వ్యయంపై నిఘా నేత్రం | Intelligence spending eye | Sakshi
Sakshi News home page

వ్యయంపై నిఘా నేత్రం

Published Thu, Mar 6 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM

వ్యయంపై నిఘా నేత్రం

వ్యయంపై నిఘా నేత్రం

  • ఇదే తొలిసారి.. పెద్ద ఎత్తున పర్యవేక్షకులు
  •  ప్రత్యేక కమిటీలు..  విస్తృత స్థాయిలో వీడియో రికార్డింగ్
  •  విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ఇదే తొలిసారిగా అభ్యర్థుల వ్యయంపై ఎన్నికల కమిషన్ అపూర్వ స్థాయిలో పర్యవేక్షణ చేస్తోంది. అడుగడుగునా నిఘా పెట్టి, అభ్యర్థులు చేపట్టే ప్రతి ఖర్చును లెక్కించి, వారు ఉల్లంఘనలకు పాల్పడ్డారేమో నిర్ణయించనుంది.
     
     తొలిసారిగా అభ్యర్థుల ఖర్చులను పర్యవేక్షించడానికి అధికారులు పర్యవేక్షకులను రంగంలోకి దించుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలను సైతం ఏర్పాటు చేస్తున్నారు.
         
     ప్రతీ రెండు, మూడు సెగ్మెంట్లకు ఒక ఎన్నికల వ్యయ పర్యవేక్షకుడిని వేయనున్నారు. అలాగే ప్రతీ ఒక్క నియోజకవర్గానికి సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకుడిని నియమించనున్నారు.
         
     వీరితో పాటు వీడియో సర్వైలెన్స్ టీమ్‌ను పెట్టనున్నారు. ఇందులో ఒక అధికారి, వీడియోగ్రాఫర్ ఉంటారు.
         
     ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఈ నెల 12న నోటిఫికేషన్ వచ్చే వరకు అభ్యర్థులు చేసే ప్రతీ ఖర్చును పార్టీల ఖర్చుగా పరిగణిస్తారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి వారు చేసే ఖర్చులను అభ్యర్థులకు సంబంధించినవిగా గుర్తిస్తారు.
         
     అభ్యర్థులు నిర్వహించే సమావేశాలు, ర్యాలీలు, ఇతరత్రా కార్యక్రమాలను ఈ టీమ్‌లు రికార్డ్ చేస్తాయి. ముందుగా ఆయా రాజకీయ కార్యక్రమాలను రికార్డు చేస్తున్నట్లు మైక్‌లో ప్రకటించి అనంతరం ర్యాలీ లేదా సమావేశాల్లో ఏయే సామాగ్రి ఉపయోగించారు, ఎన్ని వాహనాలు, క్యాప్‌లు, జెండాలు, మైక్‌లు ఇలా ప్రతీ అంశాన్ని రికార్డు చేయనున్నాయి.
         
     రికార్డు చేసిన విషయాలను వీడియో వ్యూయింగ్ బృందం పరిశీలిస్తుంది.
         
     ప్రచార సామాగ్రికి సంబంధించి ప్రతీ దానికి ఒక ధరను ముందుగానే నిర్ధారించే రేటు చార్టును రూపొందించారు. దాని ప్రకారం అభ్యర్థులు వినియోగించే వాటికి లెక్కలు కడతారు.
     
     ఇందుకోసం ప్రత్యేకంగా ఉన్న ‘క్యూ’ షీట్ అనే ఒక ఫార్మాట్‌ను తయారు చేశారు.
         
     ఒక్కో అభ్యర్థికి సంబంధించిన ఖర్చులను, ప్రచారాల్లో వినియోగించే సామాగ్రి వివరాలను ఈ క్యూషీట్‌లో పొందుపరుస్తారు.
         
     ఆ క్యూ షీట్ పరిశీలనకు అకౌంటింగ్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టీమ్ ఒక్కో అభ్యర్థికి సంబంధించి షాడో ఎక్స్‌పెండిచర్ రిజిస్టర్‌ను నిర్వహిస్తుంది. అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలను అధికారులకు తప్పుగా సమర్పిస్తే.. ఈ క్యూ షీట్ ద్వారా ఎంత ఖర్చు చేశారో అధికారులు గుర్తించి వారిపై ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమిస్తారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement