చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల సూక్ష్మపరిశీలకుల (మైక్రోఅబ్జర్వర్లు) పాత్ర కీలకమని, వారు ఇచ్చే నివేదిక ఆధారంగానే రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కే రాంగోపాల్ చెప్పారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో సూక్ష్మ పరిశీలకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకులు వ్యవహరించాల్సిన పలు అంశాలపై సమగ్రంగా వివరించారు.
అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు సూక్ష్మ పరిశీలకుడు ఇచ్చే నివేదికతో పాటు ప్రిసైడింగ్ అధికారి డైరీని కూడా ఆధారంగా తీసుకుని రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందన్నారు. పోలింగ్ కేంద్రం లోపల అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా ? లేదా అనే విషయాన్ని చెక్‌లిస్టు ఆధారంగా పరిశీలించి నిర్ధారించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రం బయట ఎన్ని గొడవలు జరిగినా లోపల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంటే పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు.
ఎక్కువ మంది అభ్యర్థులు పోటీచేస్తున్న చోట అందరి ఏజెంట్లను అనుమతించడానికి స్థలం సమస్య వస్తుందని, అక్కడ ప్రాధాన్య క్రమంలో జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు కలిగిన పార్టీల ప్రాతిపదికన ఏజెంట్లను అనుమతించాలని చెప్పారు. మీడియా ప్రతినిధుల్లో కూడా జిల్లా ఎన్నికల అధికారి జారీచేసిన గుర్తింపుకార్డులు ఉన్నవారినే లోనికి అనుమతించాలన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించాలని, సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించాలని, అప్పటివరకు వరుసలో ఉన్న అందరినీ ఓటింగ్‌కు అనుమతించాలన్నారు.ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, డీఆర్వో శేషయ్య పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మపరిశీలకుల పాత్ర కీలకం
Published Sun, May 4 2014 4:22 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement