సాక్షి, ఒంగోలు: జిల్లాలో మరో రెండు నియోజకవర్గాలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 12 నియోజకవర్గాలతో తాజాగా రెండు కలిస్తే..మొత్తం 14 నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నట్లు అధికార వర్గాల సమాచారం. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. పునర్విభజన ప్రక్రియకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా గణాంకాల సేకరణపై దృష్టి సారించింది.
వచ్చే సాధారణ ఎన్నికల్లోగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌లోని 294 నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రానికి 119, ఆంధ్రరాష్ట్రానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించారు. అయితే పునర్విభజన అనంతరం తెలంగాణలో అసెంబ్లీల సంఖ్య 175, ఆంధ్రలో నియోజకవర్గాల సంఖ్య 225కు పెరగనున్నట్లు ఇప్పటికే ఎన్నికల కమిషన్ తేల్చింది. ఈ మేరకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందించాల్సి ఉంది.
జనాభా ప్రాతిపదికన..
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మూడు లేదా నాలుగు మండలాల కంటే ఎక్కువగా ఉండకుండా ..కొత్త నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశమున్నట్లు అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం ఒంగోలు లోక్‌సభ పరిధిలో జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు మార్కాపురం, గిద్దలూరు, కొండపి, యర్రగొండపాలెం, దర్శి, కనిగిరి నియోజకవర్గాలున్నాయి. బాపట్ల లోక్‌సభ కింద జిల్లాలో అద్దంకి, పర్చూరు, చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాలున్నాయి.
వీటిల్లో అద్దంకి, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రాంతాల్ని విభజించి ఒక కొత్త నియోజకవర్గం ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. కందుకూరు అసెంబ్లీ మాత్రం నెల్లూరు లోక్‌సభ పరిధిలో ఉంది. సంతనూతలపాడు, కొండపి, యర్రగొండపాలెం రిజర్వుడు నియోజకవర్గాలుగా ఉండగా, పునర్విభజనలో జిల్లాకు మరో రిజర్వుడు నియోజకవర్గం రావచ్చని ప్రస్తుత ఓటర్లు, సామాజికవర్గ గణాంకాల ఆధారంగా అధికారులు అంచనా వేస్తున్నారు.
2008-09 డీలిమిటేషన్ జరిగినప్పుడు మార్టూరు, కంభం నియోజకవర్గాలు చీలిపోయిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గంలో రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది ఓటర్లున్నారు. తాజాగా చేపట్టనున్న కొత్త ఓటర్ల చేర్పులతో కలిపి ఒక్కో నియోజకవర్గానికి రెండు లక్షల ఓటర్లకు మించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. జిల్లా మొత్తం జనాభాలో బీసీల తర్వాత అత్యధిక జనాభా, ఓటర్లు ఎస్సీలున్న ప్రాంతం రిజర్వుడుగా మారే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
నియోజకవర్గాలు.. మరో రెండు
Published Thu, Aug 14 2014 3:57 AM | Last Updated on Thu, Apr 4 2019 4:46 PM
Advertisement