కాంగ్రెస్ నేతలపై పోలీస్ దాడులు
చీపురుపల్లి(మెరకముడిదాం),న్యూస్‌లైన్: జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలపై పోలీసులు ఎట్టకేలకు ఉక్కుపాదం మోపారు. ఇప్పటివరకు తమకు అడ్డూ అదుపు లేదని ఇష్టానుసారం వ్యవహరించిన ఆ పార్టీ నేతలకు మొట్టమొదటి సారిగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
తాము చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్న తీరులో అందర్నీ శాసిస్తూ, అడ్డు చెప్పిన అధికారులకు జిల్లాలో స్థానంలేకుండా చేసిన కాంగ్రెస్‌నేతలకు ఇప్పటి తమ పరిస్థితి అర్థమయింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల ముందు ఎంతటి వారైనా ఎక్కువ కాదని పోలీసులు నిరూపించారు.కోడ్ ఉల్లంఘించి, డబ్బులు పంచుతున్నారన్న సమాచారం రావడంతో దాడి చేసిన పోలీసులు, ఆ నేతలను పరుగులు పెట్టించారు.
బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలోని మెరకముడిదాం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ గురువారం సమావేశం నిర్వహించడమే కాకుండా డబ్బులు పంపిణీ చేస్తుండగా ఓఎస్‌డీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు.
ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్, కాంగ్రెస్ నేత శిరువూరు వెంకటర మణరాజు, మెరకముడిదాం ఎంపీటీసీ అభ్యర్థి కెఎస్‌ఆర్‌కె ప్రసాద్,గుర్రాజు, లెంక భాస్కరరావుతో పాటు 14 మంది కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) అక్కడి నుంచి పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న 14 మంది కాంగ్రెస్ నేతలను బుదరాయవలస పోలీస్‌స్టేషన్‌కు తరలించి, వారి నుంచి రూ. 76,300 నగదు, సెల్‌ఫోన్లు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
మెరకముడిదాంలో ఎన్నికల సమావేశం జరుగుతోందని తెలిసి దాడి చేశామని, కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయడమే కాకుండా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తుండగా పట్టుకున్నామని ఓఎస్‌డీ ప్రవీణ్‌కుమార్ గురువారం రాత్రి మెరకముడిదాం మండలం బుదరాయవలస పోలీసుస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలోతెలిపారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బంధువు, జిల్లా కాంగ్రెస్ నేత మజ్జి శ్రీనివాసరావు కూడా అక్కడే ఉన్నారని, తమను చూసి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయినట్టు తెలిసిందన్నారు. ఆయన కోసం గాలిస్తున్నామని , ఆయన దొరక్కగానే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.