రుణమో రామచంద్రా..! | The new twisting Les Cash transactions | Sakshi
Sakshi News home page

రుణమో రామచంద్రా..!

Published Sat, Dec 31 2016 2:29 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

రుణమో  రామచంద్రా..!

రుణమో రామచంద్రా..!

మూడు జిల్లాల్లో నిలిచిన ఎస్‌హెచ్‌జీ రుణాలు
2016–17 ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాల్సింది రూ.763.54 కోట్లు
నవంబర్‌ నాటికి కేవలం రూ.234.22 కోట్ల చెల్లింపులు
రుణాల కోసం 33,324 సంఘాల ఎదురుచూపులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు
క్యాష్‌లెస్‌ లావాదేవీలతో  కొత్త తిప్పలు
సంఘాల తీర్మానంతోనే రుణాలు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి  సంస్థ ఆదేశాలు


నల్లగొండ : మహిళా స్వయం సహాయక సంఘాల రుణాలకు బ్రేక్‌ పడింది. పెద్ద నోట్ల రద్దు వలలో చిక్కుకుని మహిళా సంఘాలు కొట్టుమిట్టాడుతున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను సంఘాలకు చెల్లించాల్సిన లింకేజీ రుణాలను బ్యాంకులు నిలిపేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి.. వారిని అన్ని రంగాల్లో బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. ప్రతి ఏడాది ఏప్రిల్‌ నుంచి బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రుణాలు మంజూరవుతుంటాయి. అదే పద్ధతిలో ఈ ఏడాది కూడా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. అప్పటికే జిల్లాల పునర్విభజనలో అధికార యంత్రాంగం బిజీగా ఉండటంతో రుణాలివ్వడంలో బ్యాంకులు వెనుకంజ వేశాయి. దీంతోపాటు ప్రభుత్వం విడుదల చేయాల్సిన పావలా వడ్డీ రాయితీ కూడా బ్యాంకుల్లో జమ కాలేదు. ఈ క్రమంలో బ్యాంకర్లు రుణాలు ఇవ్వకుండా మొండికేశారు. ఇదే క్రమంలో కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేయడంతో రుణాల మంజూరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది.

ఇదీ పరిస్థితి....
2016–17కుగాను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 43,825 సంఘాలకు రూ. 763.54 కోట్లు రుణ లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఈ మేరకు అక్టోబర్‌ మాసాంతానికి కేవలం 10 ,501 సంఘాలకు రూ.234.22 కోట్లు మంజూరు చేశారు. నిర్ధారించిన లక్ష్యం ప్రకారం బ్యాంకులు నవంబర్‌ నాటికి 21,898 సంఘాలకు రూ.397.61 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ.. పది వేల సంఘాలకు మాత్రమే రుణాలు ఇచ్చాయి. దీంతో 33,324 సంఘాలు రుణాల కోసం ఎదురుచూస్తున్నాయి.

మండలాల వారీగా ఇలా..
నల్లగొండ జిల్లాలోని చండూరు మండలంలో 737 సంఘాలకు రూ.15.21 కోట్ల రుణం ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 85 సంఘాలకు రూ.3.47 కోట్లు ఇచ్చారు. మిర్యాలగూడ మండలంలో 1,338 సంఘాలకు రూ.26.14 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 387 సంఘాలకు  రూ.11.28 కోట్లు మాత్రమే చెల్లించారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మండలంలో 1313 సంఘాలకు రూ.21.93 కోట్ల రుణాలు ఇవ్వాలి.  262 సంఘాలకు రూ.7.11 కోట్లు మాత్రమే ఇచ్చారు. చివ్వెంల మండలంలో 765 సంఘాలకు రూ.13.90 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. 69 సంఘాలకు రూ.2.15 కోట్లు ఇచ్చారు. యాదాద్రి జిల్లాలోని ఆలేరు మండలంలో 783 సంఘాలకు రూ.12.49 కోట్లు రుణాలు  ఇవ్వాలని నిర్దేశించగా.. 166 సంఘాలకు రూ.3.59 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. వలిగొండ మండలంలో 1,049 సంఘాలకు రూ.18.59 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. 255 సంఘాలకు రూ.7.19 కోట్లు చెల్లించారు.

తీర్మానం తప్పనిసరి..
రుణాలు రాక సంఘాలు సతమవుతున్న పరిస్థితుల్లో నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహి ంచడం కోసం చేపట్టిన చర్యలు సంఘాలను మరింత ఇబ్బందుల పాల్జేస్తున్నాయి. సంఘం లోని ప్రతి సభ్యురాలికి బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు ఉంటే తప్ప రుణం ఇచ్చే పరిస్థితి లే కుండా పోయింది. బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు, చెక్కుబుక్కు కలిగిన సంఘ సభ్యురాలికి మాత్రమే రుణం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. గతంలో రుణం మంజూరైన సంఘం బ్యాంకుకు వెళ్లి ఆ మొత్తాన్ని డ్రా చేసి సభ్యులకు పంచడం చేసేవారు. ప్రస్తుతం నగదు ర హిత లావాదేవీల వైపు మహిళా సంఘాలను మళ్లించాలన్న నిర్ణయంతో కొత్త నిబంధన వి ధించారు. రుణ మంజూరు పొందిన సంఘం సభ్యుల ఆమోదంతో తప్పనిసరిగా తీర్మానం చేయాలి. ఈ పత్రాన్ని బ్యాంకులకు అందజేయాలి. తీర్మాన పత్రంలో సభ్యుల బ్యాంకు ఖాతా నంబర్లు రాయాలి. దీంతో బ్యాంకర్లు రుణ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు. ఆ తర్వాత సభ్యులు ఏటీఎం నుంచి నగదు పొందాలి. సభ్యులు మరొకరి ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాల్సిన పరిస్థితి వస్తే చెక్కులు ఉపయోగించుకోవాలి. మొత్తంగా ఇక ముందు బ్యాంకుల నుంచి రుణాలు పొందే సంఘాలు నగదు రహిత లావాదేవీలనే కొనసాగించాలి. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ క్షేత్రస్థాయిలో సీసీలకు, ఏపీఎంలకు ఉత్తర్వులు జారీ చేసింది.

మూడు మాసాలే గడువు...
ఆర్థిక సంవత్సరం మరో మూడు మాసాల్లో ముగియనుంది. ఈ మూడు నెలల్లో బ్యాంకులు 33,324 సంఘాలకు రూ.529.32 కోట్లు రుణం ఇవ్వాల్సి ఉంది. నోట్ల రద్దు సమస్య నుంచి బ్యాంకులు ఇంకా కోలుకోలేదు. పూర్తిస్థాయిలో బ్యాంకులకు నగదు నిల్వలు చేరుకోలేదు.  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంత స్వల్ప వ్యవధిలో బ్యాంకులు ఏమేరకు రుణ లక్ష్యాన్ని పూర్తిచేస్తాయో వేచిచూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement