13న జిల్లాలో యథావిధిగా ముఖ్యమంత్రి పర్యటన
కర్నూలు(అగ్రికల్చర్): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా ఖరారు చేసినట్లుగానే ఈనెల 13న జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక జరగనున్న ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని మినహాయించి జన్మభూమి కార్యక్రమాల నిర్వహణకు అనుమతివ్వడంతో సీఎం పర్యటనకు మార్గం సుగమమైంది.
ఈ మేరకు శుక్రవారం జిల్లా యంత్రాంగానికి అధికారిక సమాచారం అందింది. ఓర్వకల్లు మండలం కాల్వ, హుసేనాపురం.. బనగానపల్లె మండలం పసుపుల గ్రామాల్లో నిర్వహించనున్న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, ఇతర అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించారు.
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఆదేశించారు. 13న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న దృష్ట్యా శుక్రవారం రాత్రి ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం ముందుగా బనగానపల్లె, ఆ తర్వాత ఓర్వకల్లు మండలంలో ఆయన పర్యటించే అవకాశం ఉందన్నారు.
ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు వివిధ బాధ్యతలను అప్పగించారు. సమావేశంలో జేసీ కన్నబాబు, సీపీఓ ఆనంద్‌నాయక్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం మండల నోడల్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ జన్మభూమి కార్యక్రమాలను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
పింఛన్ల వెరిఫికేషన్ చేపట్టండి
వివిధ కారణాలతో నిలుపుదల చేసిన పింఛన్లపై మరోసారి వెరిఫికేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జన్మభూమి-మా ఊరు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లతో నిలుపుదల చేసిన పింఛన్లను పునఃపరిశీలన చేపట్టాలన్నారు.
అర్హులని తేలిన వారికి తిరిగి పింఛన్లు మంజూరవుతాయని వివరించారు. కర్నూలు నుంచి కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ మాట్లాడుతూ ఆళ్లగడ్డ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడం వల్ల రెండు రోజుల పాటు వెరిఫికేషన్ నిలిచిపోయిందన్నారు. అందువల్ల పునఃపరిశీలనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు.