
కబలి (కబడ్డీ).. కబలి.. నేను ఆళ్తా.. అంటూ తన డైలాగులతో నవ్వించాడు చిన్నా అలియాస్ జితేంద్ర రెడ్డి. కామెడీ పాత్రలే కాదు ఆ ఇంట్లో వంటి చిత్రాలతో సీరియ్ పాత్రలు కూడా చేశాడు. శివ, పుట్టింటి పట్టుచీర, మనీ మనీ, మధురానగరిలో, పిట్టల దొర, అల్లుడా మజాకా, మురారి, సొంతం, గౌతమ్ ఎస్‌ఎస్‌సీ, ఇలా ఎన్నో సినిమాలు చేశాడు. ఇండస్ట్రీకి వచ్చి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా నటుడు చిన్నా ఓ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నాడు.
మాజీ సీఎం మేనల్లుడిని..
చిన్నా (Actor Chinna) మాట్లాడుతూ.. మాకు 25 ఎకరాల భూమి.. పొలంలోనే ఇల్లు, ఊర్లో థియేటర్‌లో ఉంది. కానీ నాకు సినిమాలపై ఆసక్తి. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో గోల్డ్ మెడల్ సాధించాను. తొలిసారి ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు సీనియర్ డైరెక్టర్ వంశీ హేయ్.. వెళ్లు అంటూ తరిమేశారు. ఇండస్ట్రీ ఇలా ఉంటుందా? అనిపించింది. అయినా ప్రయత్నాలు ఆపలేదు. కష్టపడి అవకాశాలు సాధించాను. ఇక్కడో విషయం చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి సోదరే మా అమ్మ.
అనారోగ్యం బారిన చిన్నా భార్య
నేను నటుడిగా పేరు తెచ్చుకున్నాక కేబినెట్ మీటింగ్‌కు పిలిచాడు. ఈయనెవరో తెలుసా? నా మేనల్లుడు అంటూ అక్కడున్నవారికి గర్వంగా చెప్పుకున్నాడు. కానీ ఎవరికీ నేను నా బ్యాక్‌గ్రౌండ్ చెప్పుకునేవాడిని కాదు. నాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. కానీ పెళ్లయిన పదేళ్లకు ఆమె ఆరోగ్యం దెబ్బతింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన రోజు ఆమె నడవలేకపోతున్నానంది. మల్టిపుల్ క్లీరోసిస్ వ్యాధి వల్ల వీల్‌చైర్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది.
రెడీ చేయడం దగ్గర్నుంచి అన్నీ నేనే..
రూ.4 లక్షలు పెట్టి తైవాన్ నుంచి వీల్‌చైర్ తెప్పించాను. అది మనం కూర్చోవడానికే కాకుండా నిలబడేందుకు సాయపడుతుంది. ట్రీట్‌మెంట్‌లో భాగంగా చాలాసార్లు స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఐదారేళ్లపాటు వీల్‌చైర్‌లోనే ఉంది. చివరి రెండేళ్లయితే తనకు రెడీ చేయడం, డ్రెస్ వేయడం, తినిపించడం.. అన్నీ నేనే చేశాను. అయితే ఎక్కువసేపు మంచానికే పరిమితవడం వల్ల శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. అది ఎక్కువవడంతో ఆస్పత్రిలో చేర్పించాం. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే శ్వాస తీసుకోవడానికి ఎక్కువ ఇబ్బందిపడింది.
నా చేయి పట్టుకుని..
మా ఆయన్ను చూడాలనుందని అక్కడివారికి చెప్పింది. ఆ విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నాను. ఏదైనా తాగాలనుందంది. గ్లూకోజ్ తెప్పించి గ్లాసులో కలిపి మూడు, నాలుగు చెంచాలు తాగిపించాను. నాకు ఇక్కడ ట్రీట్‌మెంట్ బాగోలేదు అని చిరాకు పడటంతో స్పెషల్ ఐసీయూకు షిఫ్ట్ చేయిస్తానన్నాను. తనను స్ట్రెచర్‌పై పడుకోబెట్టగానే నా చేయి పట్టుకుని నేనిక బతకనేమో అంది. అదే తన చివరి మాట. ఏం కాదు అని ధైర్యం చెప్పాను. కానీ 24 గంటల్లో అంతా అయిపోయింది.
ఒంటరినయ్యా..
ఇద్దరు కూతుర్ల పెళ్లి చూడకుండా 42 ఏళ్ల వయసులోనే తను మాకు దూరమైంది. కొన్ని నెలలపాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. నా కూతుర్లిద్దరిదీ లవ్ మ్యారేజ్. ఇద్దరికీ పెళ్లయిపోయాయి. ఇప్పుడు ఇంట్లో ఒంటరినయ్యాను. షూటింగ్ నుంచి ఇంటికి రాగానే శూన్యంలా అనిపిస్తుంది. రోజూ నా భార్య ఫోటోకు పూలు పెట్టి దండం పెట్టుకుంటాను అని చెప్పుకొచ్చాడు.
చదవండి: నటుడు చేసిన పనికి ఏడ్చేసిన అత్త.. గ్రేట్ అంటూ ప్రశంసలు!
Comments
Please login to add a commentAdd a comment