నాలుగు శాసన మండలి స్థానాలకు ముగిసిన ఎన్నికలు
బెంగళూరు: నాలుగు శాసనమండలి స్థానాల కోసం గురువారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దీంతో అటు రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఇటు ఎన్నికల కమిషన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈనెల 13న వెల్లడి కానున్నాయి. దక్షిణ గ్రాడ్యుయేట్ నియోజక వర్గం, పశ్చిమ ఉపాధ్యాయ నియోజక వర్గం, వాయువ్య గ్రాడ్యుయేట్ నియోజకవర్గం, వాయువ్య ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో 3,48,907 ఓటర్లు ఉండగా 59 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ప్రతి నియోజక వర్గంలో అధికార కాంగ్రెస్‌తోపాటు విపక్ష భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌లు తమ అభ్యర్థులను బరిలో దించగా వాయువ్య ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మాత్రం జేడీఎస్ సహకారంతో స్వతంత్ర అభ్యర్థి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మొదటి మూడు గంటలు కొంత నెమ్మదిగా ప్రారంభమైన పోలింగ్ అటు పై నెమ్మదిగా పుంజుకుంది. మొత్తం ఓటర్లలో.53.14 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.