి నిరాశ పరిచే ఫలితా లను చూసి, కాంగ్రెస్ సముద్రంలో కలిసిపోయే దాకా జరిగిన పరిణామా లను దగ్గరుండి చూసిన అనుభవంతో సొంత పార్టీ పెట్టుకున్నవారు. డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) ఎన్నికల రాజకీయాల నుంచి ఎందుకు విరమించుకున్నట్టు? పవన్‌కల్యాణ్ ఎందుకు దూకుతున్నట్టు?

జేపీ వైద్య వృత్తిని కాదనుకుని బ్యూరోక్రాట్‌గా ప్రజాసేవకు ఎక్కువ అవకాశం ఉంటుందనుకుని ఐ.ఎ.ఎస్. అధికారి అయ్యారు. కానీ అక్కడా ఆ పని చేయడం సాధ్యం కాదనుకుని, లోక్‌సత్తా  స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, తరువాత రాజకీయాల బాట పట్టారు. లోక్‌సత్తాకు అనతికాలంలోనే  రాష్ర్టమంతటా మంచి పేరొచ్చింది. ఆ సంస్థను ఫక్తు రాజకీయ పార్టీగా మార్చి 2009లో ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఇంటా బయటా కొంత ప్రతిఘటన రావడం చూశాం. అయినా ఆయన పార్టీ పోటీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయనొక్కరే కూకట్‌పల్లి నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జేపీ తిరిగి స్వచ్ఛంద సేవా రంగం లోకి వెళ్లిపోడానికి కారణం ఏమిటి? ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో నిలదొక్కుకోవడం, అనుకున్నది సాధించడం అంత సులభం కాదని తెలిసి రావడమేనా?
 
 జేపీ నిష్ర్కమణ, పవన్ రాక
 డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ లాంటి వారే ప్రత్యక్ష రాజకీయాలకు ఒక నమస్కారం పారేసి వెళ్లిపోతే పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలోకి దిగి ఏం సాధించాలనుకుంటున్నారు? రాజకీయాలు డబ్బుమయం అయిపోయి, కుల, మత వైషమ్యాలతో ఎన్నికల రాజకీయాలు మలినమవుతున్న క్రమంలో జేపీ వంటి వారు రాజకీయాల్లోకి రావడాన్ని అప్పట్లో చాలామంది ఆహ్వానించారు. ఇప్పటి నుంచైనా రాజకీయాల్లో మార్పు వస్తుందేమో;  ధనబలం, కండబలం, పలుకుబడి కలిగినవాళ్లే  కాకుండా; సామాన్యులు కూడా రాజకీయాల్లోకి వచ్చి రాణించే మంచిరోజులు రాబోతున్నాయే మోనని సంతోషపడ్డారు. కానీ తెలుగునాట ఆ ప్రయత్నం విఫల ప్రయో గంగానే మిగిలింది. రాజకీయ పార్టీగా లోక్‌సత్తా  వైఫల్యానికి కారణం ప్రజలు కాదు, జేపీయేనని కచ్చితంగా చెప్పొచ్చు.
 
కాంగ్రెస్ తదితర  సంప్రదాయ రాజకీయ పార్టీలను ఎదిరించి ఏమాత్రం అనుభవం లేకపోయినా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి అద్భుత ప్రజాదరణను చవిచూసిన నాయకులనూ, పార్టీలనూ చూశాం. దేశంలో అటువంటి కొన్ని ఉదాహరణలు ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మహా నటుడు ఎన్.టి. రామారావు  స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రయోగం సఫలం కావడం చూశాం. సంప్రదాయ కాంగ్రెస్  రాజకీయాలతో విసిగిన జనం మార్పు కోసం ఎదురుచూస్తున్న తరుణమది. జేపీ కానీ, చిరంజీవి కానీ రాజకీయాల్లోకి వచ్చింది అటువంటి సందర్భంలో కాదు. లోక్‌సత్తా, ప్రజారాజ్యం పార్టీలు రెండూ 2009 ఎన్నికల్లో మొదటిసారి తమ రాజకీయ బలాన్ని పరీక్షించుకున్నాయి. ఆ సమయానికి 1983 నాటి రాజకీయ వాతావరణం లేదు. ఐదేళ్లు అత్యంత ప్రజాదరణ పొందిన డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ అధికారంలో ఉన్నది. ప్రతిపక్ష మైదానం కూడా ఖాళీగా లేదు. మహాకూటమి పేరిట తెలుగుదేశం ఒక విఫల ప్రయత్నానికి నడుంకట్టి నిలబడి ఉంది. లెక్కలు సరిగా వేసుకోకుండా రాజకీయాల్లోకి వస్తే ఇట్లాగే అవుతుంది.

మేము అధికారం లక్ష్యంగా పోటీలోకి దిగలేదని జేపీ అనవచ్చు. అదంతా ఉత్తమాట. అధికారం లక్ష్యం కాకపోతే స్వచ్ఛంద సంస్థ గానే ఎక్కువ ప్రజాసేవ చేయవచ్చు. అయినా రాజకీయాల్లోకి వచ్చాక పక్షి కన్ను లక్ష్యం కావాలి కానీ, తోకను కొడితే చాలనుకుంటే చివరికి ఇట్లాగే జరుగుతుంది. జేపీ మాట ఎట్లా ఉన్నా చిరంజీవి మాత్రం ప్రజారాజ్యం పార్టీ పెట్టిందే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని. ఆయన పార్టీ పెట్టినప్పుడు కొందరు మహా మేధావులు ఆయన వెంట ఉన్నారు. వారిలో ఒకరిద్దరు ఇప్పుడు చంద్ర బాబునాయుడి కొలువులో కనిపిస్తారు. మరి ఆనాటి రాజకీయ పరిస్థి తులను వీరంతా ఏ మేరకు అంచనా వేసినట్టు? ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారెవరూ ఇప్పటివరకు ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి, పార్టీ నెలకొల్పితే అధికారంలోకి రావచ్చునన్న బ్రహ్మాండమైన ఆలోచన వారిది. ఇట్లాంటి విఫల ప్రయత్నాలు చేస్తున్న వాళ్లను మనం దేశంలో మరికొన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. రాజకీయ శూన్యం ఏర్పడితే తప్ప కొత్త పార్టీలకు ప్రజాదరణ లభించడం కష్టమని  అక్కడక్కడ మనకు అనుభ వాలు చెబుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తమిళనాట విజయకాంత్ ప్రయోగం కూడా అటువంటిదే. అదే సమయంలో విజయ వంతమైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయోగం కూడా చూశాం.
 
ఏదీ స్పష్టత?
ఎంచుకున్న లక్ష్యం, లక్ష్యసాధనకు ఎంచుకున్న సమయం కూడా అనుకూలమైనవి కాకపోతే రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టం. ఇప్పుడు పవన్‌కల్యాణ్ గురించి మాట్లాడుకుందాం. 2009లో ఆయన అన్నగారు ప్రజారాజ్యం స్థాపన ద్వారా ఒక విఫలయత్నం చేసిన పదేళ్లకు, 2019లో ఎన్నికల బరిలోకి దిగుతానంటున్నారు పవన్. 2014 ఎన్నికల నాటికే ఆయన జనసేన పార్టీ పెట్టారు. ఆ ఎన్నికలలో బీజేపీ, తెలుగుదేశం కూటములకు మద్దతు ఇచ్చారు. రెండేళ్లుగా అప్పుడప్పుడు మీడియా ముందు నాలుగు మాటలు మాట్లాడి, మళ్లీ సినిమా షూటింగ్‌లు చేసుకున్నారు తప్ప పార్టీ నిర్మాణం ఏమీ చేసినట్టు కనపడదు. ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానంటున్నారు. సినిమాల్లో నటించడం మానేస్తానని కూడా చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు. అందుకు ఇంకా మూడేళ్ల గడువు ఉంది. అయితే సరిగ్గా ఆయన సినిమా సర్దార్ గబ్బర్‌సింగ్ విడుదలైన 48 గంటల్లో ఎంపిక చేసిన కొన్ని మీడియా సంస్థల ముందుకొచ్చి ఈ ప్రకటన ఇప్పుడే ఎందుకు చేశారో తెలియదు.

తెలుగునాట ఆయన అభిమానులూ, జనసేన కోసం అక్కడక్కడ పనిచేస్తున్న కార్యకర్తలూ ఈ ప్రకటనతో చాలా సంతోషపడ్డారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో. ఎందుకంటే 2014లో ఒక సామాజిక వర్గం ఓట్లు కోసం పవన్‌కల్యాణ్‌ను వాడుకున్న తెలుగుదేశం ఆయన పట్ల, ఆయన అభిమానుల పట్ల ఎటువంటి వైఖరితో ఉందో సోమవారం రాత్రి సాక్షి చానల్ ‘ఫోర్త్ ఎస్టేట్’ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ప్రతినిధి గోపాల్ (కాకినాడ) స్పష్టం చేశారు. జనసేన వార్షికోత్సవం సందర్భంగానో, తమ నాయకుడి తాజా సినిమా విడుదల సందర్భంగానో ఫ్లెక్సీలు కట్టుకుంటే కూడా ఓర్వలేక రాత్రికి రాత్రి వాటిని తొలగిస్తున్న తెలుగుదేశం వారి వైఖరి గురించి చెప్పారు. వైఎస్‌ఆర్ సీపీ  బీ ఫాంతో ఎన్నికయి, శాసనసభా పక్ష ఉపనాయకుడిగా ఉండి, పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరిన  జ్యోతులనెహ్రూ, చంద్రబాబు మెప్పు కోసం పవన్‌కల్యాణ్ మీద చేసిన విమర్శలను కూడా గుర్తు చేశారు గోపాల్ అనే ఆ యువ కార్యకర్త.
 
నాయకుడి ప్రకటనతో జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం రావచ్చు కానీ, ఆయన ఇచ్చిన ఈ తాజా ఇంటర్వ్యూలు మాత్రం చాలా గందరగోళ పరిచే రీతిలో ఉన్నాయి.  2019లో ఎన్నికల్లో పోటీ చేస్తానన్న మాట తప్ప, ఇంక ఏ విషయంలోనూ ఆయనకు స్పష్టత ఉన్నట్టు కనిపించలేదు. రాజకీయాల్లో  నిలబడ గలననే నమ్మకం ఉందని ఒక పక్క చెబుతూనే కార్పొరేటర్‌గా కూడా గెలవగలనో లేదో అని అనుమానం వ్యక్తం చేశారాయన. తాను పోటీ చేసేదీ అధికారం కోసం కాదంటారు. రాజకీయాలంటే తన దృష్టిలో సమస్యలను ప్రస్తావించి, వాటి గురించి పోరాడటం అంటారు. సమస్యల మీద ప్రభుత్వాలను నిలదీసి వాటి పరిష్కారం కోసం చాలామంది పోరాటాలు చేస్తున్నారు. వారంతా రాజకీ యాలలోనే లేరు, ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కూడా. ప్రజారాజ్యం అనుభవంతోనే 2014లో పోటీ చేయలేదన్న పవన్‌కల్యాణ్, 2019 నాటికి జనసేన పోటీలోకి దిగడానికి ఏ అనుభవం తోడవబోతున్నది అనే విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.
 
బీజేపీ, టీడీపీ కూటమితో తన రాజకీయ సంబంధాలు ఎట్లా ఉంటాయి? అసలు ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయా? ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఒక కొత్త పార్టీ బరిలోకి దిగి ఫలితాలు సాధించే పరిస్థితి ఉందా? ఇవేవీ ఆయన ఆలోచించి మీడియా ముందుకు వచ్చినట్టులేరు. అందుకే అనేది, పక్షి కన్ను లక్ష్యం కాకుండా, తోకను కొడితే చాలనుకుంటే జనసేన కూడా 2019 ఎన్నికల తరువాత మరో లోక్‌సత్తా, మరో ప్రజారాజ్యం కాక తప్పదు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. నిలిచి గెలవడం మాత్రం అంత సులభం కాదు.
 

 

datelinehyderabad@gmail.com
 దేవులపల్లి అమర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement