సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెల 10న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో భద్రత కోసం ఎన్నికల కమిషన్ గట్టి చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్న ప్రాంతాల్లో భద్రత కోసం ఈ సంస్థ అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీలు, వెబ్ కెమెరాలను అమర్చడంతోపాటు పారామిలిటరీ బలగాలను అదనంగా మోహరిస్తారు.
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సంఖ్య తగ్గిందని ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. ఇవి ఎక్కువగా గ్రామీణ, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, అనధికార కాలనీలు, ముస్లిం ప్రాబల్య ప్రాంతా ల్లో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల కోసం ఢిల్లీలో 2,527 పోలింగ్ కేంద్రాల్లో 11,763 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ చెప్పారు.
పోలీసులు, ఎన్నికల అధికారులు అందించిన సూచనల మేరకు ఢిల్లీలో 317 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా, 90 పోలింగ్ కేంద్రామని అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించామని ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా భద్రత కోసం 31 వేల మంది ఢిల్లీ పోలీసులను, నాలుగు వేల మంది హోంగార్డులను, 40 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరిస్తారు. వీరిలో ఎక్కువమందిని సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మోహరిస్తారు.
భద్రతా సిబ్బందితోపాటు 93 వేల మంది ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల విధుల్లో మోహరిస్తారు. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీల కోసం 88 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఢిల్లీలోకి అక్రమంగా మద్యం, ఆయుధాలు, నల్లధనం ప్రవేశాన్ని నిలువరించడానికి ఈ చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ఇవిగాక ఢిల్లీలో 491 చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు జరుగుతున్నాయి. ప్రతి పోలీసు స్టేషన్‌లో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌ను సిద్ధంగా ఉంచారు. ఢిల్లీలో మొత్తం 161 ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహిస్తాయి.
పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా
Published Fri, Mar 28 2014 10:25 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement