తెలుగులో క్లాసిక్ కామెడీ అని చెప్పుకోదగ్గ అతికొద్ది సినిమాల్లో ఒకటిగా పేరున్న సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. అరవై ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా ఇవ్వాళ్టికీ సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్యను సున్నితంగా ఆరోజుల్లోనే చెప్పింది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం...
చక్రపాణి విచిత్రమైన మనిషి. అలాంటి మనిషి ఒకడు ఇటు చుట్టుపక్కల ఎక్కడా ఉండడు అనుకుంటారంతా. ఇంటి నిండా నౌకర్లుంటారు. ఆస్తిపాస్తులు ఉన్నాయి. పెద్ద ఇల్లు. దర్జాగా బతకగలిగేంత డబ్బు. అయినా కానీ ఖర్చు విషయంలో మాత్రం రూపాయి రూపాయి లెక్కలేసుకుంటాడు. కొడుకు చనిపోయిన తర్వాత అతని ప్రపంచంలో, అతనిపై ఆధారపడి ఉన్న జీవితాలు ఐదున్నాయి. కోడలు, మనవడు, ముగ్గురు మనవరాళ్లు. అందరిలానే వీళ్లందరికీ అవసరాలున్నాయి. డబ్బుతో ముడిపడ్డ అవసరాలు. చక్రపాణి మాత్రం ఒక్క రూపాయి ఖర్చు చేయడానికి కూడా చాలా ఆలోచిస్తాడు. ఎందుకంటే అతనికో లక్ష్యం ఉంది. జీవితంలో లక్ష రూపాయలు కూడబెట్టాలని. ఆ కూడబెట్టిన డబ్బును కూడా అతనేం చేస్తాడంటే.. మనవడికి రాసిస్తాడంతే! చక్రపాణి స్వభావం మనవడికి నచ్చలేదు. ‘ఇలాంటి పిసినారి మనిషి ఇంటి పెద్దగా ఉన్న ఇంట్లో నేనుండలేను’ అంటూ ఇంట్లోనుంచి బయటికొచ్చేశాడు. ఎక్కడికి వెళ్లిపోయాడో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో చక్రపాణి తప్ప అంతా ఆడవాళ్లే. కొడుకు ఇంట్లోనుంచి వెళ్లిపోయిన బాధలో చక్రపాణి కోడలు విశాలాక్షి మంచాన పడింది. ‘‘నీ వెర్రి కాకపోతే వాడెక్కడికి పోతాడూ! సిరిగల వాళ్ల పిల్లలు ఎక్కడికీ పోరు. త్వరలోనే తిరిగివస్తారు. అసలు దేశం తిరిగిరావడం కూడా మంచిదే! అనుభవం కూడా వస్తుంది.’’ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు చక్రపాణి. కానీ ఆ మాటలు విన్న కొద్దిసేపటికే విశాలాక్షి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. చక్రపాణికి ఇప్పుడు ఒక లక్ష్యం ఉంది. లక్ష రూపాయలు కూడబెట్టడం. ఒక బాధ్యత ఉంది. ముగ్గురు మనవరాళ్ల పెళ్లిళ్లు చేయడం. పెద్ద మనవరాలు శాంతకి, రెండో మనవరాలు మాలతికి పెళ్లి కుదిర్చాడు. చక్రపాణి కుదిర్చిన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మాలతి ఇంట్లోనుంచి పారిపోయి మద్రాసు వెళ్లిపోయింది. శాంత పెళ్లి చేసుకొని భర్తతో వెళ్లిపోయింది.
మద్రాసు వెళ్లిపోయిన మాలతి కొన్నాళ్లకు అక్కడే వెంకటచలం అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చలం నిజాయితీపరుడు. అమాయకుడు. చలం, మాలతిలది చూడచక్కని జంట. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. మరోపక్క అంత పెద్ద ఇంట్లో చిన్న మనవరాలు రేవతితో ఒక్కడే అయిపోయిన చక్రపాణి, మొత్తానికి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. అక్షరాలా లక్ష రూపాయలు కూడబెట్టుకున్నాడు. పంతులుని పిలిపించి, తాను లక్ష్యాన్ని చేరుకున్నట్టు చెప్పుకున్నాడు – ‘‘కైలాసం గారూ! కష్టపడి, నిష్టూరాలు మోసి, ఉన్న ఆస్తికి ఓ లెక్క ఉంటే మంచిదని, లక్ష పూర్తి చేయడానికి పూనుకున్నాను. చేశాను. కానీ ఎవరికివ్వనూ?’’ ‘‘ప్రాప్తం కలవాళ్లు ఎవరో మరి!’’ అన్నాడు పంతులు. ‘‘అది కాదు కైలాసం గారూ! డబ్బు విషయంలో అందరూ నన్ను అపార్థం చేసుకున్నారు. పైగా పీనాసినంటూ గోల చేశారు. లక్ష పూర్తి చెయ్యాలి, మనవడికి ఇవ్వాలని ప్రతి రూపాయినీ పాపాయిలా పెంచాను. కానీ అది గ్రహించలేక వెళ్లిపోయాడు.. జగన్నాథం.’’‘‘చిత్తం! త్వరలో వచ్చే సూచనలు కూడా ఉన్నట్టు లేవు.’’‘‘మరి నేనేం చెయ్యను? ఇది వినండి బాగుందేమో.. నా ఆస్తి మూడోతరం వాళ్లకు ముట్టజెప్పాలని ఉంది.’’ ‘‘భేషుగ్గా ఉంది. మునిమనవడికి ఇచ్చి ముద్దులాడితే మోక్షం అని రాసుంది శాస్త్రాల్లో!’’ అన్నాడు పంతులు. చక్రపాణికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. తన జాతకాన్ని పంతులుకి చూపించి ఎన్నాళ్లు బతుకుతానో చూడమన్నాడు. ఒక్క రెండేళ్లు బతకగలరంటూ ఇబ్బంది పడుతూనే చెప్పాడు పంతులు. ‘‘చాలు. ఆ మాత్రం చాలు. మునిమనవడికి ఈ లక్ష రూపాయలు ఇచ్చి హాయిగా కన్ను మూస్తాను.’’ అన్నాడు చక్రపాణి. ‘‘తప్పకుండా జరుగుతుంది.’’ ‘‘అయితే.. మునిమనవడిని చూస్తానంటారా?’’ అని చిన్నగా నవ్వుతూ అడిగాడు చక్రపాణి. ‘‘ముమ్మాటికీ!’’ అన్నాడు పంతులు.
చక్రపాణి మునిమనవడికి ఆస్తిని ఇస్తానని కూర్చోవడం రేవతి ద్వారా శాంతకు తెలిసింది. శాంత అప్పటికే గర్భిణీ. మగబిడ్డ పుట్టాలని ఆమె దేవుడికి మొక్కుకుంది. ఆమె భర్త కూడా మగబిడ్డే పుట్టాలని, పుడితే చక్రపాణి ఇచ్చే ఆస్తిని అనుభవించవచ్చని కలకంటూ కూర్చున్నాడు. చక్రపాణికి కూడా ఆనందం పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు ఆ ఆస్తిని మునిమనవడికి ఇచ్చేసి, తానింక కాలం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. రేవతి రాసిన ఉత్తరంతో మాలతికీ చక్రపాణి తీసుకున్న నిర్ణయం తెలిసింది. శాంత కడుపుతో ఉన్న విషయం కూడా ఆ ఉత్తరంలో రాసింది రేవతి. మాలతికి ఏం చెయ్యాలో తోచట్లేదు. ఇంక ఆస్తంతా శాంతకే వెళ్లిపోతుందని భయపడిపోయింది. ఇక్కడ మాలతి పరిస్థితీ గొప్పగా ఏం లేదు. భర్త చలం ఇంకా సరైన ఉద్యోగంలో చిక్కనేలేదు. చక్రపాణి నుంచి ఆస్తి వస్తుందనుకున్నా వచ్చే పరిస్థితి లేదే అని బాధపడుతోంది. ఒక తుంటరి ఆలోచన చేసింది. తనకు మగపిల్లాడు పుట్టాడని అబద్ధమాడుతూ చక్రపాణికి ఉత్తరం రాసేసింది. చక్రపాణి ఆనందానికి అవధుల్లేవు. తన ఆస్తినంతా మాలతి కొడుక్కి రాసెయ్యాలని ఆలస్యం చెయ్యకుండా ఆమె ఇంటికి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు.మరోపక్క శాంత ప్రసవానికి కూడా రోజులు దగ్గరపడ్డాయి. అందరూ ఆసక్తిగా మగబిడ్డను కలకంటున్నారు. కానీ శాంత మాత్రం ఆడబిడ్డను కన్నది. చక్రపాణి మాలతి ఇంటికి చేరాడు. మాలతి ఎదురింట్లో ఉండే కొత్త జంటకు పుట్టిన మగబిడ్డను తన బిడ్డగా చక్రపాణికి చూపించింది. చక్రపాణి ఇంక ఆ పిల్లాడికే తన ఆస్తిని ఇచ్చెయ్యాలనుకున్నాడు. అప్పుడు బయటపడింది మాలతి నాటకం. చక్రపాణికి కోపమొచ్చింది. ఆ కోపంలో మాలతి తనకు చూపించి నమ్మించిన బాబుకే ఆస్తి రాస్తానన్నాడు. ఆ బాబు పేరూ చక్రపాణి అని, ఆ బాబుకి తండ్రి చక్రపాణి మనవడే అని, అతను ఈ ఆస్తిని ససేమిరా తీసుకోనంటాడని చక్రపాణికి ఆ నిమిషానికి తెలియదు.
Comments
Please login to add a commentAdd a comment