రెచ్చిపోయిన దానం... అనుచరగణం
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ ముగిసింది. పోలింగ్ స్టేషన్ల ముందే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధి కిందకు వచ్చే ఫిలింనగర్ గీతాంజలి స్కూల్ కేంద్రానికి పోలింగ్ ముగిసే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమను పోలింగ్ స్టేషన్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని... టీడీపీ నేతలు మాత్రం యథేచ్ఛగా తిరుగుతున్నారని ఫిలింనగర్ కాంగ్రెస్ నేతలు నాగేందర్ దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో నాగేందర్ ఒక్కసారిగా కోపోద్రేక్తుడయ్యారు. అక్కడి పరిస్థితులు గమనించి వెంటనే బయటకు వచ్చారు. కొద్ది దూరంలో జూబ్లీహిల్స్ టీడీపీ అధ్యక్షుడు ఆకుల వెంకటేశ్వరరావు ఫోన్ మాట్లాడుతూ అటు నుంచి వస్తుండగా నాగేందర్ అతడిని ఆపారు. ‘నీకు ఇక్కడేం పని’ అని ప్రశ్నిస్తుండగానే... కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. వెంకటేశ్వరరావుపై దాడికి దిగారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వెంకటేశ్వరరావును అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
అదే సమయంలో టీడీపీ నేత సలీం అటు నుంచి వస్తుండగానే రౌడీషీటర్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నాగేందర్‌కు చెప్పారు. దీంతో నాగేందర్ రౌడీలకు ఇక్కడేం పనంటూ ప్రశ్నించారు. ఆయన ఒకవైపు మాట్లాడుతుండగానే ఇంకోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు సలీంపైకి దూసుకెళ్లారు. దీంతో మరోమారు ఉద్రిక్తత ఏర్పడింది. అరగంటపాటు ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం సృష్టించారు. సుమారు వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కటై అక్కడున్న పలువురు టీడీపీ కార్యకర్తలను వేలెత్తి చూపుతూ పోలీసులకు అప్పగించారు. ఇంకోవైపు టీఆర్‌ఎస్ కార్యకర్తలపై కూడా దాడి జరిగింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు మరోమారు లాటీచార్జ్ చేశారు.
పరిస్థితి ఎంతకూ అదుపులోకి రాకపోయేసరికి భారీగా పోలీసులు మోహరించారు. డీసీపీ సత్యనారాయణ రంగప్రవేశం చేశారు. వంద మంది టాస్క్‌ఫోర్స్ పోలీసులు గీతాంజలి స్కూల్‌ను, పక్కనే ఉన్న మాగంటి కాలనీ స్కూల్ పోలింగ్ బూత్‌లను చుట్టుముట్టారు. అల్లర్లు జరగకుండా అడ్డుకున్నారు. కొద్దిసేపటికే టీడీపీ నేతలు అక్కడికి చేరుకొని దానం నాగేందర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె గోవర్ధన్‌రెడ్డి అక్కడే బైఠాయించి తక్షణం గీతాంజలి స్కూల్ పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ జరపాలంటూ డిమాండ్ చేశారు. తమ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టారంటూ ఆరోపించారు. ఒకవైపు టీడీపీ, మరోవైపు టీఆర్‌ఎస్ కార్యకర్తలు బైఠాయించి కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. మొత్తానికి పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలను రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తరలించారు.