ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ఓటరు మహాశయుడిని ప్రసన్నం చేసుకోవడానికి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కోట్ల రూపాయలు కుమ్మరించారు. గెలుపు కోసం తొక్కాల్సిన అడ్డదారులు అన్నీ తొక్కారు. ఇదే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా గుర్తింపు ముద్ర వేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఒక అసెంబ్లీ అభ్యర్థి రూ.28 లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.70 లక్షలు లోబడి ఎన్నికల్లో ఖర్చు చేయాలి. ఇది ఎన్నికల సంఘం నిబంధన. వాస్తవంగా అయితే అభ్యర్థులు అంతే ఖర్చు చేయాలి. కానీ వారు చేసిన ఖర్చు అంచనా వేస్తే కళ్లు తిరగాల్సిందే. కొన్ని చోట్ల కోట్లు దాటడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా పోటీ చేస్తున్న అభ్యర్థుల సార్వత్రిక ఎన్నికల ఖర్చు దాదాపు రూ.90 కోట్లు దాటినట్లు పరిశీలకుల అంచనా.
అత్యంత ఖరీదైన ఎన్నికలు
సాధారణంగా ఎన్నికలంటేనే ఖరీదైన వ్యవహారం. ఖర్చుతో కూడుకున్న పని. అలాంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులు ఈసారి ఎన్నికలను అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మార్చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పోటీ ఆధారంగా అభ్యర్థులు ఓట్ల కోసం కోట్లు కుమ్మరించారు. ఒకటి, రెండు నియోజకవర్గాల్లోనైతే రూ.కోట్లు ఖర్చయినా సరే కచ్చితంగా మనం గెలవాలంతే అంటూ అభ్యర్థులు మొండి పట్టుదలతో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఒక్కో అభ్యర్థి కనీసం రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. అభ్యర్థుల రోజువారీ ఖర్చు చూస్తే కనీసం రోజుకు అభ్యర్థుల వెంబడి 100 మందికిపైగా ఉండి ప్రచారం చేశారు.
ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి మద్యం అంతా అభ్యర్థి ఖాతాలోనే. రోజూ వీరికి పెట్టే ఖర్చు దాదాపు రూ.30 వేలు. పదిహేను రోజుల్లో కనీసం వీరి కోసం దాదాపు రూ.7 లక్షలు దాటింది. ఇక మద్దతుదారులు ప్రచారం చేయడానికి అద్దె వాహనాలు, ప్రచార వాహనాలు, కళాబృందాల ఖర్చు అదనం. రోడ్‌షో, బహిరంగ సభల ఏర్పాట్ల ఖర్చు కన్నా, ఆ కార్యక్రమాలకు జనాలను తరలించేందుకు పెట్టిన ఖర్చు రెట్టింపుగా ఉంటుంది. సభకు ఒక్కొక్కరికి రూ.200 నుంచి రూ.300 చొప్పున చెల్లించి జనాలను తరలించారు. ఇలా సభల కోసం 3 వేల నుంచి 5 వేల వరకు జనాలను తరలించారు. ఈలెక్కన వీరందరు పెట్టిన ఖర్చు రూ.50 లక్షలుపైనే ఉంటుంది.
రూ.కోట్ల కట్టలతో ఓట్ల కొనుగోలు
ఇక అన్నింటినీ మించి ఓట్ల కొనుగోలుకు రూ.కోట్లు ఖర్చు పెట్టారు. చాలా మంది అభ్యర్థులు తమ పరిధిలోని యువజన సంఘాల ఓట్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో యువజన సంఘానికి రూ.5 వేల వరకు అందజేశారు. ఒక నియోజకవర్గంలో సుమారు 200 యువజన సంఘాలు ఉంటాయి. ఈ లెక్కన రూ.10 లక్షలు చాలా నియోజకవర్గాల్లో యువజన సంఘాలకు ఆయా పార్టీల అభ్యర్థులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.
వీటితోపాటు మహిళా సంఘాలు, కుల సంఘాలు, అభివృద్ధి కమిటీలకు తాయిలాలు, విందులు, వినోదాలు అదనం. ఓటరు అడుగుతున్నాడు కాబట్టి ఇస్తున్నామని అభ్యర్థి, అభ్యర్థి ఇస్తున్నాడు కాబట్టి తీసుకుంటున్నామని ఓటరు ప్రజాస్వామ్యాన్ని వ్యాపారం చేశారు. ఎన్నికలకు ఒక రోజు ముందు మద్యం ఏరులై పారింది. గ్రామాల్లోని ప్రతి ఇంటికి ఒక మద్యం బాటిల్, రూ.500 చొప్పున అందించారు. ఆ ఒక్క రోజులోనే అభ్యర్థి రూ.లక్షల్లో ఖర్చు చేయడం గమనార్హం.
రూ.కోట్లలో ఖర్చు.. రూ.లక్షల్లో లెక్కలు..
ప్రసుత్తం ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఉండే ఏకైక అర్హత డబ్బులు ఖర్చు చేయడమే. పార్టీలు కూడా ఎంత ఖర్చు పెడుతారో నిర్ధారణకు వచ్చాకే టిక్కెట్లు కేటాయించే సంస్కృతి పెరిగింది. రూ.కోట్లు సులువుగా ఖర్చు చేస్తున్న అభ్యర్థులు లెక్కలు మాత్రం రూ.లక్షల్లో చూపిస్తున్నారు. ఎన్నికల సంఘం వ్యయ పరిమితిని దాటితే గెలిచినా వేటు వేసే అవకాశం ఉండడంతో, లెక్కల్లో పిసినారితనం ప్రదర్శిస్తున్నారు. అయితే అభ్యర్థుల ఖర్చును చూసిన ఓటరు ఇన్ని డబ్బులు ఎలా సంపాదించారని ఆశ్చర్యపోతున్నారు. ఇంత డబ్బు ఖర్చు చేసినా తమను ఓటరు దయ తలుస్తాడో లేదోననే గుబులు అభ్యర్థుల్లో మొదలైంది. ఏదేమైనా ఈ డబ్బు ఎన్నికల్లో ఎంత మేర ప్రభావం చూపిందో ఫలితాలు వచ్చే దాకా వేచి చూడాల్సిందే.
అద్దె వాహనాల్లో ఖర్చుల అంచనా..
ఒక ఎమ్మెల్యే అభ్యర్థి రోజు కనీసం 20 వాహనాలను తన మద్దతు దారులకు ఇచ్చి నియోజకవర్గంలో ప్రచారానికి పంపించారు. ఒక్కో వాహనానికి అద్దె రూ.1000, మద్దతు దారులకు రోజు రూ.3 వేలు చెల్లించారు. ఇలా ఒక వాహనానికి రూ.4 వేలు వెచ్చించారు. ఇలా పదిహేను రోజుల నుంచి లెక్కిస్తే ఒక అసెంబ్లీ అభ్యర్థి రూ. 15 లక్షలకు పైనే ఖర్చు చేశారు. ఇక ఎంపీ అభ్యర్థుల ఖర్చులకొస్తే ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గలేదని తెలుస్తోంది.
రూ.కోట్లలో ఖర్చు.. రూ. లక్షల్లో లెక్కలు
Published Thu, May 1 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM
Advertisement