మంచు ఫ్యామిలీ కొట్లాటలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుందా?. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైనట్టు ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఈ పొలిటికల్ అరంగేట్రానికి ఆళ్లగడ్డ వేదిక కానున్నట్టు సమాచారం.
మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనోజ్, మౌనిక దంపతులకు ఆహ్వానం వెళ్లింది. అయితే వీరిద్దరూ ఏకంగా వెయ్యి కార్లతో భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం, భూమా ఘాట్ నుంచి రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేస్తారని చర్చ నడుస్తోంది. అందులో భాగంగా తమ బలం నిరూపించుకునేందుకు ఇలా ర్యాలీగా వస్తున్నారనే సమాచారం.
భూమా కుటుంబంలో ప్రస్తుతం టీడీపీ నుంచి నాగిరెడ్డి పెద్ద కూతురు అఖియప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, అఖిలప్రియతో ఉన్న కొన్ని ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో మౌనిక.. జనసేన వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ కారణంగానే జనసేనలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనలో ఉంటే టికెట్ కూడా దక్కే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక, మౌనిక పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ గతంలోనే కీలక కామెంట్స్ చేశారు. అంతకుముందు తిరుమల దర్శనానికి వెళ్లిన సమయంలో మనోజ్ మాట్లాడుతూ.. మౌనిక రాజకీయాల్లోకి వెళ్లితే కచ్చితంగా తన మద్దతు ఉంటుందన్నారు. ఇదే సమయంలో తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదన్నారు. రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే కోరిక మాత్రం తనకు ఉందన్నారు.
రాజకీయాల్లో భూమా ఫ్యామిలీ..
భూమా కుటుంబం రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక నేతలు.. వారి మరణం తర్వాత భూమా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిలప్రియ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆమె 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున ఆళ్లగడ్డ నుంచి పోటీచేసి విజయం సాధించారు. తండ్రి నాగిరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఇద్దరు టీడీపీలో చేరగా.. కొంతకాలానికి నాగిరెడ్డి మృతి చెందారు. ఇక, భూమా జగత్‌విఖ్యాత్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల బాధ్యతల్ని భూమా కుటుంబమే చూసుకుంటోంది. ఇప్పుడు భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment