స్త్రీ నిధి అందేదెన్నడో..?
► జిల్లాలో 52,653 మహిళా సంఘాలు
► స్త్రీ నిధి రుణాల లక్ష్యం రూ.146 కోట్లు
► డ్వాక్రా సంఘాలకు ఇచ్చింది రూ.26 కోట్లే..
► మహిళల దరి చేరని ప్రభుత్వ పథకాలు
► గ్రామాల్లో అవగాహన కల్పించడంలో అధికారులు వైఫల్యం
పర్చూరు : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి.. పురుషులకు దీటు గా చట్టసభల్లో సైతం వారికి సమాన హక్కులు ఉండాలంటూ ప్రతి వేదికపై రాజకీయ పెద్దలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం మినహా వారికి ఒరిగిందేమీ లేదు. మహిళలను ఆర్థికంగా చైతన్యవంతుల్ని చేయాలని వారి కాళ్లపై వారు నిలబడేలా స్వయం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలు వారి దరి చేరలేదు. ముఖ్యంగా వారికి మహిళా సంఘాల్లో సభ్యులకు ఆపద వస్తే ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన స్త్రీ నిధి పథకం లక్ష్యం కూడా జిల్లాలో నీరుగారుతోంది. ఓవైపు స్త్రీనిధి రుణాల మంజూరు వేగవంతం చేయాలని వెలుగు ఏపీడీలు మండలాల్లో తిరిగి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నా రుణాల మంజూరు ముందుకు సాగక పోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆపదలో ఆసరాగా ఉండేందుకు..
మహిళా సంఘాలు బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్నప్పటికీ అత్యవసర సమయాల్లో సంఘాల సభ్యులకు ఆపద వస్తే ఆసరాగా ఉండేందుకు స్త్రీ నిధి రుణ పథకాన్ని వెలుగు ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. ఈ పథకంలో అర్హత పొందేందుకు సంఘంలో పొదుపు రూ. 4800 ఉంటే రుణం పొందడానికి అర్హత సాధిస్తారు. ఈ పథకంలో ఒక్కో సంఘానికి రూ. 1.5 లక్షలు రుణాలు అందిస్తారు. ఉత్తమమైన గ్రామ సంఘాలకు, ఉత్తమ గ్రూపులకు చెందిన ఇద్దరి నుంచి ముగ్గురు సభ్యుల వరకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు రుణ సదుపాయం పొందవచ్చు. ఇలా ఏడాదికి ఒక్కో మండలానికి రూ. 50 లక్షల రుణ లక్ష్యాన్ని ప్రభుత్వాన్ని నిర్థేశించింది. 2016-17లో 8 నెలలు పూర్తి అవుతున్నా.. ఇప్పటి వరకు 20 శాతం మాత్రమే పూర్తి కావడం గమనార్హం. 2017 మార్చి లోగా ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవడం గగనమే..
రుణ మంజూరులో అధికారుల నిర్లక్ష్యం..
జిల్లాలోని యర్రగొండపాలెం, దర్శి, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు, ఒంగోలు, కందుకూరు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో మొత్తం 52,653 స్వయం సహాయక మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు స్త్రీనిధి పథకంపై అవగాహన కల్పించి ఈపథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బుక్ కీపర్లు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. రుణ సదుపాయం కోసం అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. యర్రగొండలపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలానికి రూ. 89.34 లక్షలు, దోర్నాల మండలానికి రూ. 13.5 లక్షలు, దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలానికి రూ. 151.29 లక్షలు, కనిగిరి నియోజకవర్గంలోని హనుమంతునిపాడు మండలానికి రూ. 23.22 లక్షలు, వెలిగండ్ల మండలానికి రూ. 10.79 లక్షల నిధులు స్త్రీ నిధి రుణం కింద కేటాయించారు. అక్కడి అధికారుల నిర్లక్ష్యం వల్లే గ్రామాల్లోని సంఘాలకు ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వకపోవడం గమనార్హం.
నియోజకవర్గం డ్వాక్రా సంఘాల స్త్రీనిధి లక్ష్యం రుణాలు రుణాలు
సంఖ్య రూ.లక్షల్లో ఇచ్చినది ఇవ్వాల్సింది.
1. యర్రగొండపాలెం 3806 408.21 31.47 376.74
2. దర్శి 4,620 1078.69 251.1 827.59
3. పర్చూరు 6,223 1953.77 321.2 632.57
4. అద్దంకి 5,554 2044.11 326.31 1717.80
5. చీరాల 2,870 1523.89 496.11 1027.78
6. సంతనూతలపాడు 4,505 1477.38 226.34 1251.04
7. ఒంగోలు 1,743 1188.53 95.98 1092.55
8. కందుకూరు 4,848 951.54 126.35 825.19
9. కొండపి 6,243 940.23 248.21 692.02
10. మార్కాపురం 3,454 1378.41 239.95 1138.46
11. గిద్దలూరు 4,924 1563.2 150.13 1413.07
12. కనిగిరి 3,863 503.86 90.43 413.43
అందరికీ అవకాశం కల్పించాలి
స్త్రీనిధి పథకంలో అన్ని సంఘాల సభ్యులకు అవకాశం కల్పించాలి. నిర్దేశించిన గడువులోగా రుణాలు అందించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. రుణాలు సకాలంలో చెల్లిస్తున్న తరుణంలో రుణాలు మంజూరు వేగవంతం చేయాలి. - జ్యోతి జయకుమారి, పర్చూరు మహిళా సంఘం అధ్యక్షురాలు
లక్ష్యం చేరుకుంటాం
2016-17లో స్త్రీ నిధి పథకానికి సంబంధించి నిర్దేశించిన గడువులోగా తప్పకుండా లక్ష్యం చేరుకుంటాం. ఇప్పటికే దిగువస్థాయిలో అవగాహన కల్పించి వచ్చే ఏడాది మార్చి నాటికి మంజూరైన లక్ష్యం పూర్తి చేస్తాం.- కామేశ్వరరావు, స్త్రీ నిధి డివిజనల్ మేనేజర్