నేటితో నామినేషన్లకు తెర | Today is the last date for nominations | Sakshi
Sakshi News home page

నేటితో నామినేషన్లకు తెర

Published Wed, Nov 2 2016 3:47 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

Today is the last date for nominations

ఓటర్ల బ్యాంకు అకౌంట్లపై డేగకన్ను  
నగదు బట్వాడాకు అడ్డుకట్ట

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికల సమయాల్లో అక్రమాలకు పాల్పడకుండా అభ్యర్థులపై నిఘా పెట్టడం మామూలే. అయితే తమిళనాడులో తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏకంగా ఓటరుపైనే నిఘాపెట్టేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఓటుకు నోటు ప్రలోభాన్ని అడ్డుకునేందుకు ఓటర్లపైనా, వారి బ్యాంకు ఖాతాలపైనా నిఘాపెట్టి కొత్త సంప్రదాయానికి తెరదీసింది. మధురై జిల్లా అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో నగదు బట్వాడా సాగినట్లు కోర్టు భావించడం వల్ల గతంలో రద్దయ్యాయి. ఎమ్మెల్యే శీనివేల్ మృతి వల్ల తిరుప్పరగున్రం నియోజవర్గంతోపాటు తంజావూరు, అరవకురిచ్చిలో ఈనెల 19వ తేదీన పోలింగ్ జరుగనుంది.

అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, పీఎంకే, డీఎండీకే పార్టీలు తమ అభ్యర్దులను రంగంలోకి దింపాయి. సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే మినహా అన్ని పార్టీలూ అన్నాడీఎంకే చేతిలో డిపాజిట్టు కోల్పోయి భారీ ఓటమితో మట్టికరిచాయి. ఈసారి ఉప ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కకున్నా కనీసం మెరుగైన ఓట్లు రాబట్టుకునేందుకు కొన్ని పార్టీలు పాటుపడుతున్నాయి. ఇప్పటికే ఒకసారి నగదు బట్వాడా ఆరోపణలు ఎదుర్కొన్నందున ఉప ఎన్నికల్లో ఈ అపప్రధ నుండి తప్పించుకునేందుకు ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది.

ఉప ఎన్నికల్లో నిఘా చర్యలపై ఒక అధికారి మాట్లాడుతూ, ఓటర్లకు నగదు బట్వాడా జరుగకుండా మూడు నియోజకవర్గాల్లో ఐదు కంపెనీల కేంద్ర భద్రతాదళాలు, ఫ్లయింగ్ స్వ్క్డాడ్‌లు రంగంలో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం మరే రాష్ట్రంలోనూ ఎన్నికలు లేనందున ఈ మూడు నియోజకవర్గాలపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలో అదనపు బలగాలు వస్తున్నాయని తెలిపారు.

మూడు నియోజకవర్గాల్లోని అభ్యర్దులు ఎన్నికల నిబంధనలను తుంగలోతొక్కినట్లుగాా వ్యవహరిస్తే మరోసారి ఎన్నికలను వాయిదావేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. తంజావూరు, అరవకురిచ్చీల్లో వాహనాల తనిఖీల్లో రూ.7.12 కోట్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఓటర్లకు నగదు పంచేందుకు వీలులేని విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ పరిస్థితిల్లో అధికారుల కళ్లుగప్పి ఓటర్ల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చిందని ఆయన అన్నారు. అందుకే  ఓటర్ల బ్యాంకు ఖాతాలపై కూడా నిఘాపెట్టామని తెలిపారు. ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున సొమ్ము జమ చేయడం, డ్రా చేయడం జరుగుతోందాని ప్రతిరోజూ వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. అనుమానం వస్తే నియోజకవర్గాల్లోని ఓటర్ల ఇళ్లను కూడా తనిఖీ చేస్తామని అన్నారు.ఎన్నికల అధికారులతోపాటూ ఆదాయపు పన్నుశాఖ అధికారులు సైతం తనిఖీల్లో పాల్గొంటారని తెలిపారు.

అన్నాడీఎంకే అభ్యర్థికి చుక్కెదురు
తిరుప్పరగున్రం అన్నాడీఎంకే అభ్యర్థి ఏకే బోస్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఉదయకుమార్‌తోపాటూ కల్లంబల్ అనే గ్రామానికి వెళ్లారు. 2006 నుంచి 2011 వరకు ఏకే బోస్ ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిత్యం వహిస్తున్నారు. గ్రామానికి మౌళిక సదుపాయాలను కల్పిస్తామని గడిచిన రెండు ఎన్నికల్లోనూ హామీ ఇచ్చి ప్రజలను వంచించారని దుయ్యబడుతూ ప్రచారానికి వచ్చిన బోస్‌ను, మంత్రిని గ్రామస్తులు ముట్టడించారు.

గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో మంత్రి ఉదయకుమార్, అభ్యర్థి బోస్ వెనుదిరిగారు. పుదుచ్చేరీ నెల్లితోప్పు కాంగ్రెస్ అభ్యర్థి ముఖ్యమంత్రి నారాయణస్వామికి మద్దతుగా డీఎంకే కోశాధికారి స్టాలిన్ ఈనెల 13వ తేదీన పుదుచ్చేరీలో ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉండగా, తమిళనాడు, పుదుచ్చేరీల్లో ఉప ఎన్నికలు జరగుతున్న నాలుగు కేంద్రాల్లో నామినేషన్లకు బుధవారం తెరపడనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement