నిబంధనల మేరకే..
► అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక
► సర్వసభ్య సమావేశంలో ఎంపిక
► ఫిర్యాదు చేసిన వారే ప్రతిపాదించారు
► సీఈసీకి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ లేఖ
సాక్షి ప్రతినిధి, చెన్నై: నిబంధనల మేరకే తన నియామకం జరిగిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి తెలిపారు. పార్టీ సంప్రదాయం ప్రకారం సర్వసభ్య సమావేశం ద్వారా ప్రధాన కార్యదర్శిగా తనను ఎన్నుకున్నారని సీఈసీకి సమర్పించిన వివరణలో ఆమె పేర్కొన్నారు.అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత ఆమె స్థానంలో ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు. ఆ తరువాత నెలకొన్న విభేదాల వల్ల మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ తదితరులపై ఆమె బహిష్కరణ వేటు వేశారు.
నిరంతరాయంగా ఐదేళ్లపాటు సభ్యత్వంలేని శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన 12 మంది పార్లమెంటు సభ్యులు సీఈసీకి ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని ప్రకటించాలి్సందిగా వారు కోరారు. ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదుపై బదులివ్వాల్సిందిగా శశికళను సీఈసీ కోరింది. శశికళ తరఫున పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఇటీవలే సీఈసీకి వివరణ ఇచ్చారు. అయితే శశికళ ఇచ్చిన నోటీసుపై దినకరన్ బదులివ్వడం ఏమిటని సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
నోటీసును అందుకున్న శశికళనే ఈనెల 10వ తేదీలోగా బదులివ్వాలని ఇటీవల ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు 70 పేజీలతో కూడిన ఉత్తరం ద్వారా శుక్రవారం బెంగళూరు జైలు నుంచే సీఈసీకి శశికళ బదులిచ్చారు. గతంలో దినకరన్ ఇచ్చిన వివరాలనే శశికళ తరఫు న్యాయవాది సీఈసీకి సమర్పించారు. ప్రధాన కార్యదర్శిని పార్టీ సర్వసభ్య సమావేశం ద్వారానే ఎన్నుకుంటారని, తన నియామకం కూడా అదే రీతిన జరిగింది. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తులే పార్టీ సర్వ సభ్యసమావేశంలో తన పేరును ప్రతిపాదించగా సభ్యులంతా కలిసి ఎకగ్రీవంగా తనను ఎన్నుకున్నారు. పార్టీ నియమ నిబంధనలకు లోబడే ఎన్నిక జరిగిందని శశికళ వివరణ ఇచ్చారు.